Home తాజా వార్తలు పైసలిచ్చే బాధ్యత నాది, సక్కగ చూసుకునే జిమ్మేదార్ మీది: కెసిఆర్

పైసలిచ్చే బాధ్యత నాది, సక్కగ చూసుకునే జిమ్మేదార్ మీది: కెసిఆర్

CM-KCR

ద్దిపేట: చింతమడక చాలా మంచి గ్రామమని, చింతమడక వాస్తు కూడా బ్రహ్మాండంగా ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. చింతమడకలో సిఎం కెసిఆర్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కరచాలనం చేసి ఆప్యాయంగా చిన్ననాటి స్నేహితులను కెసిఆర్ పలకరించారు. ఊరికి నాలుగు మూలలా నాలుగు తటాకాలు ఉండటం అదృష్టమని చెప్పారు. మళ్లీ గ్రామంలో నీటి ఊటలు, బావుల్లో జాలు చూడబోతున్నామన్నారు. మీ ఊరి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడని, చనుబాలు ఇచ్చిపెంచిన తన ఊరు చింతమడక అని కొనియాడారు. మరో మూడు గ్రామాలు తనకు విద్యాబుద్ధులను ప్రసాదించాయని, కోమటి చెరువులో మొత్తం ఈత కొట్టానని గుర్తు చేసుకున్నారు. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని, చింతమడక గ్రామానికి ఏం చేసినా తక్కువేనని తెలియజేశారు. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశానని పేర్కొన్నారు. మీకు మంచిగా పని చేసే కలెక్టర్ ఉన్నాడని, ఊరికి త్వరలో రెండు రోడ్లు కావాలని, మూడు నెలల్లో వేయిస్తానని హామీ ఇచ్చారు.

ఒక్క చింతమడకనే బాగు చేస్తే దంతె కలవదని కాబట్టి నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తానని కెసిఆర్ స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తానని, చింతమడక ప్రజల హెల్త్ ప్రొపైల్ తయారు చేయాలన్నారు. ఊరి ప్రజలు ఏ రకమైన ఉపాధి కోరుకుంటారో దానే చేసుకోండని, మీరేం చేసిన అధికారులు మాత్రం అభ్యంతరం చెప్పరని, ఇచ్చే పది లక్షల రూపాయలను ఎట్లా ఉపయోగించుకుంటారో మీ ఇష్టమని, పైసలిచ్చే బాధ్యత నాదని, సక్కగ చూసుకునే జిమ్మేదార్ మీదని, చింతమడక అంటే బంగారు తునక కావాలని సూచించారు. ఊరికి అవసరమైన నిధులు ఇప్పుడే మంజూరు చేస్తున్నానని, వరి నాటేసే మిషన్లు కొనుక్కుంటే లాభసాటిగా ఉంటదని, గ్రామంలోని యువత ట్రాక్టర్లు, వరి కోసే మిషన్లు కొనుక్కోవాలని, పైసలు మిగిలితే ఆవులో బర్రెలో కొనండని సూచించారు. తాను విద్య నేర్చుకున్న గూడురు, తోర్నాల, దుబ్బాక, పున్నూరు గ్రామాలకు రుణపడి ఉన్నానని తెలిపారు. ఒక్క విమానం తప్ప సిద్ధిపేటకు అన్నీ తెచ్చామని, సిద్ధిపేటలో ఆనాడు తెచ్చిన మంచినీళ్ల పథకమే నేటి మిషన్ భగీరథ అని కెసిఆర్ చెప్పారు.

 

CM KCR Speech in Chintamadaka