Home తాజా వార్తలు పేదల గూడుకు తోడు

పేదల గూడుకు తోడు

Cm-Kcr

నామమాత్రపు ఫీజుతో 75 చ.గ.లోపు స్థలం రిజిస్ట్రేషన్, జి+1 నిర్మాణ అనుమతి, ఆస్తి పన్ను 100 రూపాయలే

పంద్రాగస్టు నుంచి సరికొత్త పాలన

 కొత్త మున్సిపల్ చట్టంలో పురపాలనపై కలెక్టర్లకు మరిన్ని అధికారాలు
 సర్పంచ్‌లు, చైర్‌పర్సన్ల తొలగింపుపై మంత్రులకున్న స్టే అధికారాలు రద్దు
 మాది సిటిజన్ ఫ్రెండ్లీ అర్భన్ పాలసీ.. అక్రమ కట్టడాలు నోటీసులు
లేకుండానే కూల్చేస్తాం .. ప్రాపర్టీ టాక్స్‌కు తప్పుడు వివరాలిస్తే 25 రెట్లు పెనాల్టీ
కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రతి వాక్యం నేనే రాయించా.. మున్సిపాలిటీల్లో
కలెక్టర్ల పాత్ర మరింత కీలకం… అదనపు బాధ్యతలు.. ఆగస్టు 15 నుంచి
రాష్ట్రంలో అద్భుత పాలన చూపిస్తాం .. పనిచేయని మేయర్, చైర్ పర్సన్లు,
కమిషనర్ల ఉద్యోగాలు ఊడుతాయి .. 85 శాతం గ్రీనరీ కనిపించని వార్డు
మెంబర్లు, గ్రామ కార్యదర్శులపై కూడా చర్యలు : అసెంబ్లీలో మున్సిపల్
బిల్లుపై ప్రసంగంలో సిఎం కెసిఆర్

ప్రజల సమక్షంలో ప్రజా దర్బార్ ద్వారా పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు. అడవులు నష్టపోకుండా చూసుకోవాలని, గిరిజనులను రక్షించాలన్నారు. అన్ని జిల్లాలకు స్వయంగా తానే వెళ్లనున్నట్లు సిఎం పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు, డివిజన్లకు మంత్రివర్గాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ అధికారులను తీసుకెళ్తానని, ఇది మీ పోడు భూమి.. ఇది మీ పట్టా అని ఇచ్చేస్తామన్నారు. దాన్ని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. దాని తరువాత ఒక ఇంచు అటవీ భూమి ఆక్రమణ కానివ్వమని స్పష్టం చేశారు. గిరిజనులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోడు భూములకు భరత వాక్యం పలకాలన్నారు. నిబంధనల ప్రకారం పేద గిరిజనులకు హక్కులు ఇస్తామని, వారికి రైతు బీమా, రైతు బంధు వచ్చేలా చేస్తామని చెప్పారు.

మన తెలంగాణ/హైదరాబాద్
75 చదరపు గజాలలోపు స్థలం రిజిస్ట్రేషన్‌కు ఒక రూపాయి, దానిపై ఇంటి నిర్మాణం అనుమతికి ఒక రూపాయి మాత్రమే చెల్లించవలసి ఉంటుందని, ఈ స్థలం జి ప్లస్ 1 వరకు రూపాయితో అనుమతి పొందవచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇదే విస్తీర్ణంలో కట్టుకున్న ఇంటికి ఆస్తిపన్ను ఏడాదికి రూ.100 మాత్రమేనన్నారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని, ఎటువంటి నోటీసు లేకుండానే కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. సెల్ఫ్ డిక్టరేషన్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఒకవేళ తప్పుగా ఇవ్వడం, ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ బిల్లుపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. అవినీతి రహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తెస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజలను కేంద్రబిందువులుగా చేసుకుని చట్టానికి రూపకల్పన చేశామన్నారు. కొత్త పురపాలక చట్టంలో ప్రతివాక్యం తానే రాయించానన్న సిఎం.. ఈ చట్టం కొందరికి నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు. 500 చదరపు గజాల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానిది ‘సిటిజన్ ఫ్రెండ్లీ ఆర్బన్ పాలసీ’ అని పేర్కొన్నారు. కొత్త చట్టంలో జిల్లా కలెక్టర్లు మరింత కీలకం కానున్నారని, పని చేయని సర్పంచ్‌లు, ఛైర్‌పర్సన్లు, వార్డుమెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందన్నారు. కలెక్టర్ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారాన్ని మంత్రి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను నమ్ముతున్నామని, వారిని విశ్వసిస్తున్నామన్నారు. ప్రజలేవరూ లంచాలకు ఇవ్వొద్దని సూచించారు. అధికారాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బిఆర్‌ఎస్ వంటి కేసుల్లో చాలా సందర్భాల్లో హైకోర్టు ముందు కూడా తల దించుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. జిహెచ్‌ఎంసి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏడు మున్సిపాలిటీలను కార్పొరేషన్‌లుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో 50 శాతం పట్టణీకరణ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ పాలసీపై సమగ్ర దృక్పదాన్ని సంబంధిత అధికారులు క్షున్నంగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. దీని ని దృష్టిలో పెట్టుకుని 20నుంచి 25 ఎకరాల స్థలంలో సెంట ర్ ఫర్ అర్భన్ పాలసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని కెసిఆర్ తెలిపారు. అలాగే శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణాలను ప్రొత్సహించనున్నామన్నారు. పట్టణాల్లో జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో తదునుగుణంగా సౌకర్యాల ను కల్పించడం కష్ట సాధ్యమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో గేటడ్ కమ్యునిటీ తరహాలో శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని కెసిఆర్ పేర్కొన్నారు.
85 శాతం మొక్కలు బతకాల్సిందే
పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం పెరగాలన్నారు. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సర్పంచుల పదవులు కూడా పోతాయని, 85 శాతం మొక్కలు బతికితేనే పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ఉంటుందన్నారు. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్ లో 10శాతం నిధులను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్, ఇన్‌చార్జ్ ఆఫీసర్‌కు చెట్ల పెంప కం బాధ్యత అప్పగిస్తామని, ‘85 శాతం మొక్కలు బతికించా లి.. లేకుంటే వారిని సర్వీస్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశా రు. చట్టం పాస్ చేసిన తర్వాతే పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని తానే కోరానని సిఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు మాత్రమే పని చేస్తే సరిపోదని, బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. హరితహారం లక్ష్యాలు పూర్తి చేయని ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తప్పవన్నారు.
ఇక ఒకేచోట పనిచేయడం కుదరదు
జిహెచ్‌ఎంసి పరిధిలో అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ వరకు ఒకేచోట పనిచేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. దీనివల్ల వాళ్లను ఎవరూ ఏం చేయలేకపోతున్నారన్నారు. మున్సిపల్ చట్టంలో ఎవరినైనా.. ఎక్కడికైనా బదిలీ చేసే విధంగా నిబంధనలు తీసుకువచ్చినట్లు వివరించారు. సర్పంచ్‌లు, కార్యదర్శులతో పాటు అందరూ బహుముఖంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. లక్ష్యం సాధించాలనే ఉద్దేశంతో చట్టంలో కఠిన నిబంధనలు పెట్టాం. ప్రతి వార్డులో మహిళా సంఘం, యూత్ కమిటీతో పాటు పలు సంఘాలు ఉంటాయి. ప్రతి కమిటీ సమావేశం నెలలో మూడో వారంలో జరుగుతుంది.
ప్రజా దర్బార్‌లతో పోడు సమస్యకు చెక్
ప్రజల సమక్షంలో ప్రజా దర్బార్ ద్వారా పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు. అడవులను నష్టపోకుండా చూసుకోవాలని, గిరిజనులను రక్షించాలన్నారు. అన్ని జిల్లాలకు స్వయంగా తానే వెళ్లనున్నట్లు సిఎం పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు, డివిజన్లకు మంత్రివర్గాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ అధికారులను తీసుకెళ్తానని, ఇది మీ పోడు భూమి.. ఇది మీ పట్టా అని ఇచ్చేస్తామన్నారు. దాన్ని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. దాని తరువాత ఒక ఇంచు అటవీ భూమి ఆక్రమణ కానివ్వమని స్పష్టం చేశారు. గిరిజనులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోడు భూములకు భరత వాక్యం పలకాలన్నారు. నిబంధనల ప్రకారం పేద గిరిజనులకు హక్కులు ఇస్తామని, వారికి రైతు బీమా, రైతు బంధు వచ్చేలా చేస్తామని చెప్పారు.
పంచాయతీ ఓ ఉద్యమం
పంచాయతీ అనేది ఒక విభాగం కాదని, ఓ ఉద్యమమని సిఎం అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ కలలు కన్నారని గుర్తు చేశారు. పంచవర్ష ప్రణాళికలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఎంఎల్‌ఎలందరికీ శిక్షణ ద్వారా పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామన్నారు. భారత ప్రజాస్వామ్యం విస్త్రృతమైనదని, మనది చాలా బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న దేశమన్నారు. భావి తరాలకు బతకగలిగే పరిస్థితులను మనం అందించాలన్నారు.

కలెక్టర్ల పాత్ర మరింత కీలకం
రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల పాత్ర మరింత కీలకం చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. పని చేయని సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారం మంత్రి నుంచి తొలగించామన్నారు. సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు మాత్రమే ఉంటుదన్నారు. ఒక సర్పంచ్‌ను కలెక్టర్ తొలగిస్తే.. సదరు సర్పంచ్ ఉదయం 11 గంటలకు ఎంఎల్‌ఎ ఇంట్లో, 12 గంటల లోపు మంత్రి ఇంట్లో కనిపిస్తాడు. సస్పెండ్ ఆర్డర్‌పై ఒంటి గంటకు స్టే వస్తుంద్నారు. ఆ మర్నాడు అదే కలెక్టర్ ముందు సర్పంచ్ కాలర్ ఎగరేసుకుంటూ కూర్చుండాన్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామపంచాయతిల్లో నెలకొన్న పరిస్థితి అని సిఎం తెలిపారు. అందుకే ఇప్పుడు మంత్రి స్టే ఇచ్చే అధికారానికి కోత పెట్టామన్నారు. వారిపై నియంత్రణ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనను చట్టంలో తీసుకువచ్చామన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కొత్త చట్టం గుర్తించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. చట్టం చదవకుండా తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదన్నారు. ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణలు పొందాలన్నారు. లేఅవుట్ల అనుమతులు కూడా కలెక్టర్లే జారీ చేస్తారన్నారు. ఇది కమిషనర్ల అధికారాలను తగ్గించినట్లు కాదన్నారు. నగర, శివారు ప్రాంతాల్లో ల్యాండ్ మాఫియా సాగిస్తున్న ఆగడాలను నియంత్రించడానికే కలెక్టర్లకు ఈ కొత్త బాధ్యతలను అప్పగించామన్నారు. అలాగే లేఅవుట్లలో జరిగిన అక్రమాలను చెక్‌పెట్టేందుకు లేఅవుట్లలో చూపిన పార్కులు, లైబ్రరీ, రోడ్లుకు సంబంధించిన స్థలాన్ని ముందుగానే మున్సిపాలిటీలకు రిజస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే లేఅవుట్లకు అనుమతులు లభిస్తాయని కెసిఆర్ తెలిపారు.

మూడేళ్లలో అద్భుతం
రానున్న మూడేళ్లలో అద్భుతం జరగుతుందని తాను ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత వరసగా ఎన్నికలు జరుగుతుండడం వల్ల పాలనపరంగా కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవేమని అంగీకరించారు. అయితే వచ్చే నెల 15 తరువాత రాష్ట్రంలో పాలన పరుగులు పెడుతుందన్నారు. మొదటి సారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు, నీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి పాలన చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలు తీరిన నేపథ్యంలో ఇక మిగిలిన రంగాలపై దృష్టి సారిస్తామన్నారు. రానున్న మూడేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం తీరుతెన్నులను పూర్తిగా మార్చివేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశానికే మన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో రోల్‌మోడల్‌గా నిలుబెడతామన్నారు. అధికారుల పనితీరులోనూ, విధుల నిర్వహణలోనూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలే చేసే అధికారం వస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు. ఖ్యూఆర్ కోడ్‌తో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కొత్త డోర్ నంబర్లు ఇస్తున్నామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో అపరిచిత వ్యక్తులుగానీ, సంఘ విద్రోహశక్తులుగా ఉండడం అసంభవమన్నారు.

కొత్తగా ఏడు కార్పొరేషన్లు
రాష్ట్రంలో ఇక నగర పంచాయతీలు ఉండవన్నారు. 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్‌లు ఉంటాయన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 141 యుఎల్‌బిలు ఉంటాయాన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే యుఎల్‌బిల సంఖ్యను పెంచామన్నారు. ఇందులో 7 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్‌తో పాటు మీర్‌పేట్, జిల్లెలగూడను కలిపి మీర్‌పేట మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, ఈ కొత్త కార్పొరేషన్ల మధ్య సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయన్నారు. స్థానిక శాసనసభ్యుల అభ్యర్థనల మేరకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉంటాయి.

ఎన్నికల తేదీల నిర్ణయం ప్రభుత్వానిదే
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఓ స్వతంత్ర సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో కలుగజేసుకోబోమన్నారు. అయితే పురపాలిక ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాలు, పండుగల సెలవులు, విద్యార్ధుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడాదన్న లక్షంతోనే స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలని కెసిఆర్ పేర్కొన్నారు. తదనుగుణంగానే కొత్త చట్టంలో మార్పులు తీసుకొచ్చామన్నారు.
సిఎంకు లేని అధికారాలు విఆర్‌ఓలకు ఉన్నాయి
ప్రభుత్వ పరిపాలన విధానంలో మోనోపలి వచ్చిందని కెసిఆర్ అన్నారు. దీని కారణంగానే ముఖ్యమంత్రి, స్పీకర్‌కు లేని అధికారాలు విఆర్‌ఓలకు ఉన్నాయని పేర్కొన్నారు. విఆర్‌ఓలు తలచుకుంటే ఒకరి భూమిని మరొకరికి రాసిస్తారన్నారు. కొంతమంది వీరిని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాం టి ఘటనలను ఉపేక్షించ కూడదన్న లక్షంతోనే నూతనంగా రెవిన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

CM KCR  Speech on New Municipal Bill Act in Assembly