Home తాజా వార్తలు పునరంకితం

పునరంకితం

CM KCR to Oppose NDA's New Power bill

 

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దీక్షతో పాటుపడుతుంది
– అవతరణోత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణత్యాగాల మీద సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమయిందన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిఎం కెసిఆర్ గన్ పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగ తి భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఎసిబి డిజి పూర్ణచందర్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్, ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సిలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎంఒ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలేనో అగ్రగామిగా ఉందని సిఎం అన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారం అయిందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటి తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
సిఎం కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళి అర్పించేందుకు సిఎం కెసిఆర్ కాన్వాయ్ స్తూపం వద్దకు చేరుకోనే సమయంలో ఓ యువకుడు ఆ కాన్వాయ్ వైపు దూసుకొచ్చాడు. సిఎం కారు డోర్ దగ్గరకు వెళ్లిన యువకుడు తనకు ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కావాలంటూ అరిచాడు. సిఎంను కలిసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని, సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుడు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి చెందిన హన్మంత్ నాయక్‌గా గుర్తించారు. భారీ సెక్యూరిటీ ఉన్నా కూడా యువకుడు కాన్వాయ్ వైపుఎలా దూసుకొచ్చాడు? దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బాలాజీని అభినందించిన సిఎం కెసిఆర్
తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజి తొలి కాతను మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఎంకి మొక్క ను, పండ్ల బుట్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొము రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామం లో 2 ఎకరాల్లో హెచ్‌ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. కెసిఆర్ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ బాలాజీని అభినందించారు. తెలంగాణ నేలల విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహారణ అని ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించారు.

CM KCR pays tribute at Gunpark