Home తాజా వార్తలు కేబినెట్‌కు తొందరేం లేదు

కేబినెట్‌కు తొందరేం లేదు

 CM KCRఎన్నికల్లో గెలిచినవారంతా ఎంఎల్‌ఎలే
కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు వస్తానంటే వద్దంటానా..
ట్యాంపరింగ్ జరిగితే మా మంత్రులు ఓడిపోయేవారా?
రెండు బాకా పత్రికలు చంద్రబాబుకు డబ్బా కొడుతున్నాయి

హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రివర్గానికి ఇప్పుడేం తొందరలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఒకే మంత్రిత్వ శాఖ కింద దానికి అనుబంధంగా ఉండే శాఖలన్నీ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ, మార్కెటింగ్, కో ఆపరేటివ్ శాఖలు వేర్వేరు మంత్రుల దగ్గర ఉన్నాయని, ఆ శాఖలన్నీ ఒక మంత్రికి ఉంటే బాగుటుందని ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ మంత్రిత్వ శాఖలను క్రోడీకరించాలని చెప్పామని పేర్కొన్నారు. మంత్రులు ఆ శాఖ ఉద్దేశాలను నెరవేర్చాలని, అందుకు తగిన వారిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో పనిచేసిన మంత్రులు మెరుగైన సేవలందించడం వల్లనే మళ్లీ అధికారంలోకి వచ్చామని చెప్పారు. మంత్రివర్గంలో పాతవాళ్లతో పాటు కొత్త వాళ్లు కూడా ఉంటారని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినవారంతా ఇప్పుడు ఎంఎల్‌ఎలే అని స్పష్టం చేశారు. వారు ఎంఎల్‌ఎలు అయి అసెంబ్లీ మనుగడలోకి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ ప్రమాణ స్వీకారం అనేది కవేలం ఆ హౌస్‌లో రాజ్యాంగబద్దంగా చర్చల్లో పాల్గొంటామని ప్రమాణం చేయడానికి మాత్రమే అని పేర్కొన్నారు.

ఎంఎల్‌ఎలు మనుగడలోకి వచ్చారు కాబట్టే తాను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు. ఎంఎల్‌ఎలు మనుగడలోకి రాకపోతే తాను అపధ్దర్మ ముఖ్యమంత్రిని కావాలి కదా..? ధర్మ ముఖ్యమంత్రిని ఎలా అవుతానని ప్రశ్నించారు. గెజిట్ ప్రచురణ కావడంతో అందులో పేర్కొన్న తేదీతోనే అసెంబ్లీ మనుగడలోకి వచ్చినట్లు లెక్క అని స్పష్టం చేశారు. పార్లమెంట్ కార్యదర్శుల నియామకం విషయంలో అప్పీల్‌కు వెళ్లనున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. చత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో పార్లమెంట్ కార్యదర్శులు ఉన్నారని తెలిపారు. ఈ పదవుల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే నియమం ఉంటుందని, ఆ రాష్ట్రాలలో ఉన్న చట్టాన్ని చూసి తర్వాత ఆ పదవులను నియమిస్తామని తెలిపారు. పార్లమెంట్ కార్యదర్శుల వ్యవస్థ ఒక మంచి విధానమని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలను పార్లమెంట్ సెక్రటరీలుగా నియమిలైతే అది వారికి ఒక ట్రైనింగ్ లాగా ఉంటుందని, ఆ పదవిలో ఉన్నవారు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చని అన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఎన్నికల్లో తాము ట్యాంపరింగ్ చేసుంటే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయేవారా..? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగితే స్పీకర్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, చందూలాల్ ఎలా ఓడిపోయారని అన్నారు. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ చేసే గెలిచిందా..? అడిగారు.

మూడు రాష్ట్రాలలో జరగని ట్యాంపరింగ్ తెలంగాణలో మాత్రమే జరిగిందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మెదడే లేదు..మోస్ట్ సెన్స్‌లెస్ లీడరని విమర్శించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించరా..? ఇలా సొల్లు మాట్లాడినందుకే ప్రజలు వాత పెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందంటే ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం కాదా…? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించే ధీరత్వంలేని వారు నాయకులవుతారా..? అని ప్రశ్నించారు. తమ పార్టీలో నాయకులు ఓడిపోయారని, ఖమ్మంలో మా పార్టీ నేతలే కుట్రలు చేసుకుని ఒకరినొకరు ఓడించుకున్నారని తానే చెప్పానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు తమ పార్టీలోకి వస్తానంటే తాను వద్దంటానా..? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. నిబంధనల మేరకే శాసనమండలిలో కాంగ్రెస్ ఎంఎల్‌సిలు ఆ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారని అన్నారు. శాసనసభలో, శాసనమండలిలో తమ పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉందని, టిఆర్‌ఎస్‌లో చేరాలంని తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలే తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారు వస్తానంటే తానెలా వద్దంటానా అని వ్యాఖ్యానించారు.

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆ రెండు బాకా పత్రికలు డబ్బా కొడుతున్నాయని సిఎం కెసిఆర్ విమర్శించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటంతో బతికేస్తారని అన్నారు. ఆ రెండు పత్రికలు ఏమీ లేకపోయినా చంద్రబాబు అది చేశాడు..ఇది చేశాడు అంటూ రంగురంగుల ఫొటోలు ప్రచురిస్తూ డబ్బా కొడుతాయని ఆరోపించారు. ఆ రెండు పత్రికలు ఇక్కడ అవసరం లేని వార్తలను కూడా ప్రచురిస్తూ ఏ వార్త ఎక్కడిదో అర్థం కాకుండా అయోమయానికి గురి చేస్తాయని అన్నారు. విజయవాడకు సంబంధించిన వార్త ఇక్కడి ప్రజలకు ఏం అవసరమని ప్రశ్నించారు. అవసరమైతే రెండు పేజీలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి కానీ ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని అన్నారు. ఇక నుంచి తెలంగాణ వార్తలను ప్రముఖంగా ప్రచురించే పత్రికలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ పత్రికలు ఎపి సచివాలయంలో రాఫ్ట్ టెక్నాలజి కట్టబోతున్నట్లు బాకా కొట్టాయని విమర్శించారు. హైదరాబాద్‌లో కొన్ని వందల భవనాలు రాఫ్ట్ టెక్నాలజితో నిర్మించినవే అని పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ భవనాలు రాఫ్ట్ టెక్నాలజితో నిర్మించినవే అని చెప్పారు. మిషన్ భగీరథ కింద నిర్మించిన 35 వేల ట్యాంకులు కూడా రాఫ్ట్ టెక్నాలజితో నిర్మించినవే అని పేర్కొన్నారు. చంద్రబాబు దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తూ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. తాము చంద్రబాబు లాగా డబ్బా కొట్టుకోమని అన్నారు.

దేశం దగ్గర రూ. 20 లక్షల కోట్లు సిద్ధంగా ఉన్నాయి
ఫెడరల్ ఫ్రంట్ కోసం తాను చేస్తున్న ప్రయత్నాల ఫలాలు త్వరలోనే కొన్ని అందుతాయని, ఈ దేశం కొత్త ఆర్థిక నమూనాను, వ్యవసాయ నమూనాను కోరుకుంటోందని పేర్కొన్న కెసిఆర్ రైతుబంధు లాంటి పథకాలను అమలుచేయడానికి కేంద్రం దగ్గర రూ. 20 లక్షల కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ బిమల్ జలాన్ కమిటీ అధ్యయనం ప్రకారం ఆ బ్యాంకు దగ్గర సుమారు రూ. 10 లక్షల కోట్ల రిజర్వు ధనం ఉన్నదని, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ‘మహారత్న’ల దగ్గర మరో రూ. 11 లక్షల కోట్లు ఉన్నాయని, వీటిని దేశం కోసం ఎందుకు వాడుకోకూడదని వ్యాఖ్యానించారు.

CM KCR Speaks on Formation of Telangana Cabinet