Thursday, April 25, 2024

పక్కాగా సాగునీటి ప్లాన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు సాగునీటి గోస తీరింది!
భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి
తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి
నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు రావాలి
రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడం మినహా ప్రభుత్వానికి మరో ప్రాధాన్యత లేదు
ప్రతి సంవత్సరం జూన్ మాసంలోగా ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మత్తుల పనులు పూర్తి అవ్వాలి
రాష్ట్రంలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి
సాగునీరు అందని ప్రాంతాలపై ప్రగతి భవన్‌లో నీటి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు సాగునీటి గోస తీరిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని… కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రం నీటి ప్రాజెక్టులతో కళకళలాడుతోందన్నారు. దీని కోసం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులను నిర్మించామన్నారు. వీటి ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వీలైంతన ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదన్నారు. దీని కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలని, తర్వాత రిజర్వాయర్లు నింపాలని, చివరికి ఆయకట్టుకు అందించాలన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఓటిలు ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలన్నారు. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ఆదేశించారు.

వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, కొప్పుల ఈశ్వర్, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నాగర్ కర్నూల్ ఎంపి పి. రాములు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంఎల్‌ఎలు మర్రి జనార్థన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్లు, జైపాల్ యాదవ్, రవిశంకర్, సంజయ్, కె. విద్యాసాగర్ రావు, కందాల ఉపేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్‌సిలు మురళీధర్, అనిల్, పలువురు సిఇలు, ఎస్‌ఇలు, ఇఇలు పాల్గొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించిన కతలాపూర్ జెడ్‌పిటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ లను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నదన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసిందన్నారు. ఉద్యమ స్పూర్తితో ప్రభుత్వం చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించిందన్నారు. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్షమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడిందని సిఎం పేర్కొన్నారు. అలా వచ్చిన నీటిని సంపూర్ణంగ వినియోగించుకోవాలన్నారు. వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని సూచించారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు పంపించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా లేదా అని మరో సారి పరిశీలించాలన్నారు. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలని సిఎం ఆదేశించారు. తొలత చెరువులను నింపిన. తర్వాతనే రిజర్వాయర్లను నింపాలన్నారు. చివరికి ఆయకట్టుకు నీరందించాలని స్పష్టం చేశారు. ఈ విధంగా ప్రణాళికా ప్రకారం నీటిని సరఫరా చేయాలన్నారు.

దీనివల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలన్నారు. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ. 45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్నా బోర్లకు నీరందుతుందన్నారు. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి వరకు రెండు టిఎంసిల నీటిని తరలించే వెసులుబాటు కలిగిందని సిఎం తెలిపారు. కాబట్టి ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలన్నారు. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయని, అవి జీవధారలుగా మారతాయని వ్యాఖ్యానించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టిఎంసిల నీటిని అంబాటులో ఉంచాలన్నారు. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్‌ఆర్‌ఎస్‌పిని వాడుకోవాలన్నారు. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలన్నారు. లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలని సిఎం చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయని, వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదన్నారు.

అలా నీరు అందని చెరువులను గుర్తించి, వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటిలు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలని ఆదేశించారు. ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలన్నారు. అటు ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉందన్నారు. వరద కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుందన్నారు. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నారు. వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి వరద కాలువ ద్వారా ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలన్నారు. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారని, కాని దానిని మార్చాలన్నారు. ఎల్లంపల్లి నుంచి 90వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందిండం సాధ్యమవుతుందన్నారు. మిగతా ఆయకట్టుకు ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు… కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలని సిఎం కెసిఆర్ సూచించారు.

రామన్పాడ్ రిజర్వాయర్‌ను నింపాలన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి…. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలని సిఎం అన్నారు. రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందన్నారు. దీంతో పాటు భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయన్నారు. చెరువులు బాగుపడడంతో కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందన్నారు. వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమన్నారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆపరేషన్ రూల్స్ రూపొందించాలన్నారు. నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుందని సిఎం స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్ పనులు, రిపేర్లు చేసుకోవాలని సూచించారు. ఈ పనులన్నీ జూన్ నాటికి సర్వం సిద్ధం కావాలని ఆదేశించారు. పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలన్నారు. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి ప్రతి జోన్‌కు ఒక సిఇని బాధ్యుడిగా నియమించాలన్నారు. సిఇ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలన్నారు. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి అని నాలుగు విభాగాలుగా ఉండొద్దన్నారు. నీటి పారుదల శాఖ అంతే ఒకే విభాగంగా పనిచేయాలన్నారు. అధికారులకు కావాల్సిన అధికారాలు అప్పగించాలని సూచించారు. ప్రతి స్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

CM KCR Review meeting on Irrigation projects

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News