Home తాజా వార్తలు స్వయం జయం

స్వయం జయం

kcrమన తెలంగాణ / వరంగల్ : పల్లెల స్వయం సమృద్ధి, స్వయం పాలన లక్షంగా గ్రామజ్యోతి కార్యక్రమా న్ని రూపొందించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గంగదేవిపల్లిలాంటి ఆదర్శగ్రామాలు సంఘటితశక్తితో అంకాపూర్ అడుగు జాడల్లో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా ప్రకటించిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో సోమవారం జరిగిన సదస్సులో సిఎం కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నల్లబెల్లి మండలం మేడిపల్లిలో జరిగిన గ్రామజ్యోతి సదస్సుకు సిఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి తదితరులు హాజరయ్యారు.

తొలిసారి తమ గ్రామానికి వచ్చిన సిఎంకు గంగదేవిపల్లి గ్రామ మహిళలు, ప్రజలు బోనాలు, మంగళహారతులు, కోలా టాలతో ఘనస్వాగతం పలికారు. అనతంరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సును జ్యోతిప్రజ్వలన చేసి సిఎం కెసిఆర్ ప్రారంభించారు. గంగదేవిపల్లికి రూ.10కోట్లు, మేడపల్లికి దాత సురేందర్ రావు కుటుంబం ఇచ్చిన రూ.కోటితో కలిపి రూ.10కోట్లు నిధులు ప్రకటిం చారు. గంగదేవిపల్లికి అనేక వరాలు ప్రకటించారు. దేశంలోనే రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో నెంబర్‌వన్‌గా ఉందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు చీకట్లు కమ్ముకుంటాయని చెప్పారని, ఏడాదిలో ఆ సమస్య లేకుండా చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు తవ్వి వదలిపెట్టారని, ఇందతా గత పాలకుల పుణ్యమేనన్నారు.

అందుకే ఆ ప్రాజెక్టులపై రీఇంజనీరింగ్ సాగుతుందన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి రెండేళ్ళల్లో ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల వరంగల్ జిల్లాకు జలకళ వస్తుందన్నారు. తామెట్ల బాగుపడాలనే వారు ఎక్కువై సమాజాన్ని బాగు చేయాలనుకునే వారు తక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా సామాజిక ఐక్యతకు గంగదేవిపల్లి నిదర్శనంగా నిలిచిందన్నారు. 23సంవత్సరాలుగా ఒక పద్ధతిని పెట్టుకొని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారని కొనియాడారు. భారతీ యులు వ్యక్తిగతంగా హిట్టేకానీ, సంఘంగానే ఫెయిలవుతున్నారు. ఎవరోవస్తా రని ఎదురుచూడకుండా గొప్పగా బతికేందుకు పనిచేయడం ఉన్నతమైంద న్నారు.

ఎవరూ వెయ్యేండ్లు బతకడానికి రాలేదని.. ఉన్నపుడు ఏం చేశామనేది ముఖ్యమన్నారు. స్వాతంత్య్రం సాధించిన గాంధీ ఇపుడు లేడు.. ఆయన స్ఫూర్తి ఉందని గుర్తించాలన్నారు. కలిసికట్టుగా ఆదర్శంగా నిలిచిన గంగదేవిపల్లి ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నానని అన్నారు. నేను రాలే… మీరే నన్ను ఇక్కడికి రప్పించారు. ముఖ్యమంత్రిని రప్పించిన గంగమ్మతల్లుల మీరంటూ మహిళలను కొనియాడారు. సంస్కారం ఉన్న గొప్పగ్రామంగా అభివర్ణించారు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందని, దీంతో బంగారు తెలంగాణ కాదా? అంటూ ప్రశ్నించారు.

అంకాపూర్ అడుగుజాడలు
గంగదేవిపల్లి అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించామని ఈ నిధులు రేపే విడుదల చేస్తామన్నారు. ఏం చేయాలనేది నేను చెప్పను… ఇక్కడ ఏముందో నాకు తెలుసు. మీరే గ్రామసభ పెట్టుకొని నిర్ణయించుకోవాలని సిఎం సూచించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ అడుగుజాడల్లో గంగదేవిపల్లి నడువాలన్నారు. అక్కడ పంటలు పండించి, మార్కెట్ చేసుకొని గ్రామం స్వయం సమృద్ధి సాధించిందన్నారు. ఆ గ్రామ అభివృద్ధి కమిటీ సుప్రీంకోర్టు కంటే ఎక్కువన్నారు. ఈ గ్రామానికి మిమ్మల్ని ప్రత్యేకంగా పంపిస్తానని హామీ ఇచ్చారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేయాలన్నారు. దోమలులేని పల్లెగా మారాలన్నారు. ఏడాదిలోపు మళ్ళీ వస్తానని ఆయన అన్నారు. మనిషి ప్రేమించడం నేర్చుకోవాలన్నారు.

రాక్షస సంతతి
మంచిపనిచేసే టపుడు కొందరు సన్నాసులు ఎక్కడైనా అడ్డుపడుతారని ఈ రాక్షస సంతతిని పట్టించుకోవద్దంటూ తనదైన శైలిలో పిట్టకథ చెప్పారు. రామ-రావణ యుద్ధంలో రామబాణానికి చచ్చిన రాక్షసులు తాము సగం ఆయుస్సులోనే చనిపోయామని రామునికి మొరపెట్టుకున్నారు. కలిగియుగంలో మానవులై పుడుతారని రాముడు అభయమిచ్చాడు. ఆ రాక్షస సంతితికి చెందిన వారే అడ్డంకులు సృష్టించేవారని అన్నారు. వీరికి భయపడకూడదు.

ఎప్పుడు ధర్మమే గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గంగదేవిపల్లి సర్పంచ్ ఇట్ల శాంతి, ఉప సర్పంచ్ కూసం రాజమౌళి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డి, రసమయి బాలకిషన్, ఎంపీ సీతారాంనాయక్, వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు పలువురు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్‌పీటర్, కమిషనర్ అనితారాంచంద్రన్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జెసి ప్రశాంత్‌జీవన్ పాటిల్, సిపి సుధీర్‌బాబు, ఎంపీటిసీ, జడ్పీటీసీ, పలువురు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.