Home ఎడిటోరియల్ నాలుగేళ్ల పాలన నాలుగు రోజులకో పథకం

నాలుగేళ్ల పాలన నాలుగు రోజులకో పథకం

CM KCR to Introduce New Schemes In August

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళ మూడు నెలల పాలనలో సగటున నాలుగు రోజులకో సంక్షేమ, అభివృద్ధి పథకం చొప్పున ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సుమారు నాలుగు వందల సంక్షేమ, అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసింది. 58 ఏళ్ల పరాయి పాలనలో మగ్గిపోయిన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన గొప్ప సంతృప్తిని కలిగించింది.
తెలంగాణ సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ అవసరాలకు తగినట్లుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను డిజైన్ చేయడంలో ఆయన విజయం సాధించారు. ముందుగా తెలంగాణ బ్రతుకంతా సాగు నీటిలోనే ఉందని గమనించిన సీఎం కేసీఆర్ కోటి ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు . కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర సాగు నీటి ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కేటాయించినన్ని నిధులను దేశంలో ఏ రాష్ట్రమూ కేటాయించలేదు . కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా చేపడుతూనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని లిఫ్టులను పూర్తి చేసి కొన్ని వందల చెరువులు నింపి లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించింది.

గోదావరి బేసిన్ లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదిలాబాద్ నుండి వరంగల్, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ వరకు చెరువులను నింపేందుకు ప్రభుత్వం కృషి చేసింది. తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న కారణంగా భూ సంపద విలువ భారీగా పెరిగింది. గతంలో ఎకరం భూమి విలువ మూడు లక్షలకు మించి లేదు. ఇప్పుడు తెలంగాణలో మారు మూల ప్రాంతాల్లోనూ ఎకరం భూమి విలువ రూ. 10, – 15 లక్షలకు తక్కువ లేదు. వచ్చే ఏడాది, రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తయి సాగు నీరు అందితే ఒక ఎకరం విలువ రూ. 25 లక్షలకు చేరవచ్చని అంచనా. అంటే కోటి ఎకరాలు కొత్తగా సాగు లోకి వస్తే తెలంగాణలో భూ సంపద విలువ సుమారు రూ 25 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న కోటి మూడు లక్షల కుటుంబాల్లో 58 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నయి. మరో పది లక్షల మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నయి. సుమారు 70 శాతం కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కీలకమైన విద్యుత్తు సమస్యను అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే పరిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదట గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చి ఇప్పుడు రైతులకు కూడా ఉచితంగా నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు కోసమే ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ. 5000 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇక 58 ఏళ్ల సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. 40 లక్షల మంది పేద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు తదితరులకు ప్రతి ఏటా రూ. 5000 కోట్లు పంపిణీ చేస్తున్నది. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. మొదట్లో రూ. 50,000 తో ప్రారంభించిన ఈ పథకం ఆ తర్వాత రూ. 75116 ఇవ్వగా ఇప్పుడు రూ. 1,00,116 అందిస్తున్నది. ప్రతి ఇంటికి తాగు నీరు అందించే మిషన్ భగీరథ పథకంతో వివిధ రకాల జబ్బుల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తున్నది. స్వచ్ఛమైన తాగు నీరు అందకపోవడం వల్లే పేదలకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం కుటుంబాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని అందించడం వల్ల పేద ప్రజలు వైద్యానికి చేసే ఖర్చు బాధ తప్పుతుంది.

మిషన్ కాకతీయ పథకంతో వేలాది చెరువులు నీటితో కళకళలాడుతున్నయి. రైతుల కోణంలో ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన మరో అద్భుతమైన పథకం రైతబంధు. రైతులకు ముందు గా పంట పెట్టుబడి అందించాలనే ఆలోచన దేశంలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ రాలేదు. ఏడాదికి ఎకరానికి రూ. 8 వేలు అందించే ఈ పథకం రైతులకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే వానాకాలం పంటలకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా రూ. 5000 కోట్లను పంపిణీ చేసింది. సాగుకు ముందే పంట పెట్టుబడి అందిస్తుండడంతో రైతులంతా సంతోషంగా ఉన్నరు.

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ప్రాణం పోసే లక్ష్యంతో గ్రామీణ కుల వృత్తులకు చేయూతనందించేందుకు యాదవ, కురుమ సోదరులకు గొర్రెల పంపిణీ పథకం అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నది. ఇప్పటికే గొర్రెల పంపిణీ తో రూ. 1200 కోట్ల సంపద పెరిగింది. మరో వైపు వేలాది చెరువుల్లో కోట్లాది చేప పిల్లలను వదులుతూ మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది. బెస్త, ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన కుటుంబాలకు భారీగా ఉపాధి లభిస్తున్నది. చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పేదలకు దసరా పండుగకు పంపిణీ చేసే దుస్తుల ఆర్డర్ ఇవ్వడమే కాకుండా పలు ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నది. కల్లు గీత వృత్తిపై ఆధారపడే గీతకార్మికులకు మేలు చేసే విధంగా వారి చెట్టు పన్నును రద్దు చేయడమే కాకుండా వృత్తిలో ఉన్న వారికి పెన్షన్ అందిస్తున్నది. కోట్లాది ఈత, తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఎంబిసిలకు ఉపాధి కల్పించడానికి స్వయం ఉపాధి పథకాలకు వంద శాతం సబ్సిడీతో నిధులు కేటాయిస్తున్నది. ఆరోగ్యశ్రీ పథకానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి అమలు చేస్తున్నది.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకంతో లక్షలాది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నది . ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థుల కోసం భారీ స్థాయిలో గురుకుల విద్యాలయాలను ప్రారంభించింది . లక్షలాది మంది విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్నది. ప్రభుత్వం 24 గంటల విద్యుత్తు అందించడంతో పాటు 15 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ఇచ్చే విధంగా టి ఎస్ ఐ పాస్‌కు శ్రీకారం చుట్టడంతో వేలాది పరిశ్రమలు తెలంగాణ కు తరలివస్తున్నయి. ఈ నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కొత్త పరిశ్రమల వల్ల ఇప్పటి వరకు సుమారు ఏడు లక్షల మంది యువతకు ఉపాధి లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించారు. మొదటి టర్మ్‌లో ప్రజల అభిమానాన్ని పొందిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది.

                                                                                                                                                        – మిట్టా సైదిరెడ్డి