Thursday, April 18, 2024

వేగం పెంచండి

- Advertisement -
- Advertisement -

తక్షణమే రక్షణ సహాయ చర్యలు చేపట్టండి

అధికారులకు సిఎం
కెసిఆర్ ఆదేశం
వానలు, వరదల
పరిస్థితిపై 8గం.పాటు
ఉన్నతస్థాయి సమీక్ష
పరిస్థితి కుదటపడే
వరకూ జిల్లాల్లోనే
ఉండాలని మంత్రులు,
ఎంఎల్‌ఎలకు
దిశానిర్దేశం ముంపు
ప్రాంతాల ప్రజలను
సురక్షిత ప్రాంతాలకు
తరలించాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు రిజర్వాయర్లు నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో, తక్షణ రక్షణ చర్యలను కొనసాగించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. భారీ వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైనంతమేర తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. పరిస్థితులు చక్కబడేవరకు తమ తమ నియోజకవర్గాలు, జిల్లాలు విడిచి వెళ్లరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను, శాసనసభ్యులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరదల నేపథ్యంలో వరసగా రెం డు రోజుల పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యం త్రాంగాన్ని అప్రమత్తం సిఎం కెసిఆర్ బుధవారంనాడు కూడా ప్రగతి భవన్‌లో వానలు వరదల పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 6 గంటల పాటు సాగింది. వరదలు, రక్షణ చర్యలపై పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేశారు.

పరిస్థితులపై ఆరా

ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి వంటి పలు రిజర్వాయర్ల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ తగు ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన ముందస్తు చర్యలకు ఫోన్‌లో ఆదేశాలిచ్చారు. వరదల వల్ల రవాణా విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలను ఈ సందర్భంగా సిఎం ఆరా తీశారు.

కడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల తరలింపు

కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్నందున కడెం ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదల చేస్తున్నకారణంగా ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. కాగా అక్కడే ఉండి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్‌లో సిఎం కెసిఆర్ ఆదేశించారు. నిర్మల్‌తో సహా వరద ముంపునకు గురవుతున్న నదీ పరివాహక ప్రాంత పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సిఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలకు సూచించారు.

భధ్రాచలంలో రక్షణ చర్యలు చేపట్టండి

భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు.

విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు రాకుండా చూడండి

రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సిఎండిలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండి శ్రీధర్ లను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్తంభాలు కూలిపోతే 1600 వరకు పునరుద్ధరించామని, మిగతా పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు ఈ సందర్భంగా సిఎంకు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్ధరిస్తున్నట్టు సిఎండిలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డిలు వివరించారు.

ప్రాజెక్టులకు విపరీతంగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో, అవకాశమున్న చోటల్లా హైడల్ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిఎం అన్నారు. వరదల వల్ల పురోగతిలో ఉన్న దేవాదుల ప్రాజెక్టుల పనులకు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి తలెత్తిందని అధికారులు సిఎం కు వివరించారు. వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇఎన్‌సి మురళీధర్ రావును సిఎం కెసిఆర్ ఆదేశించారు.

నిధులు విడుదల చేయాలి

వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిఎస్, డిజిపిలను సిఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సిఎం కెసిఆర్ ప్రజలకు విజ్జప్తి చేశారు. కాగా ఈ సమీక్షా సమావేశం నుంచే వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్‌లో అడిగి తెలుసుకుని సిఎం కెసిఆర్ తగు ఆదేశాలు జారీ చేశారు.

విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు

భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌సి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి అధికారులు, సిఎంఒ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, జిహెచ్ ఎంసి, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News