Wednesday, April 24, 2024

అంతర్రాష్ట్ర సర్వీసులకు సై

- Advertisement -
- Advertisement -

Pink-buses

 

ఒప్పందాలు చేసుకొని పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పండి
సిటీ బస్సులు ఇప్పట్లో నడిపేది లేదు
ప్రగతిభవన్‌లో ఆర్‌టిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు, 5గంటల సుదీర్ఘ భేటీ

మనతెలంగాణ / హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో బస్సులను నడపడం అంత శ్రేయస్కరం కాదని సిఎం కెసిఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుని బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. అలాగే కరోనాతో ప్రస్తుతం ఆర్‌టిసి కోల్పోతున్న ఆదా యం, సంస్థకు వస్తున్న నష్టాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఆర్‌టిసి ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సుమారు ఐదు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌టిసి సంస్థ ఆర్ధిక స్థితిగతులపై కూలంకషంగా చర్చించారు. ప్రస్తుతం కోవిడ్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నడుతున్నప్పటికీ ఆశించిన మేర ఆదాయం సమకూరడం లేదని అధికారులు సిఎం కెసిఆర్‌కు వివరించారు. అయితే లాభనష్టాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ మినహా, రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నడపాల్సిందేనని సిఎం అధికారులు సూచించారు.

వాస్తవానికి ఈ నెల 8 నుంచే నగరంలో బస్సులు నడపాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే నగరంలో కేసులు పెరుగుతుండటంతో తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ పరిధిలో మాత్రం సిటీ బస్సులు ఇంకా డిపోలకే పరిమితమయ్యాయి. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సుల రవాణా విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతున్నది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని మరికొద్ది రోజుల పాటు బస్సులను తిప్పకపోవడమే మంచిందని సిఎం వ్యాఖ్యానించారని సమాచారం. ఒక వేళ బస్సులను తిప్పాల్సి వస్తే…ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సిటీ బస్సులను ప్రయాణికులకు కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? తదితర అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

కంటైన్‌మెంట్ జోన్లను మినహాయించి మిగతా ప్రాంతాల్లో బస్సులు నడిపితే ఎలా ఉంటుందనే దానిపై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బస్సులు లేకపోవడంతో నగరంలో విధులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కొందరు అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే మరో కొద్ది రోజుల పాటు వేచి చూసిన అనంతరం సిటీ బస్సులను నడిపే విషయంలో తుది నిర్ణయం తీసుకుందామని సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో సిటీ బస్సులు నడిపే అంశంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సంస్థ ఎండి సునీల్ శర్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News