Home తాజా వార్తలు జల్దీగా పనులు

జల్దీగా పనులు

CM KCR నిర్మాణంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల సత్వర పూర్తికి సిఎం ఆదేశాలు

కృష్ణా నీరు చాలకపోతే
ప్రత్యామ్నాయంగా గోదావరి నుంచి
ఖమ్మం, పాలమూరు ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్‌లో సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలలో చేపట్టిన ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయాలని ప్రభు త్వం లక్షంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలలో నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి పథకాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై విధంగా వ్యా ఖ్యానించారు. ఖమ్మం జిల్లాను ఆనుకునే గోదావరి నది ప్రవహిస్తుందని, ఆ జిల్లాలో అడవులు, వర్షపాతం కూడా ఎక్కువేనని, దుమ్ముగూడెం  వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉందని నొక్కిచెప్పిన కెసిఆర్ ఈ నీటిని 195 మీటర్ల ఎగువకు ఎత్తిపోస్తే ఖమ్మం జిల్లా మొత్తానికి సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుందని ఇంజనీర్లకు స్పష్టం చేశారు. ఇన్ని అనుకూలతలు ఉన్నా, ఖమ్మం జిల్లాలో కరువు తాండవించడం క్షమించరాని నేరమని, జిల్లానంతటినీ సస్యశ్యామలం చేసే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నారు.

దుమ్ముగూడెం వద్ద నుంచి గోదావరి నీటిని బయ్యారం చెరువు వరకు ఎత్తిపోసి జిల్లా అంతటికీ సాగునీరు అందించాలని, ఇందుకోసం అవసరమైన చోట్లలో రిజర్వాయర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల ద్వారా నీరు అందని ప్రాంతాలు గుర్తించి, స్థానిక వనరుల ద్వారా సాగునీరు అందించాలని, ఆర్‌ఓఎఫ్‌ఆర్, అసైన్డ్ భూములకు కూడా సాగునీరు అందించాల్సి ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి సి. లకా్ష్మరెడ్డి, శాసనసభ్యులు మర్రి జనార్థన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆలె వెంకటేశ్వరరెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, రాజేందర్ రెడ్డి, అబ్రహం, రామ్మోహన్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్, హరిప్రియా నాయక్, రాములు నాయక్, రేగా కాంతారావు, ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రాజెక్టులపై సిఎం కెసిఆర పై విధంగా వ్యాఖ్యానించారు.

సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయిన మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాల్సి ఉందని, ఒక్క జూరాల ద్వారానే ఎక్కువ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వల్ల నీరు సరిపోవడంలేదని, అందువల్లనే శ్రీశైలం సోర్సు ద్వారా నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించామని వివరించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా ఎక్కడికక్కడ అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణపు పనులను సత్వరం పూర్తిచేయాలని, చెరువులను నింపే ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

పాలమూరు జిల్లాలోని చెన్నోనిపల్లి రిజర్వాయర్‌ను ఉపయోగంలోకి తెచ్చేవిధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. ఏదైనా సందర్భంలో నీటి ప్రవాహం తగ్గిపోవడం వల్ల కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు నీరు లభ్యం కాని పరిస్థితుల్లో గోదావరి నీటిని అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజినీర్లకు సిఎం సూచించారు. ప్రతీ ప్రాజెక్టును నిర్మించడంతో పాటు, దాని నిర్వహణ కోసం అవసరమైన ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్‌ను రూపొందించుకోవాలని సూచించారు.

CM KCR Review meeting on irrigation projects