Home తాజా వార్తలు ధరణి పోర్టల్‌పై నేడు సిఎం సమీక్ష

ధరణి పోర్టల్‌పై నేడు సిఎం సమీక్ష

CM KCR to review Dharani portal design today

 

‘ధరణి’ సమస్యలపై నేడు అధికారులతో చర్చ
మార్పులు, చేర్పులు, సవరణలకు పరిష్కారం
సమస్యలను అంశాలవారీగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివరించనున్న రెవెన్యూ అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: ‘ధరణి’ వెబ్‌సైట్‌కి ‘తెలంగాణ భూ హక్కులు పట్టాదార్ పాసు పుస్తకాల చట్టం 2020’ పరిష్కారం చూపనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని పారదర్శకంగా నిర్వహించాలంటే దానికి అనుగుణంగా ‘ధరణి’ పోర్టల్ రూపకల్పన జరగాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ‘ధరణి’ ఫోర్టల్ రూపకల్పనపై నేడు మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ప్రగతిభవన్‌లో సిఎం సమావేశం నిర్వహించనున్నారు.

అయితే సిఎంతో జరిగే సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు అందిన నేపథ్యంలో అధికారులు ‘ధరణి’ ఫోర్టల్‌లో ఏవైనా సమస్యలు తలెత్తాయా, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌ల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని వాటిని సిఎంకు వివరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. కొత్త చట్టం పాదర్శకంగా అమలు కావాలంటే ముందస్తుగానే లోపాలను సవరించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఆ దిశగా దానికి తుదిరూపు ఇచ్చేలా అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం జరుపుతున్నారు.

డిజిటల్ కీ వర్తింపుపై ప్రధానంగా చర్చ
ధరణి మాన్యువల్‌తో పాటు అనేక అంశాలపై ఈ సమావేశంలో అధికారులతో సిఎం కెసిఆర్ చర్చించనున్నట్టుగా సమాచారం. ప్రధానంగా ధరణి వెబ్‌సైట్‌లో మార్పులు, చేర్పులతో పాటు వాటి సవరణలకు అనుగుణమైన రీతిలో ఉన్నతాధికారులకు అధికారాలిస్తూ డిజిటల్ కీ ను వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఆర్డీఓ, అదనపు కలెక్టర్‌లకు కూడా ఈ వెసులుబాటును ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

మార్పులకు వెసులుబాటు కల్పించే దిశగా గైడ్‌లైన్స్
ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయన్న నేపథ్యంలో వాటిని సరిచేయడానికి సిఎం కెసిఆర్ పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ధరణియే ఆర్వోఆర్ రికార్డుగా పరిగణిస్తున్న నేపథ్యంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చేలా దీనిని రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. చట్టంలో సేల్ డీడ్, వారసత్వం, కోర్టు డిక్రీ హక్కుల రికార్డులను కొత్త చట్టంలో పేర్కొన్నారు. కానీ అన్ సెటిల్డ్, పీటీ, ఓఆర్సీ, సాదాబైనామా వంటి గురించి పేర్కొనలేదు.

ధరణిలో నమోదు కానీ భూముల వివరాలపై ఆరా
వికారాబాద్ జిల్లా ఆలంపల్లి, రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల మండలాల సరిహద్దు సరస్వతిగూడలో బిలా దాఖలా భూములు (సర్వే చేయని భూములు) ఉన్నాయి. ఆలంపల్లిలో 400 ఎకరాలు ఉంది. సరస్వతిగూడలోనూ 50 ఎకరాల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని భూములను పక్కనే ఉన్న పట్టాదారులు కలిపేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ సెటిల్ భూముల వివరాలు ధరణిలో నమోదు కాకపోవడంతో వీటికి టిప్పణీలు లేవు.

లక్షలాది పట్టాదారు పాసు పుస్తకాల్లో సవరణలు
ప్రస్తుతం లక్షలాది పట్టాదారు పాసు పుస్తకాల్లో సవరణలు చేయాల్సి ఉంది. ఈ సవరణకు గాను లాగిన్ ఇచ్చిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తే ఆయా వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో కనిపించడం లేదన్న ఫిర్యాదులను సిఎం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ధరణిలో డిజిటల్ సంతకం నమోదు చేయడానికి ఆధార్ తప్పనసరి కాగా, రైతులు మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆధార్ వివరాలు ఇస్తే సదరు ఖాతాలకు చెందిన వివరాలు, ఫొటోలు ధరణిలో కానరావడం లేదని తహసీల్దార్‌ల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

CM KCR to review Dharani portal design today