Saturday, April 20, 2024

కాంగ్రెస్‌ పార్టీది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Public Meeting In Haliya Nalgonda

హాలియా: నల్లొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అర్హులందరికి కొత్త పింఛన్లు మంజూరు ప్రక్రియ త్వరలో చేపడుతామన్నారు. నూతన రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామన్న సిఎం కెసిఆర్… నల్లగొండ జిల్లా అనాదిగా నష్టపోయిన జిల్లా అన్నారు. గతంలో ఏ నాయకుడు కూడా నల్లొండ జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు. హుజూర్ నగర్ ఎన్నిక నుంచి ఇప్పటి దాకా అనేక సమస్యలను గుర్తించినం. జరిగిన అన్యాయాన్ని సవరిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. ఏడాదిన్నరలోపు ఎత్తిపోతలన్నీ పూర్తి చేసుకుందాం. ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు. లిప్టులన్నీ పూర్తి చేసి మీకు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. ఒకసారి మాట ఇచ్చినమంటే తప్పం. దేవుడి దయవల్ల కృష్ణానదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అన్ని సందర్భాల్లో కృష్ణానదిలో నీళ్లుండవు. శాశ్వతంగా కృష్ణా ఆయకట్ట సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణ-గోదావరి అనుసంధానం చేసి నల్గొండ జిల్లా రైతుల కాళ్లు కడుగుతామని స్పష్టం చేశారు.

జిల్లాలో రూ.2500 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టాం. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా బిజెపి మాట్లాడుతోంది. మీలా మాట్లాడడం మాకు చేతగాక కాదు.. మేం తలుచుకుంటే దుమ్ము దుమ్మయి పోతరని వార్నింగ్ ఇచ్చారు. సభలదగ్గరికి వచ్చి ఏదో చేస్తామంటే కుదరదు. ఇక్కడెవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. పిచ్చివాగుడు మానుకోవాలని బిజెపి నాయకత్వానికి చెబుతున్నానని హెచ్చరించారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేయాలో మాకు తెలుసు. ఇలాంటివి చాలా చూసినం. రాకాసులతో కొట్లాడినం ఈ గోకాసులు లెక్క కాదు. తొక్కిపడేస్తం జాగ్రత్త అని సిఎం అన్నారు. మాకు ప్రజలు తీర్పు ఇచ్చిన్రు… ఢిల్లీ ఇచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హత లేదని వ్యాఖ్యనించారు. తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. మూడు ముక్కలు చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నేతలని ఫైర్ అయ్యారు. తెలంగాణలో దుర్భర పరిస్థితులు తెచ్చింది కాంగ్రెస్ నేతలేనని కెసిఆర్ తెలిపారు. అన్యాయం జరుగుతుంటే ఎవరైనా మాట్లాడారా.. పదువులు కోసం పైరవీల కోసం నోరు మెదపలేదు. లెక్క ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టాల్సింది ఏలేశ్వరం దగ్గర. కేఎల్ రావు ఇంకొందరు కుట్రలు చేసి 19 కిలో మీటర్ల కింద కట్టారు. ఆనాడు జరిగిన వంచనకు సాక్షీభూతాలు కాంగ్రెస్ నేతలని సిఎం చెప్పారు.

ఆంధ్రాకు అనుగుణంగా కడుతుంటే నోరు మూసుకున్నది ఎవరు. ఉద్యమం జరిగినన్ని రోజులు కాంగ్రెస్ నేతలు మాట్లాడతేదు. తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నోరు మెదపలేదన్నారు. నల్లొండలో ఫ్లోరైడ్ భూతం మనుషులను చంపేస్తుంటే ఎవరైనా మాట్లాడారా. ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేసింది ఒక్క టిఆర్ఎస్ పార్టీయేనని గుర్తుచేశారు. అన్యాయాన్ని ప్రశ్నించని వారంతా ఇవాళ పెద్దపెద్ద మాటట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి 24గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పోరుబాట ఎందుకోసం చేపడుతున్నారో చెప్పాలి. రైతుబంధు ఇస్తున్నందుకా..? రైతుభీమా ఇస్తున్నందుకా. రైతుబంధు ఇస్తుంటే కాంగ్రెస్ కడుపు మండుతున్నదా.. విజయ డెయిరీకి కాంగ్రెస్ ఒక్క పైసా ఇవ్వలేదు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నం. గతంలో వరి 30 లక్షల ఎకరాలు కూడా లేకుండె. ఇవాళ కోటి పది లక్షల ఎకరాల్లో వరిపంట సాగుతోంది. ఇంకో 25లక్షల ఎకరాలు అదనంగా పండించబోతున్నామని చెప్పారు.

ఇవాళ సూర్యాపేట జిల్లా ఎంత సుభిక్షమైందో చూడండి. ఆలేరు, భువనగిరి సస్యశ్యామలం కాబోతుంది. తెలంగాణ చేపట్టిన కార్యక్రమం దేశంలో ఎక్కడైనా ఉందా. కల్యాణలక్ష్మి దేశంలో ఎవరైనా ఇస్తున్నారా. కంటివెలుగుతో పేదల, వృద్ధుల చూపు బాగు చేసినం. ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు ఇస్తున్నం. కెసిఆర్ కిట్ రూపంలో బాలింతలను ఆదుకున్నం. లంచాల బాధ పోయిందా లేదా ఆలోచించండని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం. రైతులు ఏడుస్తుంటే కళ్లు మూసుకున్నారు. మత్స్యకారుల గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా. కోటి 60లక్షల చేప పిల్లలు పెంచుతున్నం. అనేక కులవృత్తులను ఆదుకునేందుకు రూపకల్పన చేస్తున్నం. గ్రామాల్లో నవీన క్షౌరశాలలు మంజూరు చేస్తున్నం. రూ.15వేల కోట్లతో రైతుబంధు ఇస్తున్నమన్న సిఎం.. అబ్బురపడే విధంగా రాష్ట్రంలో 2600 రైతు వేదికలు నిర్మించామన్నారు.

రైతు వేదికల్లో అందరూ కూర్చొని చర్చించాలి. రైతు వేదికలను రైతులకే అంకితం చేసినం. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టిఆర్ఎస్ ప్రభుత్వం. పల్లెప్రగతిలో గ్రామాల రూపురేణలు మారిపోయాయి. పల్లె ముఖ చిత్రం ఇంకా మారాలి. కాంగ్రెస్ రాజ్యంలో మనిషి చనిపోతే దహనం చేసి దిక్కులేదన్నారు. ఊరూరా వైకుంఠధామాల నిర్మాణం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకు వింత వింత బీమారీలు, విచిత్రమైన రోగాలున్నాయి. మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని గెలిపిస్తే నిలబెట్టుకుంటే బాగుపడతమని సిఎం తెలిపారు. నేను చెప్పింది నిజమే అయితే నాగర్జునసాగర్ లో గులాబీజెండా ఎగరేయండి. నేను గోల్ మాల్ మాటలు చెప్పను. కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR Public Meeting In Haliya Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News