Home తాజా వార్తలు చెరి సగం

చెరి సగం

CM KCR review meeting with officials on irrigation projects

 

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి వాటాలను మార్చాలి
811 టిఎంసిల ఉమ్మడి నికర జల వాటాను చెరిసగం చేయాలి

66:34 నిష్పత్తి చెల్లదు
కేటాయింపులు లేకుండా నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటే ఒప్పుకోం
 ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణ నీటి వాటాను నిర్ధారించకపోవడం అన్యాయం
తగిన వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతాం, పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక అక్రమ ప్రాజెక్టు
బేసిన్ అవసరాలు తీరిన తర్వాత మిగులు నీరు ఉంటేనే బేసిన్ బయటి అవసరాలకు ఇవ్వడం సహజ న్యాయం
ఈ నెల 9న కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలి
శనివారం నాడు ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్

ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి ఎగువన ఉన్నది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి రాష్ట్రానికి ఏర్పడింది. దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ వ్యవసాయాన్ని దండుగగా మార్చి, రైతులకు అన్యాయం చేశారు. పోరాటం చేసి సాధించుకున్న నూతన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రథమ ప్రాధాన్యతగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టి సాగునీటి గోసను తీర్చుకున్నాం. అత్యధిక దిగుబడులతో తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచింది.             – ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తిరస్కరించింది. ఈ సంవత్సరం నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేసింది. కృష్ణా జలాల్లో మొత్తం 811 టిఎంసిల నికర జలాల కేటాయింపుల్లో ఆంధ్ర, తెలంగాణ చెరి సగంగా 405.5 టిఎంసిల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా నీటిని వినియోగించుకోవాలని సమావేశం తీర్మానించింది. అలాగే కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం నిర్మిస్తున్న చట్టవ్యతిరేక అక్రమ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ఈ సమావేశం తీర్మానించింది. ఒక్క చుక్క నీటి కేటాయింపులు జరపకుండా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా ఎపి ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తుండడంపై ఈ సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఎపి ప్రభుత్వం అక్రమంగా చట్టవ్యతిరేకంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీం, సాగునీటి ప్రాజెక్టులలో నీటి ఎత్తిపోతలు, తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై శనివారం ప్రగతిభవన్‌లో సిఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి ఎగువన ఉన్నదన్నారు. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి రాష్ట్రానికి ఏర్పడిందన్నారు. దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

తద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని దండుగలా మార్చి, రైతులకు అన్యా యం చేశారన్నారు. పోరాటం చేసి సాధించుకున్న నూతన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధమ ప్రాధాన్యతగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టి సాగునీటి గోసను తీర్చిందన్నారు. దీంతో అత్యధిక దిగుబడులతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. ఇదంతా కూడా లిఫ్టుల ద్వారా నదీజలాలను ఎత్తిపోయడం ద్వారా మాత్రమే సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సిఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఇఎన్‌సి మురళీధర్ రావు, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్ పాండే, ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, జెన్కో డైరక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కృష్ణా, గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు
రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. రెండు పంటలకూ నీరందాలంటే జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించబడిన నీటిని, విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటామన్నారు. పలు ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్దంగా రాష్ట్రానికి కేటాయించబడిన నదీ జలాలను సాగునీటికోసం వాడుకుంటామన్నారు. అలాగే సాగునీటిని ఎత్తిపోసుకోవాల్సిన అనివార్యతను అధిగమించడానికి కావాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా తప్పకుండా కేటాయించబడిన నీటిని వినియోగించుకుంటామన్నారు. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలనూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదన్నారు. రాష్ట్ర వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతామని సిఎం కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు.

దౌర్జన్యంగా వాడుకుంటామంటే ఒప్పుకోం
నదీ జలాలమీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. అయితే కేటాయింపులు లేని నికరజలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోబోరని ఆయన పునరుద్ఘాటించారు.

నీటివాటాను నిర్ధారించకపోవడంపై ఆగ్రహం
దశాబ్దాలపాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదనీ, స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో రానివ్వబోమని సిఎం అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటివాటాను నిర్ధారించకపోవడంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే, ఇంకా సర్ ప్లస్ వాటర్ ఉంటే, అవుటాఫ్ బేసిన్ అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయమన్నారు.

దీన్ని ఎపి ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నేపథ్యంలో రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందన్నారు. జల విద్యుత్ తో లిఫ్టులను నడిపి తద్వారా రాష్ట్రం సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. సాగునీటితోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటుందన్నారు.ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదని సిఎం స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్ల ముందు, కెఆర్‌ఎంబి వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తన వాణిని వినిపిస్తుందన్నారు.

కాలు అడ్డం పెట్టుకుని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు
ఎపిలో మాదిరిగా తెలంగాణలో కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదని సిఎం అన్నారు. నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తి పోసుకోవాల్సిందేనని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 30 లక్షలకు పైగా బోరు మోటార్లున్నాయన్నారు. రాష్ట్రం మొత్తం విద్యుత్తులో 40శాతం విద్యుత్తు సాగునీటి అవసరాలకే వినియోగించబడుతున్నదన్నారు. రాష్ట్రానికున్న భూపరిస్థితుల దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరమని సిఎం వివరించారు.

రాష్ట్ర హక్కులను కాలరాస్తామంటే సహించం
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేకసార్లు ప్రకటించారని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా నాడు అదే విషయం చెప్పారన్నారు. కాని నేడు మాట మార్చి పోతిరెడ్డిపాడు పేరుతో ఎపి ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

పొరుగు రాష్ట్రాలతో చర్చించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సంయమనంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలు జరిపిందన్నారు. వారికి ఇబ్బంది లేని విధంగా, సహకరిస్తూ నిర్మాణం చేసిందన్నారు. ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అవలంభించేందుకు తమ స్నేహ హస్తం సాచినామని సిఎం గుర్తుచేశారు. అయినా వారు పెడచెవిన పెట్టడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమావేశం చేసిన తీర్మానాలు
1. పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక అక్రమ ప్రాజెక్టు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పోతిరెడ్డి పాడు కాలువకు నీటి ఎత్తిపోసే రాయల సీమ లిప్టు ఇరిగేషన్ స్కీం కూడా అక్రమ ప్రాజెక్టేనని సమావేశం తీర్మానించింది.
2. కృష్ణా జలాల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎన్ బ్లాగ్ అలొకేషన్స్ కేటాయించినా, వాటిని నిఖర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి.
3. జులై 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కెఆర్‌ఎంబి) నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలి. జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి.
4. పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అనుమతించబోమని, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కెఆర్‌ఎంబి సమావేశంలో తమ వాదనలను వినిపించాలని సమావేశం తీర్మానించింది.
5. ఇందుకు సంబంధించి తెలంగాణ ఎజెండా అంశాలను కెఆర్‌ఎంబీకి వెంటనే తెలపాలని నిర్ణయించింది.
6. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని తీర్మానించింది.
7. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కెఆర్‌ఎంబికి లేదు. జల విద్యుత్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎటువంటి ఒప్పందాల నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అంశంలో కెఆర్‌ఎంబికి జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపింది.
8. పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నదనే ఎపి ప్రభుత్వ దుష్ప్రచారాన్ని సమావేశం తిప్పికొట్టింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి తమ కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు సూచించింది. తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని సమావేశం ఆంధ్రా ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
9. సాగునీటిని ఎత్తిపోయడమేగాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలకు, రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానే ఉన్నదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని చట్టబద్దంగా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని సమావేశం స్పష్టం చేసింది.
10. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51శాతం ‘ క్లీన్ ఎనర్జీని’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు విడుదల చేసిన మార్గదర్శకాలను, జల విద్యుత్ ఉత్పాదన ద్వారా తెలంగాణ రాష్ట్రం అమలు పరుస్తున్నదని, ఇక ముందు కూడా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది.
11. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఆంధ్రా ప్రభుత్వం కెఆర్‌ఎంబికి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదం అని సమావేశం అభిప్రాయ పడింది.
12. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని గ్రీన్ ట్రిబునల్ స్టే ఇచ్చినా, దానిని ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైల్లో వేస్తామని ఎన్‌జిటి ప్రకటించిందన్నారు. అయినా మొండిగా సర్వేల ముసుగున పోతిరెడ్డి పాడు వద్ద పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని డంప్ చేసి, నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని సమావేశం అభిప్రాయ పడింది.
13. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలి, చెరువులను, కుంటలను నింపాలని సమావేశం నిర్ణయించింది.
14. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న సమ్మక్క బ్యారేజీ సహా సీతమ్మసాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు గా పిలువాలని సమావేశం తీర్మానించింది.
15. శ్రీశైలం డ్యామ్ మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్ ఉద్యోగులను తప్ప వేరెవరినీ అనుమతించవద్దని, శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి, రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజీలేని పోరాటం ఎంతవరకైనా కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది.

CM KCR review meeting with officials on irrigation projects