Home తాజా వార్తలు రాష్ట్ర, దేశ క్షేమం కోరి మొదలైన మహారుద్ర సహస్ర చండీ యాగం

రాష్ట్ర, దేశ క్షేమం కోరి మొదలైన మహారుద్ర సహస్ర చండీ యాగం

CM KCR హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని స్వంత వ్యవసాయ క్షేత్రంలో ఐదు రోజుల పాటు జరిగే చతుర్వేద సహిత మహారుద్ర సహస్ర చండీయాగం సోమవారం ఉదయం నాలుగు వేదాల మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో, జగుద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞయాగాదులతో పాటు పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, ఋత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ తదితరాలతో పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. తెలంగాణ రాష్ర్టంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా, సుభిక్షంగా ఉండాలని , సమృద్ధిగా వర్షాలు కురవాలని, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని ఋత్విక్కులు పూజలు చేశారు. రాష్ర్టంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగువంతుణ్ణి ప్రార్ధించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 300 మందికి పైగా ఋత్విక్కుల ఆధ్వర్యంలో యాగం సాంప్రదాయబద్దంగా జరుగుతోంది.

గోపూజ, గురుపూజతో ప్రారంభం :

చతుర్వేద సహిత మహారుద్ర సహస్ర చండీ మహాయాగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు సోమవారం ఉదయం 11.00 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యజ్ఞ వాటికలో వేదోక్తంగా ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా తరలివచ్చిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో యజ్ఞం ప్రారంభమయింది. కర్ణాటకలోని జగద్గురు శృంగేరి పీఠానికి చెందిన తంగిరాల సీతారామ శాస్త్రి, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితలు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు యాగానికి వైదిక సారథ్యం వహించారు. ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞవాటిక చుట్టూ ఋత్విక్కులు వేద మంత్రాలు వల్లిస్తుండగా ప్రదక్షిణం చేసి చండీ యజ్ఞ వాటికలో పుణ్యాహవచనం నిర్వహించారు. సుమారు 300 మంది ఋత్విక్కులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1000 మోదాకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మధించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు మూడు గంటల పాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు.

ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృధ్ధ దంపతులకు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ర్ట శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పార్టీ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, మెదక్ లోక్‌సభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు లకా్ష్మరెడ్డి, శ్రీనివాసగౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలి సభ్యులు పూల రవీందర్, బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు కృష్ణమోహన్, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాగం శుక్రవారం మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతితో ముగుస్తుంది.

CM KCR, Sahasra Chandi Yagam యాగంలో పాల్గొన్న కెసిఆర్ కుటుంబ సభ్యులు :

లోక కల్యాణంతో పాటు ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న తలంపుతో జరుగుతున్న ఈ యాగంలో కెసిఆర్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. కెసిఆర్ కుమార్తె కవిత, వారి పిల్లలు, బంధువులు కూడా పాల్గొన్నారు. మూడేళ్ళ క్రితం ఆయుత చండీయాగాన్ని నిర్వహించిన కెసిఆర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ యాగంలో తొలి రోజున కొద్దిమంది ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరుకాగా మిగిలిన నాలుగు రోజుల్లో మరింత మంది హాజరవుతారని టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. యాగం కారణంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి ప్రత్యేక కళ వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ యాగం గురించి విశేషంగా చెప్పుకుంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి నాలుగు రోజుల క్రితం టిఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాపరెడ్డి కూడా ఈ యాగంలో పాల్గొన్నారు.

CM KCR Sahasra Chandi Yagam