Home తాజా వార్తలు నదుల అనుసంధానం, ఆర్‌టిసిపై సిఎం కెసిఆర్ సమీక్ష

నదుల అనుసంధానం, ఆర్‌టిసిపై సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR

 

11న దక్షిణాది రాష్ట్రాల నీటి సదస్సు

హైదరాబాద్ : కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు సంబంధించిన అంశాలపై సిఎం కెసిఆర్ చర్చించారు. ఈ క్రమంలోనే ప్రగతిభవన్‌లో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, నీటిపారుదల ఇఎన్‌సి మురళీధర్‌తో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నదుల అనుసంధానమే ప్రధాన అజెండగా జరిగే దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఈ నెల 11న బేగంపేట ఐటిసి గ్రాండ్ కాకతీయ హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సదస్సు జరగనున్నది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ హాజరుకానున్నారు. నదుల అనుసంధానంతో పాటు తమిళనాడులో తాగునీటి సమస్యపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల అంశంపై కూడా సదస్సులో చర్చిస్తారు. మన రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం “జల్ శక్తి” శాఖను తీసుకువచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మరోసారి సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించినట్లుగా సమాచారం.

నీటి సమస్య కొలిక్కి వచ్చేనా..!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు కొన్ని అపరిష్కృత అంశాలపై ఈ సదస్సులో జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకురానున్నారు. తొలుత ఈ సమస్యలు పరిష్కరించి, తర్వాత గోదావరి, కావేరి అనుసంధానంపై దృష్టి పెట్టాలన్నది కేంద్రం వ్యూహంగా నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా హాజరుకావాల్సి ఉంటుంది. 11న జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హైదరాబాద్‌కు వచ్చి, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుస్తారు. సందర్భాన్ని బట్టి, ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోనూ, దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోసం వచ్చి హైదరాబాద్‌లోనే ఉండే అధికారులతోనూ మాట్లాడి, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో చెన్నైకి తాగునీటి సరఫరాలో జరుగుతున్న ఆలస్యం, అలసత్వంపై తమిళనాడు ప్రభుత్వ అధికారులు కూడా తమ స్పందనను తెలియజేస్తారని తెలిసింది. పోతిరెడ్డిపాడు నుంచి చెన్నై తాగునీటి పేరుతో మళ్లించిన నీరు, అక్కడికి వాస్తవంగా వచ్చిన నీటి లెక్కలను చెబుతూ వారు తమ అభ్యంతరాలు, నిరసన వ్యక్తపరుస్తారని సమాచారం. కాగా, కేంద్ర జలవనరుల శాఖ దక్షిణాది రాష్ట్రాల భేటీతో సంబంధం లేకుండా ఎజెండాను ఖరారు చేసే పనిలో పడింది. ముసాయిదా ఎజెండా ఇప్పటికే సిద్ధం కాగా, ఇందులో మార్పుచేర్పులపై దృష్టిపెట్టింది. రెండు రాష్ట్రాల అధికారులతో, కృష్ణా, గోదావరి బోర్డులతో సంప్రదింపులు జరుపుతుంది.

ముసాయిదా ఎజెండా ప్రకారం ఇందులో కృష్ణా జలాల పంపిణీ, విధివిధానాలను ఖరారు, టెలీమెట్రీ వ్యవస్థ, గోదావరికి మళ్లించే నీటిలో ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలు, చెరువుల కింద జరుగుతున్న సాగుపై శాస్త్రీయ విశ్లేషణ, నీటి వినియోగం లెక్కలపై స్పష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలను ఎజెండాలో చేర్చారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్, కొత్త ప్రాజెక్టుల సమాచారం, డిపిఆర్‌లకు బోర్డుల అనుమతి, బోర్డు పరిధులు తేల్చడం, కృష్ణా బోర్డును విజయవాడకు తరలించడం వంటి వంటి అంశాలు ముసాయిదా ఎజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సదస్సుతో రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్య కొలిక్కి వచ్చేనా..? లేదా..? అనేది తేలియాల్సివుంది.

ఆర్‌టిసిపై సిఎం సమీక్ష

ఆర్‌టిసి సమ్మెపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై సిఎం సమీక్షించారు. రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరణపై మంత్రిమండలి నిర్ణయాన్ని ఆక్షేపించడంతో కేంద్ర చట్టాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులతో చర్చించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు రవాణా, ఆర్‌టిసి ఉన్నతాధికారులు హాజరయ్యారు.

CM KCR Review on Rivers Connectivity and RTC