Home తాజా వార్తలు మరో కొత్త చట్టం

మరో కొత్త చట్టం

 

మున్సిపాలనలో అవినీతికి అంతం

పంచాయితీరాజ్ చట్టం మాదిరిగా కొత్త పటిష్టమైన మున్సిపల్ చట్టాన్ని తీసుకొద్దాం
మెరుగైన పాలన కోసం చట్టాలను సవరించుకుందాం
పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల అధికారుల సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్

“ పంచాయితీ రాజ్ చట్టాన్ని మార్చి పటిష్ఠంగా రూపొందించిన పద్ధ్దతిలోనే, కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అధికారుల్లో జవాబుదారీ తనం పెంచాలి. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించే వారిపై అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను తీసుకరావలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్షం. ప్రజలకు మేలు జరిగేవిధంగా మున్సిపల్ కొత్త చట్టాన్ని రూపకల్పనచేయాలి. అనేక మున్సిపాలిటీల్లో ఇంకా తాండవం చేస్తున్న అవినీతిని సమూలంగా తొలగించాలి.”

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్దిలో పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను పటిష్టంగా అమలు చేయడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఉన్న చట్టాలను సవరించుకుంటూ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే గ్రామాలు, మున్సిపాలిటీలో మంచి పాలన అందించగలుగుతామన్నారు. పట్టణాలతో సమాంతరంగా గ్రామాలు సైతం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు చట్టాల రూపకల్పనలో పలు జాగ్రత్తలు తీసుకుని రూపొందించాలని సూచించారు. కొత్త చట్టాల రూపకల్పనలో ప్రజలకు మేలు జరగడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం కార్యాచరణ , నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పన పై సోమవారం ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎఆరూరు రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శలు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమీషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ పంచాయితీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్దతిలోనే, మున్సిపల్ చట్టాన్ని తీసుకరావాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారుల్లో జవాబుదారి తనం పెంచడంతో పాటు విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా…. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను తీసుకరావలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్షమన్నారు. ప్రజలకు మేలు జరిగేవిధంగా మున్సిపల్ కొత్త చట్టాన్ని రూపకల్పనచేయాలన్నారు. అనేక మున్సిపాలిటీల్లో అవినీతి అనే జబ్బు ఇంకా తాండవం చేస్తున్న నేపథ్యంలో దానిని కూకటివేళ్ళతో తొలగించే విధంగా నూతన చట్టం రావాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన పంచాయితీ రాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘
మనం మనుసు పెట్టి పనిచేస్తే గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిల్లో కావాల్సినంత పని ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. ఇక్కడ పని వొదిలి ఇంకెంక్కడనో వున్నట్టు నేల విడిచి సాము చేయవద్దని సూచించారు. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఇతర మౌలిక రంగాల అభివృద్ధి చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీలు దినదినాభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మేలయిన పాలన అందించవలసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన చట్టం అమలు విషయంలో అటు ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలుగితే అంత గొప్పగా సేవలందించగలుగుతామని” అని సిఎం అధికారులకు సూచించారు. ఆ దిశగా చట్టాన్ని రూపొందించాలని ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల అమలుతో పాలన మరింత మెరుగవ్వాలని సిఎం కెసిఆర్ అన్నారు. మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఈ చట్టాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలన్నారు.

CM KCR review meeting on new Panchayat raj act