Home తాజా వార్తలు భాగ్యనగరమిక విశ్వనగరమే

భాగ్యనగరమిక విశ్వనగరమే

CM-KCR,CM KCR Special Focus on Hyderabad City
ఆరేండ్లలో మారుతున్న సిటీ రూపురేఖలు

తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సిటి ఇమేజ్‌ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. నగరం చరిత్రలోనే తొలిసారిగా రూ.30 వేల కోట్లకు పైగా వ్యయంతో పలు నిర్మాణ కార్యక్రమాలు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణ రంగ ముడి పదార్ధాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృతమైన పురోగతి లభించింది. నగర అభివృద్ధికి తోడు ప్రపంచ దేశాల నుంచి ఎన్నో బహుళజాతి కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందించింది.

హైదరాబాద్: నగరంలో ముఖ్యంగా పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ సమస్య ఎప్పటినుంచో వేధిస్తుంది. జనాభాతోపాటు ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లను, అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, కారిడార్లు నిర్మించేందుకు 54 జంక్షన్లను విస్తరించేందుకు రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డిపి) పనులను చేపట్టింది. అలాగే హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అమలుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ఇక నుంచి ఐదేండ్ల పాటు రూ.50 వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం

400 ఏళ్ల పురాతన చారిత్రక హైదరాబాద్ నగరం అత్యంత రద్దీగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల రహదారులు కలిపి 9204 కిలోమీటర్లకుపైగా ఉన్నాయి. నగరాన్ని ట్రాఫిక్ రహితంగా, సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్ద్డానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డిపి)ని రూపొందించి పనులు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. అత్యంత రద్దీగా ఉన్న రహదారులపై ఫ్లైఓవర్లు, కారిడార్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టడం అత్యంత కఠినమైనప్పటికీ వివిధ విభాగాల మధ్య సమన్వయంతో సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎస్‌ఆర్‌డిపి పనులను అత్యంత వేగంగా నిర్వహిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడాన్ని అదునుగా తీసుకొన్న ప్రభుత్వం రేయింబవళ్లూ పనులు జరిపిస్తుండటంతో చాలా వరకు పూర్తయ్యాయి.

నాలుగు దిక్కుల ఎక్స్ ప్రెస్ హైవేలు

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీని తట్టుకునే విధంగా రాబోయే 20 నుంచి 40 సంవత్సరాల వరకు మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రహదారుల వ్యవస్థను మెరుగుపరచేందుకు హైదరాబాద్ నాలుగు దిక్కులా ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించడంతో పాటు స్కైవేలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

దేశ పర్యాటక రంగంలో హైదరాబాద్ టాప్

దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో 2019లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని నగరాల్లో సర్వే చేయగా హైదరాబాద్ తొలిస్థానంలో ఆ తర్వాత స్థానాల్లో పుణే, జైపూర్, కొచ్చి, మైసూర్ నిలిచాయి. కొచ్చి, మైసూర్ ఉన్నాయి. విదేశీ పర్యాటకులు కూడా హైదరాబాద్‌ను ఎక్కువగానే సందర్శించారని ఆ సర్వేలో పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ నగరంలో బోయింగ్, జిఇ తదితర డజనుకు పైగా జాతీయ రక్షణ సంస్థలు ఏర్పాటు కావడంతో డిఫెన్స్ హబ్ గా మారింది. వరల్డ్ ఎరోస్పేస్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
జెఎల్‌ఎల్ సంస్థ నివేదికలో హైదరాబాద్‌కు

ప్రథమ స్థానం

ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి నగరాల్లో మళ్లీ హైదరాబాద్ ప్రథమస్థానంలో నిలిచింది. రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన జోన్స్ ల్యాంగ్ లాసలే (జెఎల్‌ఎల్) సంస్థ సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా ప్రపంచవ్యాప్తంగా 130 నగరాల్లో అధ్యయనం చేసి ర్యాంకులు ప్రకటించింది.

పారిశ్రామిక కాలుష్య రహితంగా హైదరాబాద్

హైదరాబాద్ నగరాన్ని పారిశ్రామిక కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. నగరంలో 1545 పరిశ్రమలు కాలుష్య కారకమైనవిగా గుర్తించారు. ఈ పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 19 ప్రాంతాలను గుర్తించి అక్కడ ఇండస్ట్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ రూ.4765 కోట్లతో భారీ జలమాల

హైదరాబాద్ చుట్టూ మహానగరానికి భవిష్యత్తులో మంచినీటి సమస్య రాకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. దాదాపు కోటి జనాభా ఉన్న నగరానికి తాగునీటి కొరత రాకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో బృహత్తర సంకల్పానికి సిద్ధమవుతున్నది. రూ.4,725 కోట్లతో 1628 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటికొరత రాకుండా నివారించేందుకు ఔటర్ రింగురోడ్డు చుట్టూ జలమాలను నిర్మించనున్నది.

స్మార్ట్ హైదరాబాద్ నగరానికి శ్రీకారం

గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మరియు పురపాలక శాఖ విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ విఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దే ప్రణాళికలపై విశ్వ విఖ్యాత చెందిన ‘సిస్కో’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకున్నది.

మెట్రో రైల్ ప్రాజెక్టు

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల నివారణకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రభుత్వం రూ. 21 వేల కోట్లతో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ పద్ధతిలో ప్రారంభించిన మెట్రో రైలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. మెట్రోలు ప్రతీ రోజు 780 ట్రిప్పులు నడుస్తూ 4 లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతీ రోజు 18,000 కిలోమీటర్లు తిరుగుతున్నది. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రోకు 150 వరకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి.

భారతదేశంలో నెంబర్ 1 నగరంగా హైదరాబాద్

మెర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ తన తాజా నివేదికలో హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 230 నగరాలను సర్వే చేసి వాటిలో నాణ్యమయిన జీవనానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాను తయారు చేసింది. వాటిలో హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ 1 స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకొంది.