Home తాజా వార్తలు చింతమడకకు త్వరలో కెసిఆర్

చింతమడకకు త్వరలో కెసిఆర్

Harish-Rao

రవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు .. సమావేశ, భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు ..రెయిన్ ఫ్రూప్ సభా వేదికను ఏర్పాటు చేయండి .. అసంపూర్తి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి ..మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిఎం కెసిఆర్ తన స్వగ్రామమైన చింతమడకకు త్వరలో వస్తుండడంతో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం చింతమడక గ్రామంలో క్షేత్రస్థాయి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 3600 మంది కూర్చునే విధంగా రెయిన్ ఫ్రూప్ సభావేదికను ఏర్పాటు చే యాలన్నారు. అధికారులకు 200 కుర్చీలు, ప్రెస్ గ్యాలరీకి 200 కుర్చీలు, గ్రామస్థులకు 3200 కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వన భోజనాలు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని, అక్కడే ఉన్న చింత చెట్టు కింద సిఎం కెసిఆర్ సహపంక్తి భోజనం చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామశివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని, సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్న బిసి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహస్థలాన్ని పరిశీలించారు. ఐకెపి గోదాం, సిసి ప్లాట్‌ఫామ్ వద్ద సభా సమావేశం జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేయాల న్నారు. సంబంధిత అధికారులు వారి పనుల్లో ఎలాంటి లోపం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థుల భోజన ఏర్పాట్లపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డిలతో చర్చించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా భోజ న ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఒ సురేష్‌బాబు, వ్యవసాయాధికారి శ్రవణ్, ఆర్‌అండ్‌బి ఈఈ సుదర్శన్‌రెడ్డి, డిఆర్‌డిఒ పిడి గోపాల్‌రావు, హౌసింగ్ శాఖ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, బిసి కార్పొరేషన్ ఇడి సరోజ, వివిధ శాఖల అధికారులు, సిద్దిపేట రూరల్ తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో సమ్మిరెడ్డి, చింతమడక సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR Soon To Visit Chintamadaka