Thursday, March 28, 2024

బెబ్బులిలా లేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ…ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే… రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని మరోసారి మోడీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చినా మాదిరిగానే రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోందన్నారు. అలాంటప్పుడు మా రాష్ట్రం మీద మీకు ఎందుకంత కక్ష….వివక్షా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే మీకు ఎందుకంత కడుపుమంట? అని ధ్వజమెత్తారు.

మొదటి నుంచి కేంద్రానిది ఇదే వరస అని మండిపడ్డారు. కేంద్రం తప్పులు చేసినా….రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నా ప్రశ్నించవద్దా? అని కెసిఆర్ అడిగారు. తాము ప్రశ్నించిన పాపానికి ప్రధానమంత్రి మోడీ స్వయంగా…. కెసిఆర్ నీ ప్రభుత్వాన్ని కూలగొడుతా? అని అంటారా? ప్రశ్నించారు. దమ్ముంటే ఏ కారణం చేత ప్రభుత్వం కూలగొడుతావో చెప్పాలన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని కాకుండా… బెంగాల్‌కు పోయి అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలగొడతామని నిసుగ్గుగా ప్రకటన చేస్తారా? అని కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రధాని అనాల్సిన మాటాలేనా? అని కెసిఆర్ ప్రశ్నించారు. దీని కోసమేనా మనం కలలుగన్నదన్నారు. ఆ నాడు మహాత్ముడు, అనేకమంది స్వతంత్ర సమరయోధులు ఉరికంబాలెక్కి స్వతంత్రం తెచ్చింది? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా ? దీనిపై ఆలోచన చేయాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

ఆదివారం పాలమూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఎంవిఎస్ కళాశాల ప్రాంగణంలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మోడీ పాలన కంటే…బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నీచ, నికృష్ణ రాజకీయాల కారణంగానే దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో మోడీ సర్కార్ బిజెపియేతర ప్రభుత్వాలను అక్రమంగా కూల్చివేసిందని మండిపడ్డారు. ఆయన పాలనలో సాగుతున్న అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. దీనికి ఎక్కడో అక్కడ…ఎవరో అక్కడ ఫుల్‌స్టాప్ వేయడానికి ముందుడుగు వేయాల్సిందేనని అన్నారు. అది మన తెలంగాణ నుంచే మోడీ పతానాన్ని శాసించేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.

ఇందుకు మీరంతా తనతో కలిసి వస్తారా? అని బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ప్రశ్నించారు. ఇందుకు వారంతా తమ కరతళ ధ్వనులతో కెసిఆర్‌కు సంపూర్ణ మద్దతును తెలిపారు. కేంద్రానికి ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు… సాగునీరివ్వ చేతకాదన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చేయడం అంతకన్నా చేతుకాదని విమర్శించారు. పేదలను ఆదుకోవడం… ఉద్యోగాలివ్వడం సైతం చేతకాదన్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలనే దిశగా మోడీ సర్కార్ పనిచేస్తోందని విమర్శించారు. ఇదేనా దేశం? ఈ దేశమేనా మనం కోరుకున్నదని కెసిఆర్ ప్రశ్నించారు. విద్యావంతులు, యువకులు ఎక్కడివారక్కడ ఆలోచించకపోతే మనం దెబ్బతింటామన్నారు. ఆగమైపోతామని హెచ్చరించారు. ఎవరో చిల్లరగాళ్లు.. రాజకీయాల కోసం అవలంభించే చిల్లర ఎత్తుగడలను ప్రజలు అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు.

చెబితే సిగ్గుపోతది
దేశానికి 75ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం సాధించామని తలుచుకుంటే గుండె బరువుక్కుతోందని కెసిఆర్ అన్నారు. వాస్తవాలు చెబితే సిగ్గుపోతదన్నారు. అన్ని డంబాచారాలు.. అంతా సొల్లు ప్రచారాలు, ఉత్తుత్తి ఈస్ట్‌మన్ కలర్ ఫోజులు అని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కరెంటు కొరత, కరెంటు కోతలన్నారు. మంచినీళ్లు రావు. రోజుకు నాలుగు ఐదు ట్యాంకర్ల కొనుకుంటున్నట్లు అక్కడున్న మిత్రులు తనకు చెబుతున్నారన్నారు. ఇంతకన్న ఆధ్వానం మరోటి ఉంటుందా? కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న మంచినీళ్ల (మిషన్ భగీరథ) పథకం ఉన్నట్టు పక్కనే బార్డర్‌లో ఉన్న కర్నాటకలో ఉందా..? అని ప్రశ్నించారు. అసలు దేశంలో ఏం జరుగుతుందన్నారు. చివరకు ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో తాగేందుకు నీళ్లు లేవు. గుజరాత్‌లో 24 గంటల కరెంటు ఉండదన్నారు. ఈ పరిస్థితి చూసి మోడీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఇలా చెప్పకుంటే పోతే….మోడీ ఒక క్షణం కూడా పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. మోడీ పాలన అంతా పైన పటారం.. లోన లొటారమని మండిపరడ్డారు. కనీసం కొత్తగా ఏర్పడిన మన తెలంగాణ సాధించిన విజయాలను కూడా మోడీ ప్రభుత్వం సాధించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ చేతకాని పాలనకు నిదర్శనమని కెసిఆర్ విమర్శించారు.

ప్రభుత్వాలను ఎందుకు కూలగొడతారు
దేశంలో చిత్ర, విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కెసిఆర్ అన్నారు. అడ్డదారుల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు మోడీ అరాచకపాలనను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. దీని కోసం రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో, ప్రజలు స్వామికులుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్లు పని చేయాలన్నారు. ప్రజలు ఎవరికి ఏ పాత్ర ఇస్తే… ఆ పాత్ర పోషించాలన్నారు. గెలిచిన వారిని ఐదేళ్లు పని చేయనివ్వాలన్నారు. అప్పుడే ప్రజలకు ఆ ప్రభుత్వం చేసిన మంచేదో… చెడోదే తేల్చుకుంటారన్నారు. కానీ మోడీ సర్కార్ అత్యంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయనివ్వకుండా…అర్థాంతరంగా పడగొట్టేందుకు యత్నిస్తుండడం మన దౌర్భాగ్యమన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి చేయతనివ్వకపోయినప్పటికీ… అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా ముందుకుపోతున్నామన్నారు.

దీన్ని చూసి స్పందించడం పోయి….కన్నెరపెట్టుకొని, కట్టెపెట్టాలే.. అడ్డంపడాలే.. వచ్చే పైసలు రాకుంటే చేయాలే.. నిధులు ఆపాలని చూస్తారా? అని కెసిఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా… ఎఫ్‌ఆర్‌బిఎం మీద కోతలుపెట్టాలని యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అనునిత్యం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలని యత్నించడం మంచిదేనా? చేయదగ్గదేనా? అని నిలదీశారు. ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడుతారా? ప్రధాని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? అడ్డం కాలు పెట్టి.. మేం పని చేయం, మిమ్మల్ని చేయనివ్వమంటారా? అని కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దొంగలను దొరకబట్టి జైల్లో వేశాం
టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిపరిచేందుకు మొన్న హైదరాబాద్‌కు దొంగలు వచ్చారన్నారు. మన పార్టీ శాసనసభ్యులను చీల్చి.. ప్రభుతాన్ని రిచి కిందమీద చేస్తామని వస్తే…. దొరకబట్టి జైలులో వేశామన్నారు. ఇలాంటి వాటిపై ఎక్కడో దేశంలో తిరుగుబాటు ప్రారంభం కావాలన్నారు. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆ నాడు మనం కొట్లాడక పోతే మనకు తెలంగాణ రాకపోవన్నారు. మన గతిగట్లనే ఉంటుండేనని కెసిఆర్ వ్యాఖ్యానించారు. గాంధీతో కలిసి లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవాళ్టికి మనం బ్రిటీషు వారికి బానిసలుగా ఉండేవాళ్లమన్నారు.

రాష్ట్రానికి రూ. 3.50 లక్షల కోట్లు నష్టం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజున బడ్జెట్ రూ.62వేల కోట్లు అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.2.50లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దీంతో రాష్ట్ర జిఎస్‌డిపి కూడా రూ.11.50లక్షల కోట్లకు చేరుకుందన్నారు. నిజానికి మనలా కేంద్రం పనిచేసి ఉంటే రాష్ట్ర జిఎస్‌డిపి రూ.14.50లక్షల కోట్లుండేదన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రూ. 3.50 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. దీనిపై ఆలోచన చేయాలన్నారు. మనం తిప్పలు పడితే కాదు.. మనతో సరిసమానంగా కేంద్రం పని చేస్తేనే ఈ దేశం అన్నిరకాలు బాగుపడే పరిస్థితి ఉంటుందన్నారు. కానీ దురదృష్టవ శాత్తు ఆ పరిస్థితి లేదన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రగతి బాటలో కొనసాగుతోందన్నారు. కష్టపడి, అవినీతి రహితంగా, క్రమశిక్షణతో రాత్రింభవళ్లు పని చేస్తే ఇది సాధ్యమైందన్నారు. కేవలం డైలాగ్‌లు చెబితే కాదు…. అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజావిశ్వాసంతో అధికారులు, శాసనసభ్యులు, మంత్రులందరు పని చేసే ఈ రకమైన ఫలితాలు సాధించగలిగామన్నారు.

కృష్ణాలో రాష్ట్ర వాటాను ఎందుకు తేల్చడం లేదు
కృష్ణా నదిలో తెలంగాణకు ఎంత వాటాకు ఇస్తరు చెప్పమంటే.. అద్భుతమైన ప్రచారాలు చేసుకునే ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల టైం చాలదా? ఎక్కడున్నదీ ఈ దేశం. వాటాచెప్పేందుకే ఎనిమిదేళ్లయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి? నీళ్లు ఎప్పుడు రావాలి? మనుమలా.. మునిమమల్లా..? లేకపోతే రానేరాదా? ఇంట్లనే ఉండాలా భారతదేశం? అని కెసిఆర్ నిలదీశారు. పాలమూరులో వాల్మీకి బోయలు ఎప్పటి నుంచో ఎస్‌సిలో కలపాలని అడిగారన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. ఏడేళ్లు గడుస్తున్నా హరీ లేదు… శివా లేదన్నారు. రాష్ట్రం పంపించిన తీర్మానాలను ఆమోదించడానికి కేంద్రానికి ఏడేళ్లు చాలదా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి స్పందన రాని కారణంగా మళ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపి బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
వేల కోట్ల నష్టం వచ్చినా.. రైతుల కోసం పనిచేస్తున్నాం

వ్యవసాయ రంగానికి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహం దేశంలో మరే ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదని కెసిఆర్ అన్నారు. ఇవాళ 24 గంటల కరెంటు వస్తుందా? బ్రహ్మాండంగా ఉందా? రైతులను ఎన్ని మోటార్లు పెట్టావ్ అని ఎవరైనా అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతాంగం కరువుకు, కాటకాలకు గురై, దుఃఖానికి గురై చెట్టుకొకరు గుట్టకొకరు అయ్యారన్నారు. కానీ తెలంగాణ సాధించుకున్న తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. ఇవి చిల్లర రాజకీయాలు, ఓట్ల కోసం కాదన్నారు. దీంతో తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలర్ ఎగరేసుకొని దర్జాగా బతుకుతున్నారన్నారు. అప్పులు లేకుండా ఉంటేనే… అది అసలైన బంగారు తెలంగాణ అని నమ్మి ఆ పనులు చేస్తున్నామని కెసిఆర్ అన్నారు. రైతుల నుంచి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. సంవత్సరానికి వేలకోట్ల నష్టం వచ్చినా రైతుల కోసమే కదా అని ప్రభుత్వం పని చేస్తున్నదని అని స్పష్టం చేశారు.

చిల్లర రాజకీయం కోసం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు
భారతదేశ సమాజం జాతి జీవనాడి ఈనాడు కలుషితం చేయబడుతున్నదన్నారు. చిల్లర రాజకీయ లక్ష్యం కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి.. ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. దీని కోసం అబద్ధాల ఒరవడి సృష్టించి.. మంచి మేలైనా నాయకులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించి దౌర్జన్యపూరితమైన దుర్మాగమైన విధానం జరుగుతున్నదన్నారు. ఎక్కడో ఓకాడ బెబ్బులిలా పంజా లేవాలి.. దెబ్బ కొట్టాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి సాటి…పోటీగానీ ఎవరు లేరు
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని..పోటీగాని ఎవరు లేరని కెసిఆర్ అన్నారు.అలాంటి ఆలోచనలు కూడ ఎవరికి రావన్నారు. ఏడెండ్ల క్రితం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేవన్నారు. ముఖ్యంగా కరెంట్ బాధలను అనుభవించిన తెలంగాణ ఈ రోజు దేశానికే తలమానికంగా తయారైందన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో కూడా ఏ రాష్ట్రంలేదన్నారు. దేశంలో సగటు కూడ సమీపంలో లేని విధంగా, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్పడానికి తాను గర్వ పడుతున్నానని అన్నారు.దీనంతటికి కారణం మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వారితో పాటు రెండింతల అంకితభావంతో పని చేసినటువంటి ప్రభుత్వ అధికారుల, ఉద్యోగుల కృషి వల్లనేనని సిఎం అన్నారు. ఇంతటి గొప్ప అద్భుత ఆవిష్కరణలలో కృషి చేసినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నారు.

బిఆర్‌ఎస్‌కు పోదామా?
మనం రాష్ట్రం ఒక్కటే బాగుపడితే కాదు.. దేశం బాగుపడాలన్నారు. దీని కోసం ఖచ్చితంగా తెలంగాణ తరఫున, మన అందరి తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైనా పాత్ర వహించాలన్నారు. దీని కోసమే బిఆర్‌ఎస్ ఏర్పాటు అని అన్నారు. మరి బిఆర్‌ఎస్‌కు పోదామా? అని చెప్పగా పోదామని జనం నినదించారు. ఖచ్చితంగా తెలంగాణ మాదిరిగానే భారతదేశాన్ని తయారు చేసేందుకు భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులు ఒడ్డి ముందుకుపోదామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దామన్నారు. అద్భుతమైన భారతదేశానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదాలు వేద్దామన్నారు.

అద్భుతమైన పాలమూరు నిర్మించుకుందాం
పాలమూరు ప్రత్యేకంగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లను అదనంగా మంజూరు చేస్తామని కెసిఆర్ తెలిపారు. అందరం కలిసి వెనుకబాటు తనాన్ని తరిమేద్దామన్నారు. అద్భుతమైన పాలమూరును పచ్చటి పంట పొలాలు, ఐదు మెడికల్ కాలేజీలు, అనేక వసతులతో తయారు చేసుకుందామన్నారు. ఇందుకు నేను మీతో ఉంటాను.. మీరు నాతో ఉండాలన్నారు. అందరం కలిసి అద్భుతమైన పాలమూరును నిర్మించుకుందామన్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా అని అన్నారు. ఇప్పుడిప్పుడే తేటపడుతుందన్నారు. ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొన్ని చిన్నచిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన దరిద్రులే కల్పిస్తున్నారని విమర్సించారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే కాలువ పనులు మొదలు పెడుతామని కెసిఆర్ తెలిపారు.

మన గురుకులాలకు పివియే ఆదర్శం
అనేకమంది మహనీయులు అనేక రకాల కృషి చేసారన్నారు. అభివృద్ధి బాటలు వేశారన్నారు. అందులో మన పివి
నరసింహారావు తెలంగాణ గడ్డలో పుట్టి ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్లారన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజులలో రెసిడెన్షియల్ పాఠశాలలే అద్భుతమైనటువంటి ప్రగతికి దోహదం చేస్తాయని అని జెప్పి నల్గొండ జిల్లా లో ‘సర్వేయల్’ అనే దగ్గర రెసిడెన్షియల్ పాఠశాల వారు స్వయంగా చోరవ తీసుకుని ఏర్పాటు చేయించారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కూడా ఈ స్థాయి(డిజిపి)కి ఎదిగారంటే అది ‘సర్వేయల్’ స్కూల్ యొక్క పుణ్యమేనని అన్నారు. పివి గురుకుల విద్య రెసిడెన్షియల్ స్కూల్ ఆదర్శంగా తీసుకుని మనం కూడ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఒక వెయ్యి గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నామన్నారు. మొదటి దశలో ఈ మధ్య కొన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటుచేసుకున్నామని, ఇంకా పెద్ద సంఖ్యలో పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే సంవత్సరాలలో ఆ సంఖ్యను 3-4 రెట్లు పెంచుకుందామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

కంటి వెలుగు’ పథకానికి దారితీసిన పరిస్థితులు
‘కంటి వెలుగు’ పథకం రూపకల్పనకు దారితీసిన విషయాన్ని సిఎం కెసిఆర్ వెల్లడిస్తూ….గజ్వేల్‌లోని చిన్న గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేద్దామంటే..ఊరివాళ్లకు మంచి విశ్వాసం కల్పించాలనే మంచి ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టామన్నారు. ఆ చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేలిందన్నారు. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువతలేరని స్కూల్‌లో టీచర్లు, ఇండ్లల్లో తల్లిదండ్రులు కొడుతుతున్నారని తెలుసుకుని చాలా బాధపడ్డామన్నారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడామన్నారు. వాస్తవానికి చెప్పకూడనిది ఏంటంటే కంటి విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉందన్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. అందరికీ సరోజిని దవాఖాన ఒక్కటే దిక్కు అన్నారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. అలాంటి పరిస్థితి నుండి బయట పడటానికి ఆ తర్వాత చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చామన్నారు . అంతేకాని చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం తెచ్చింది కాదు కంటి వెలుగు అని సిఎం స్పష్టం చేశారు. మళ్లీ రెండోదశ కార్యక్రమం కూడ చేపట్టబోతున్నామని జిల్లా కలెక్టర్లు, అధికారులు విజయవంతం చేయాలని సిఎం కోరారు.

మానవీయ కోణంలో నుంచి పుట్టిందే ‘ కెసిఆర్ కిట్ ’
తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకు వచ్చిందే ‘ కెసిఆర్ కిట్‌అనే కార్యక్రమం అని సిఎం అన్నారు. మామూలుగా నాలుగు వస్తువులు ఇచ్చి పంపడం ఈ పథకం ఉద్ధేశ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మధనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తామన్నారు. అంతేతప్ప ఎవరో చెప్పారనో.. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో చేయమన్నారు. పేదింటి ఆడబిడ్డలు గర్భం దాల్చిన తర్వాత కూడా ఉపాధి కోసం పని చేస్తునే ఉంటారన్నారు. అలా పనిచే చేస్తే గర్భిణులకు, జన్మించే శిశువు కు మంచిది కాదన్నారు. వారు ఎందుకు పని చేస్తున్నరనే విషయంపై అధ్యయనం చేశామన్నారు. ధనవంతులు వాళ్ల బిడ్డలకు ఏమో ఇంట్లోని వాళ్లు శ్రీమంతాలు వగైరా పండగలు చేస్తారు. ‘ఈమె నీళ్లుపోసుకున్నదయ్య ఇప్పుడు… కూసుండబెట్టి తిండిపెట్టాలే’.. ఇది పేదింట్లో వచ్చే మాట అని అన్నారు. తాను కూడా పల్లెటూరులో పుట్టాను కాబట్టి.. నా చెవులతో విన్నకాబట్టి. ఎందుకంటే పేదరికం, దరిద్య్రం వల్ల. అలాంటి పరిస్థితి ఉన్నది అని. కాబట్టి వాళ్లు పని చేయవద్దంటే ఒకటి ఇనిస్టిట్యూషన్ డెలివరీలు ప్రోత్సహించాలన్నారు. అందుకోసం తీసుకున్న చర్యలలో భాగంగా ప్రభుత్వ అధికారి స్మితాసబర్వాల్‌తో పాటు మహిళా ఐఏఎస్ అధికారులను పలు రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించామన్నారు. గర్భవతులైన పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి.. వాళ్లకు సంభవించే వేజ్ లాస్‌ను సామాజిక బాధ్యతగా ప్రభుత్వమే భరించేలా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

ఇంటి నిర్మాణానికి త్వరలో ఆర్ధిక సాయం
ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సొంతంగా స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఇలా నియోజక వర్గానికి వెయ్యి ఇళ్లు చొప్పున మంజూరు చేస్తామని కెసిఆర్ తెలిపారు. అయితే ఈ జిల్లాకు అదనంగా కూడా ఇళ్లు కేటాయిస్తామన్నారు. రాబోయే 10, 15 రోజుల్లోనే ఇండ్లను మంజూరు చేస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారుతోందన్నారు. దీని కారణంగానేకర్నాటక, మహరాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతుకున్నారన్నారు. గతంలో రూ.50వేలు ఇచ్చే ఆపద్భందు కోసం కాళ్లు అరిగిలా తిరిగే పరిస్థితి ఉండేదన్న సిఎం….ఇప్పుడు రైతు ఏ కారణంతో మరణించినా బీమా కింద రూ. 5 లక్షలు వస్తున్నాయన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాకు వైద్య కళాసాలలు వస్తాయని ఎవరైనా అనుకున్నారా? కెసిఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా సమగ్రాభివ-ద్ధికి నోచుకుందన్నారు. విశాలమైన రోడ్లు, పచ్చటి పొల్లాలు, పుష్కలంగా నీటి ప్రవాహంతో కళకళలాడుతోందన్నారు.

జిల్లాకు ప్రత్యేకంగా రూ.222 కోట్లు మంజూరు
పాలమూరు జిల్లాకు నిధుల వరద కురిపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. దీని కారణంగానే జిల్లాలోనే 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.222కోట్లు మంజూరు చేస్తున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.

సంస్కరణలు నిరంతర ప్రక్రియ
ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి వారి సేవకు వెళ్లాలని చెప్పి మేధోమథనం చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ అన్నారు. సంస్కరణలు అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయన్నారు. దానికి అంతం ఉండదన్నారు. ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేధోమధనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారన్నారు. .ఎప్పటికప్పుడు మేధో మధనాన్ని, ఆలోచనలను కలబోసుకోని అందరు కలిసి ఆత్మీయంగా, ప్రేమతో పని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. ఒళ్లు జలధరిస్తుంది.

తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లా పర్యటించిన సమయంలో అనేక జ్ఞాపకాలున్నాయన్నారు. ప్రధానంగా ఆలంపూర్ నుంచి జోగులాంబ వరకు పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలో తొలిభాగంలో చేస్తే అనేకమైన అనుభవాలు, బాధలు కలిగాయన్నారు. వాటిని. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్లు జలధరించే పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ పరిస్థితి చూసి కండ్లనీళ్లు పెట్టుకున్నామన్నారు. వేధనలు, రోధనలు, గుండవిసేలా బాధలతోని బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పంటల కోతలు కోసే హార్వెస్టర్లు, కల్లాల్లో ధాన్యం రాశులు చూసి ఆనందపడ్డానని కెసిఆర్ అన్నారు.

ఎవరం వెయ్యి సంవత్సరాలు బతికేందుకు రాలేదు
ఏ తెలంగాణ కావాలని కోరుకున్నమో.. దేనికైతో పోరాడమో అది సాకరమవుతుందని కెసిఆర్ అన్నారు. అద్భుతమైన లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎవరం కూడా వెయ్యి సంవత్సరాలు బతికేందుకు రాలేదన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకాయన అటెండర్ కావొచ్చు. ఒకాయన ఎమ్మార్వో, ఇంకో ఆయన జాయింట్ కలెక్టర్, ఒకాయన మంత్రి, మరొకాయన సిఎస్, మరొకాయన చీఫ్ మినిష్టర్ కావొచ్చు. ఇవి శాశ్వతం కాదు. ఎవరం అధికారంలో ఉండం. ఒక స్టేజీ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగులూ రిటైర్డ్ కావాల్సిందే. మనం ఉన్నప్పుడే ఏం చేసిందనేదే ఎండ్ ఆఫ్ ది డే అని అన్నారు. అదే అద్భుతమైన వేల, లక్షలకోట్ల ఆస్తికి సమానమైన సంతృప్తి అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
టైగర్ మల్లారెడ్డి
సభలో మంత్రి మల్లారెడ్డిపై కెసిఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయనను టైగర్ అంటూ సిఎం సంభోదించారు. మల్లారెడ్డికి సభకు పరిచేయం చేస్తున్న సమయంలో కెసిఆర్ ఇలా వ్యాఖ్యానించడంతో సభా ప్రాంగణం అంతా నవ్వులతో మారుమ్రోగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News