Home తాజా వార్తలు నేడు వరంగల్‌కు కెసిఆర్

నేడు వరంగల్‌కు కెసిఆర్

CM KCR to visit Warangal MGM Hospital tomorrow

వరంగల్ అర్బన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం వరంగల్‌కు వస్తున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. అక్కడ రోగులకు అందుతున్న చికిత్స, సౌకర్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. సిఎం కెసిఆర్ బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అక్కడి కరోనా బాధితులతో నేరుగా మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అంతేగాకుండా గంటకు పైగా వివిధ వార్డుల్లో తిరుగుతూ సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలని నిర్ణయించారు. మెదట హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైనా వరంగల్‌ను సందర్శించాల నుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు హైలికాప్టర్ ద్వారా సిఎం కెసిఆర్ హన్మకొండలోని ఆర్ట్ కళాశాల మైదానం చేరుకుంటారు.

అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్‌లో హంటర్‌రోడ్‌లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి సెంట్రల్ జైల్‌కు వెళతారు. సెంట్రల్ జైల్ స్ధానంలో ఆధునాతన సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని ఇటీవల ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయన సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపి కెప్టెన్ ఇంట్లో మధ్యాహ్న భోజనం అనంతరం 2 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుంటారు. అక్కడ కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వైద్యసేవలను అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తారు. అక్కడి వైద్యాధికారులతో మాట్లాడుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళతారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఎంజీఎం ఆస్పత్రితో పాటు సెంట్రల్ జైల్‌ను సందర్శించారు. స్థానికంగా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.

సిఎం కెసిఆర్ పర్యటన వివరాలు..
ఉదయం 11 గంటలకు హెలిక్యాప్టర్‌లో వరంగల్‌కు చేరుకుంటారు.
11.20 గంటలకు హంటర్ రోడ్‌లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుంటారు.
11.45 గంటలకు సెంట్రల్ జైల్‌ను సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1 గంటకు తిరిగి కెప్టెన్ ఇంటికి చేరుకుని భోజనం చేస్తారు.
2 గంటలకు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శిస్తారు.
3 గంటలకు కెప్టెన్ ఇంటికి చేరుకుంటారు.
4 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరి హైదరాబాద్‌కు వెళతారు.

CM KCR to visit Warangal MGM Hospital tomorrow