Tuesday, April 16, 2024

జనంతో ఉండండి

- Advertisement -
- Advertisement -

KTR Calls to plants sapling on his Birthday

పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం

పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు
వచ్చే రెండు రోజులు భారీ వర్షాలే, ప్రజలూ జాగ్రత్తగా ఉండాలి
ఏడుగురు సభ్యులతో వరద నిర్వహణ బృందం ఏర్పాటు
చేయాలి వరదలపై అవగాహన ఉన్న అధికారులను అందులో చేర్చాలి 
వచ్చే 10వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశమున్నది
ముందస్తు అంచనాలతో, శాఖల సమన్వయంతో వంతెనలు, రోడ్లపై నిఘా వేయాలి : వరదలపై ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి వరదలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో క్షణ క్షణం పూర్తి స్థాయి లో అప్రమత్తంగా ఉండాలన్నారు. మహరాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు, మహాబలేశ్వరం లో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైందన్నారు. దీంతో ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరీ పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే పరిస్థితులున్నందున అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను సిఎం ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వతంగా ఏడుగురు సభ్యులతో ‘వరద నిర్వహణ బృందం‘ (ఫ్లడ్ మేనేజ్‌మెంట్ టీమ్)ను ఏర్పా టు చేయాల్సిన అవసరముందన్నారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల మీద మంచి అవగాహన కలిగిన అధికారులను ఈ కమిటీలో స్థానం కల్పించాలన్నారు. వచ్చే నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే పరిస్థితి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ బ్రిడ్జిలు, రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేయాలన్నారు. ఎగువ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అకాల వర్షాలకు మరింత వరద ఉదృతి పెరిగే పరిస్థితులు ఉత్పన్నమౌతున్నాయని పేర్కొన్నారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పకడ్బందీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని సమావేశం నుంచే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సూచించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సిఎస్‌ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్‌పిలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులకు సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రాకుండా చూడాలన్నారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల వాల్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి మరింత వరద ఉదృతి మరింతగా పెరగనున్నదన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శాశ్వత ప్రాతిపదికన ‘వరద నిర్వహణ బృందం’
మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని, వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధి కారులకు సిఎం సూచించారు. ఈ నేపథ్యంలో తక్షణమే వరద పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలో తెలిసిన ఏడుగురితో కూడిన సమర్థవంతమైన ఏడుగురు సభ్యులతో వరద నిర్వహణ బృందంను ఏర్పాటు చేయాలన్నారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలమీద అవగాహన కల్పించబడిన ఉన్నతాధికారులను నియమించాలి. ఈ బృందాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, వైద్యశాఖ, జిఎడి శాఖల గురించిన అనుభవం కలిగిన వారై ఉండాలన్నారు. ఈ సభ్యుల్లో ఒకరు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తూ వారికి తక్షణ పునరావాస క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన కలిగి ఉన్నవారై ఉండాలన్నారు. అలాగే ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్ ఎన్‌డిఆర్‌ఎఫ్ తదితర రక్షక వ్యవస్థలను అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను ఆదుకునేందుకు సమయస్పూర్తితో వ్యవహరించగలిగే మరో అధికారి కూడా ఉండాలని సిఎం అన్నారు. ఇట్లా వరద పరిస్తితిని ఎదుర్కునేందుకు అనుభవం కలిగిన శిక్షణ పొందిన అధికారులతో కూడిన ఫ్లడ్ మేనేజ్‌మెంట్ టీమ్ ను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
వానలు.. వరదల పరిస్థితిపై ఆరా
గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాలలో భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి వర్షపాతం నమోదు తీరును, ఎస్‌ఆర్‌ఎస్‌పి పై నుంచిమొదలుకుని కడెం, ఎల్లంపెల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్ ల పరిధిలో పాటు , కృష్ణ ఎగువన వరద పరిస్థితులపై సిఎం కెసిఆర్ ఆరా తీశారు. ప్రస్తుతం గోదావరికి వరద ఉదృతి పెరుగుతున్నదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యం లో సిఎస్ సోమేశ్ కుమార్ సహా నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన సిఎం కెసిఆర్ రక్షణ చర్యలకోసం పలు ఆదేశాలు జారీ చేశారు. భయపడాల్సిన పనిలేదని ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ప్రారంభించిందని సిఎం ధైర్యం చెప్పారు.తక్షణమే కొత్తగూడెం, ఏటూరు నాగారం మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు, ఆర్మీ చాపర్ లో సీనియర్ అధికారులను పంపించాలన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ టీమ్‌లను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న గోదావరి తీర ప్రాంతాల్లో నిరాశ్రయులకు షెల్టర్, బట్టలు, భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తక్షణ చర్యలకు సమావేశం నుండే సిఎం కెసిఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణా పరీవాహక ప్రాంతానికీ వరద ప్రమాదం
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రధానంగా మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైందన్నారు. ఈ పరిస్థితుల్లో ఎగువ రా్రష్ట్రాలనుంచి కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగే పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలన్నారు.అందుకుగాను నాగార్జున సాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను వెంటనే పంపించాలన్నారు. శుక్రవారం నుంచి నల్లగొండ ఇరిగేషన్ సిఇని నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ కోసం, వనపర్తి సిఇని జూరాల ప్రాజెక్టు పర్యవేక్షణలో ఉండాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఎలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిలలోని టిఆర్‌ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు.
మరిన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ టీమ్‌లను రప్పించాలి
వరదలనుంచి ప్రజలను రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలకై మరిన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ టీమ్‌లను రప్పించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. అవసరమైతే మరిన్ని హెలికాప్టర్‌లను కూడా తెప్పించాలని సిఎస్‌కు సూచించారు. గతంలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న సీనియర్, రిటైర్డ్ అధికారులను శుక్రవారం నుంచి పిలిపించుకుని ఆపత్కాలంలో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. శుక్ర, శనివారాల్లో కొనసాగే వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా శాఖలు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.
హైదరాబాద్ పరిస్థితిపైనా ఆరా
మూసీ నది వరద గురించి ఈ సందర్భంగా సిఎం ఆరా తీసారు. వరద ఉదృతి పెరిగే పరిస్థితిని అంచనా మూసి లోతట్టు లో నివాసం ఉంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం, తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలపై కటినంగా వ్యవహరించాలని, హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి అధికారులకు సిఎం స్పష్టం చేశారు.
ఆగస్టు 10 దాకా అప్రమత్తంగా ఉండాలి
ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణకోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ బ్రిడ్జిలు రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు.

CM KCR Review Meeting on Heavy Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News