Home తాజా వార్తలు ఆ మూడు గ్రామాలు నాకు విద్యాబుద్దులు నేర్పాయి

ఆ మూడు గ్రామాలు నాకు విద్యాబుద్దులు నేర్పాయి

Chintamadaka

మనతెలంగాణ/హైదరాబాద్ : చింతమడక బంగారు తునక కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. తనను కని పెంచిన చింతమడక ఊరుతో పాటు గూడూరు, తోర్నాల, దుబ్బాక, పుల్లూరు గ్రామాలు విద్యా బుద్ధులు నేర్పించాయనిగుర్తు చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం చింతమడకలో సోమవారం సిఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ అనురాగ సభకు హాజరయ్యారు. హెలిప్యాడ్ దిగి సభా స్థలికి చేరుకున్న సిఎం వేదికపై చేరుకోకుండా గ్రామస్తుల గ్యాలరీకి వెళ్లి పలకరిస్తూ.. వారితో కరచాలనం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తనను కని పెంచి.. ఈ రాష్ట్రానికి అప్పగించిన చింతమడక గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చింతమడక వాస్తు పరంగా కూడా బాగుంటుందని., గ్రామానికి నాలుగు వైపులా చెరువులు ఉన్నాయంటూ.. నా చిన్నప్పుడు చెరువు ఊట.. మా బజార్ ముందు నుంచి పోయేదని వేదికపై తన జ్ఞాపకాలను పంచుకున్నారు. చాలా కాలం తర్వాత నా కోరిక నెరవేరుతుందని రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. ఈ ఊరికి నాలుగు మూలల్లో నాలుగు అద్భుతమైన తటాకాలు ఉన్నాయని అన్నారు.
హెల్త్ ప్రొఫైల్‌కు చింతమడక నాంది కావాలి
చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయాలని ఎంఎల్‌ఎ హరీశ్ రావును కోరుతున్నానని తెలుపుతూ.. ముందుగా ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. నెల రోజుల్లో చింతమడకలో ఆరోగ్య సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్, ఎంఎల్‌ఎలను కోరారు. తెలంగాణ హెల్త్ పొఫైల్ కు చింతమడక నాంది కావాలన్నారు.
వలస వెళ్లినవారికి కూడా పథకాలు అందాలి
జీవనోపాధి కోసం వలసపోయిన వాళ్ళను సైతం పిలిపించి.. వారికి కావాల్సిన సాయం అందిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు లబ్ధి చేకూరుస్తామని, ప్రభుత్వం అందిం చే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలని సూచించారు. ఎవరు ఏ ఉపాధి మార్గాలను ఎంచుకున్నా అభ్యంతరం ఉండకూడదని తెలుపుతూ.. వరి నాట్లు వేసే మిషన్లు కొనుకుంటే లాభసాటిగా ఉంటుందన్నారు. ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటే అనుకున్న లబ్ధిని తప్పకుండా పొందుతారని చెప్పారు. పైసలు మిగిలితే ఆవులు, బర్రెలు కొనుక్కోవాలని., ఊరిలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలన్నదే తన కోరిక అన్నారు.
సిద్ధిపేట జిల్లాకు సిఎం వరాల జల్లు
సిద్ధిపేట నియోజకవర్గం తనను రాజకీయంగా పెంచిందని ఎన్నో అద్భుతమైన విజయాలు ఇచ్చిందని సిద్ధిపేటలో తెచ్చిన ఇంటింటి నల్లా పథకం స్పూర్తితో మిషన్ భగీరథ తెచ్చామని.. సిఎం కెసిఆర్ చెప్పారు. చింతమడక, సిద్ధిపేట జిల్లాకు సిఎం వరాల జల్లు కురిపించారు. సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి కోసం రూ.50లక్షలు, అలాగే రంగనాయక సాగర్ కట్ట అభివృద్ధి కోసం రూ. 5కోట్ల రూపాయలు, సిద్ధిపేట పట్టణ అభివృద్ధికి రూ. 25 కోట్ల రూపాయలు, దుబ్బాక పట్టణ అభివృద్ధికి రూ.10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిధుల వరద కురిపించారు. అలాగే పుల్లూరు, తోర్నాల, రాజన్న- సిరిసిల్ల జిల్లాలోని గూడూరు అభివృద్ధికి ఒక్కో గ్రామానికి రూ. కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా చింతమడకలో నిర్మించనున్న శివాలయం, రామాలయానికి కూడా నిధులు మంజూరు చేస్తామని వెల్లడించి జై తెలంగాణ.. జై చింతమడక అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఆరు దశాబ్దాల తెలంగాణ గర్వించేలా చేశారు : హరీశ్
పుట్టి పెరిగిన ఊరును పునర్నిర్మాణం చేసేందుకు చింతలేని చింతమడక గా తీర్చిదిద్దేందుకు వచ్చిన సిఎం కెసిఆర్ రాకతో చింతమడక గ్రామం పులకించి పోతున్నదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు చెప్పారు. చింతమడక బిడ్డ.. ఆరు దశాబ్దాల కల స్వరాష్ట్రం సాధించి యావత్తు తెలంగాణ గర్వించేలా చేశారని.. ఎవరైనా ఊరి పేరుతో గౌరవం పొందుతామని.. కానీ కెసిఆర్ చింతమడకకు గౌరవం తెచ్చారని అన్నారు. సిఎం రాకతో గ్రామ ప్రజలంతా ఉప్పొంగిన గుండెలతో, ఉత్సాహంగా స్వాగతం తెలియజేశారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, చిన్ననాటి దోస్తులు.. ఎవరెవరైతే వారి మీద ప్రేమతో ఈ సమావేశానికి విచ్చేశారో.. వారందరినీ స్వాగతిస్తున్నానని తెలిపారు.

ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గంకన్నా మిన్న అంటూ.. మీ అందరి ప్రేమను పంచుకుని యావత్ రాష్ట్రాన్ని సాధించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. అందరికీ ఊరు గుర్తింపు తెస్తే.. మన చింతమడక ఊరికి మన రాష్ట్రానికి మన సిఎం కెసిఆర్ గుర్తింపు తెచ్చారని చెప్పారు. నిమ్స్‌లో నిరాహార దీక్ష చేసినప్పుడు చింతమడక గ్రామం చిన్నబోయిందని., ప్రజలంతా టివిల ముందు కూర్చుని మిమ్మల్ని చూస్తూ వారి కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారని.. అప్పుడు ఒక్క ఇంట్లో పొయ్యి వెలుగ లేదని, ఎవరి అన్నం ముద్ద తినలేదని.. ఉద్యమ సమయ జ్ఞాపకాలను గుర్తు చేశారు. హెలిప్యాడ్ వద్ద సిఎం కెసిఆర్‌కు జిల్లా కలెక్టర్ పి.వెంకట్‌రామ్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

చింతమడకలో పాదయాత్ర
చింతమడక గ్రామంలో సిఎం కెసిఆర్ పాదయాత్ర చేస్తూ.. ఇంటింటా తిరిగారు. పేరుపేరునా ఆత్మీయంగా పలకరించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని.. గ్రామస్థులకు కావాల్సిన సాయానికి అక్కడికక్కడే ఎంఎల్‌ఎ హరీశ్ రావు, జిల్లా కలెక్టర్‌కు సూచిస్తూ.. గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అనంతరం రాలయాన్ని పరిశీలించారు. ఆ తర్వాత శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌సి ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్‌రామ్‌రెడ్డి, జెడ్‌పి ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎంఎల్‌ఎలు రామలింగా రెడ్డి, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, పోలీసు ఉన్నతాధికారులు, గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Cm Kcr Tour In Chintamadaka Village