Home తాజా వార్తలు థాంక్యూ హుజూర్.. కెసియారే రైట్ అని చాటారు

థాంక్యూ హుజూర్.. కెసియారే రైట్ అని చాటారు

 

huzurnagar

తప్పుడు ప్రకటనలు చేసిన వారికి బుద్ధి చెప్పారు, తెలంగాణలో ఏ మూలైనా, ఏ సీటైనా నాదే, ఇంతటి భారీ విజయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు : హుజూర్‌నగర్ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్

 హుజూర్‌నగర్‌కు రింగురోడ్డు .. గ్రామానికి రూ.20 లక్షలు – మొత్తం 134 గ్రామాలకు .. మండలానికి రూ.30లక్షలు .. మొత్తం 7 మండలాలకు .. హుజూర్‌నగర్ పట్టణాభివృద్ధికి రూ.25 కోట్లు .. గిరిజన రెసిడెన్సియల్ స్కూల్ .. బంజారాభవన్ రెవెన్యూ డివిజన్ .. పాలిటెక్నిక్ కాలేజీ ..ఇఎస్‌ఐ ఆసుపత్రికి కృషి .. పోడుభూముల సమస్య పరిష్కారం.. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు కోర్టు

మన తెలంగాణ/నల్గొండ ప్రధాన ప్రతినిధి :  ‘కెసిఆర్ యూ ఆర్ రైట్, కెసిఆర్ యూ ఆర్ గ్రేట్ ’అన్నట్టుగా అద్భుతమైన విజయాన్ని అందించి.. అవాంఛనీయ ప్రకటనలు చేసినవారికి దీటైన సమాధానం చెప్పారని హుజూర్‌నగర్ వాసులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఏ మూలైనా నాదే..! ఏ సీటైనా నాదే..!అని అన్నారు. ఉపఎన్నికలో ఇంతటి భా రీ విజయాన్ని అందించిన హుజూర్‌నగర్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూనే, ఆ నియోజకవర్గం అభివృద్ధిపై సిఎం కెసిఆర్ వరాల జల్లును కురిపించారు. శనివారం హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో కెసిఆర్ మాట్లాడుతూ, ఈ విజయం మామూలు విజయం కాదు.. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, నీలాపనిందలకు సరైన సమాధానం అన్నారు. నీళ్లు ఏవో..? పాలు ఏవో..? అని బల్లగుద్ది చెప్పినట్లు హుజూర్‌వాసులు ఎన్నికలో తీర్పు ఇచ్చారని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ గెలుపు ఉత్సాహాన్ని, సేవాభావాన్ని పెంచుతుంద ని.. మరింత అంకితభావం, స్పూర్తితో ముందుకెళ్లా లే చేస్తుందని తెలిపారు. హుజూర్‌నగర్ ప్రజలకు టిఆర్‌ఎస్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పారు. కెసిఆర్ వచ్చి ఊరికే థ్యాంక్స్ చెప్పడమే కాదు.. చాలా ఉన్నది… ఓపికతో వినాలంటూ ప్రసంగాన్ని నవ్వులతో ముందుకు నడిపించారు. హుజూర్‌నగర్ ముద్దుబిడ్డగా అందరి దీవెనలతో రెండు రోజుల క్రితమే శానంపూడి సైదిరెడ్డి ఎంఎల్‌ఎగా గెలిపించారన్నారు.
వరాల జల్లు
ఇక్కడి ప్రజలు అందించిన విజయానికి ప్రత్యేకమైన ప్రతిఫలం అందించే విధంగా హుజూర్‌నగర్‌లోని ఏడు మండల కేంద్రాలు, 134 గ్రామపంచాయితీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. 134 గ్రామపంచాయితీలో ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధికి రూ.20 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రెండు రోజుల్లో విడుదల చేస్తానని ప్రజల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. ఏడు మండల కేంద్రాలలో ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు చొప్పున అభివృద్ధికి మంజూరు చేస్తామన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ, నేరేడిచర్ల మున్సిపల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇక్కడ నెలకొన్న సమస్యలు చెప్పారని కెసిఆర్ తెలిపారు. ఆయకట్టు, కల్వర్టులు గురించి తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. హుజుర్‌నగర్ రోడ్డు మట్టికొట్టుకుపోయినట్లు కనిపించాయని.. ఈ పరిస్థితి మార్చేందుకు ఎంఎల్‌ఎ సైదిరెడ్డి నాయకత్వంలో సిఎం నిధుల నుంచి రూ.25 కోట్లు మంజూరు చేసి పట్టణాన్ని గొప్పగా తీర్చిదిద్దేలా చేయాలని సైదిరెడ్డికి తెలిపారు. నాణ్యమైన మోర్‌లు, డ్రైనేజీలు నిర్మించాలని కూడా తెలియజేశారు.

నేరేడ్‌చర్ల మునిసిపాలిటీ అభివృద్ధికి కూడా రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నానని తెలిపారు. గతంలో ఎన్నో పోరాటాలు చేసిన గిరిజన బిడ్డల సంక్షేమానికి పాటుపడతానని ఆయన చెప్పారు. అప్పట్లో మూడువేల గిరిజన తండాలు గ్రామపంచాయతీకి ఇచ్చారని.. హుజూర్‌లోనూ 30పై చిలుకు తండాలు పంచాయితీలుగా మారాయన్నారు. హుజుర్‌నగర్‌లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల మంజూరుచేస్తామని చెప్పారు. అంతేకాదు ఇక్కడ బంజారాభవన్ కూడా నిర్మాణం జరుపుతామన్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ప్రజాదర్బార్ ద్వారా ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. అన్ని జిలాల్లోనూ ప్రజాదర్బార్ ఏర్పాటుచేస్తామన్నారు. హుజూర్‌లో రెవె న్యూ డివిజన్ వస్తుందన్నారు. ఇక్కడ చాలా సిమెం ట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ ఇఎస్‌ఐ ఆసుపత్రి లేదని..కేంద్రంతో చర్చించి ఇక్కడ ఇఎస్‌ఐ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. హుజూర్‌నగర్‌కు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేస్తామని..రెవెన్యూ డివిజన్ కూడా వచ్చేలా చేస్తానన్నారు.

మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు కలిపి కోర్టు కావాలని అడిగారని.. హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడి కోర్టు ఏర్పాటునకు కృషి చేస్తానన్నారు. ఆ కోర్టు పరిధిలోకి ఈ రెండు మండలాలు తెస్తామన్నారు. ఇక్కడ అందుబాటులో స్థలాలు తెలుసుకుని వీలైనంత త్వరలో ఎక్కువమొత్తంలో అర్హులకు డబల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పాత నల్గొండను పట్టిపీడిస్తున్న ఇరిగేషన్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.
నాటి సమస్యలే ఇంకా ఉన్నాయ్
1987లో ఎన్‌టిఆర్ హయాంలో తాను నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా, కరువు మంత్రిగా పనిచేసినప్పుడు చూసిన సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయని సిఎం కెసిఆర్ అన్నారు.. కోదాడ నుంచి హలియా వరకు పాదయాత్ర చేశానని చేసినప్పడు ఇక్కడ సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సూర్యపేటలో మంచినీటి ఎద్దడిని గుర్తించినట్లు తెలిపారు. అప్పుడు ఏ సమస్యలు చెప్పారో అవే ఇప్పటికీ ఉన్నాయి. గతంలో పనిచేసిన వారు పెద్దపెద్ద మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. గతంలో ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చేయలేని అభివృద్ధి పనులు తమ మూడు ఫీట్లు ఉన్న మంత్రులు చేసి చూపించారని చెప్పారు. మూడు ఫీట్లు ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టు నుంచి 300 కిలోమీటర్ల వరకు నీరు వచ్చేలా చేశారని.. కోదాడ వరకు నీరు తెప్పించగలిగారనికొనియాడారు. రూ.30వేల కోట్లతో ధర్మల్ ప్రాజెక్టు ఇక్కడికి తెచ్చారని తెలియజేశారు..అది పూర్తయితే జిల్లా అర్థిక ముఖచిత్రమే మారిపోతుందన్నారు. దీనిని వ్యతిరేకించిన కాంగ్రె స్ మహామేథావులు నమస్కారమంటూ చమత్కరించారు. వారి గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని కెసిఆర్ దాటవేశారు. ఇక్కడ 10 లక్షల ఎకరాలలో నీరు పారాల్సి ఉండగా.. ఇంకా పారడంలేదన్నారు. ఒక సమగ్రమైన విధానాన్ని అవలంభించకపోవడం వలనే అన్యాయం జరిగిందన్నారు. మిర్యాలగూడ ఎంఎల్‌ఎ హైదరాబాద్ వచ్చి తనను కలిసినప్పుడుల్లా తన నియోజకవర్గ అభివృద్ధికి పాకులాడుతూ ఉంటారని చెప్పారు. నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు నాలుగు లక్షల ఎకరాలకు ఐటిసి పైగా ఆయకట్టు ఉందన్నారు.
మొండిగా ముందుకు పోతున్నా…
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా మొండిగా ముందు కు పోతున్నానని కెసిఆర్ చెప్పారు. మహరాష్ట్ర, కర్ణాటక ప్రాజక్టుల వల్ల తెలంగాణకు నీళ్లు రావడం లేదని వర్షాలు పడడం వల్ల సమస్య తెలియలేదన్నారు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఆయకట్టు కాపాడుకోవాలన్నారు. సీతారామప్రాజెక్టు ద్వారా ఖమ్మంజిల్లాలో బాధలు తొలిగిపోతాయన్నారు. సూర్యాపేటలో కోదాడ, తుంగతుర్తి వరకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయన్నారు. నీటి సమస్య తీర్చేందుకు ప్రస్తుత బడ్జెట్‌లోనూ వచ్చే ఏడాది బడ్జెట్‌లోనూ నిధులు మంజూరుచేస్తామన్నారు.. సాగుకు అవసరమైన లిఫ్ట్‌లు కూడా మంజూరు చేయడం, పాడైనవాటికి మరమ్మతులు చేస్తామన్నారు. “కెసిఆర్‌గా మీకు ఒకటే మాటగా చెబుతున్నా.. నాగర్జునసాగర్ ఆయకట్టు మీద పడతా..” అన్నారు. హుజూర్‌నగర్ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు రైతులను కలిసి వారి సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలన్నారు. ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి జిల్లాలో పూర్తిగా పర్యటించి పరిశీలించాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సిఎం సూచించారు. అన్ని ప్రాంతాలకు నీరు పారేలా చేయడానికి తీసుకోవాల్సిన అంశాలను పరిశీలించాలని చెప్పారు. అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని కుర్చూని మరీ ఉండి నీరు పారేందుకు అవసరమైన చర్యలు తీసుకుందామన్నారు. పొలాలు అన్నింట్లో నీరు పారించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో లింగగిరి దగ్గర్లోని కాలువ కాలుష్యమయమైందని.. హాలియా పట్టణంలో కాలువ కూడా బాగు చేయాలన్నారు. ఐడిసి ఇరిగేషన్ కార్పొరేషన్, నీటి పారుదల శాఖ అధ్వర్యంలో లిఫ్ట్‌ల బాధ్యతలు కొన్ని స్వచ్ఛంధ సంఘాలకు, సొసైటీలకు ఉన్నాయన్నారు.
లిప్ట్‌ల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వానికే
లిఫ్ట్‌లు నిర్వహణ బాధ్యతల భారం కూడా రైతులపై లేకుండా అన్నిటిని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక ఇబ్బందులు పడ్డామని కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. ఉద్యమ ప్రారంభంలో తనతో పాటు తమ జిల్లా మంత్రి కూడా ఉన్నారని తెలిపారు. అప్పుడు అనేక అవమానాలు భరిస్తూ పక్షుల్లాగా తెలంగాణ అంతా తిరిగి సమాజాన్ని జాగృతం చేసి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో రైతు సుభిక్షంగా ఉండాలనేలా పాటుపడుతున్నానని తెలిపారు. మొత్తం కోటి, 25లక్షల ఎకరాలకు సాగునీరు రావాలన్నారు. అందుకే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నీళ్లు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఎత్తిపోతల పథకం పూర్తికావాలన్నారు. భారతదేశంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉన్నది తెలంగాణలోనే అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా 56 లక్షల ఇళ్లకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ఆ పథకం 99 శాతం పూర్తయ్యిందన్నారు. సంక్షేమ రంగంలో, రైతుబంధు కార్యక్రమం, రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే పెదవులు చప్పరించారే తప్పా ఎవరూ ఏమి చేయలేదన్నారు.

రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతు చనిపోతే రైతు బీమా పథకం వల్ల పదిరోజుల్లోపే 5లక్షలు వారి ఇంటికి వస్తాయన్నారు.కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, వంటి అద్భుత పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తామన్నారు. హుజుర్‌నగర్‌లో రింగురోడ్డు ట్యాంక్‌బండ్‌లాగా నిర్మించాలంటూ సైదిరెడ్డి తన వద్దకు ఇక్కడే కొత్త గా కోరారని చెప్పారు. హుజూర్‌నగర్ అభివృద్ధికి రూ.100 కోట్లు వరకు మంజూరు చేశానని.. అయినా సైదిరెడ్డి కొత్త దుకాణం తెచ్చారని కెసిఆర్ చమత్కరించారు. 43వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరుచేస్తామని తెలిపారు. ఇంతాలా కృషి చేస్తున్న సైదిరెడ్డిని గుంటూరు జిల్లా వాసి అంటూ అసత్య ప్రచారం చేసిన వారికి కర్రుకాల్చి వాతపెట్టి బుద్ధిచెప్పారని అన్నారు. త్వరలోనే హుజూర్‌నగర్ దగ్గరల్లోనే జాన్‌పహడ్ దర్గా,మట్టపల్లి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సిఎం కెసిఆర్ అభినందనలు తెలియజేశారు.

Cm Kcr Speech At Huzurnagar Thanksgiving Meeting