Home తాజా వార్తలు నేడే సిఎం కెసిఆర్ యాదాద్రి సందర్శన

నేడే సిఎం కెసిఆర్ యాదాద్రి సందర్శన

CM KCR Visits Yadadri Temple today

 

యాదాద్రి పునర్నిర్మాణ పనుల పరిశీలన,ఆలయ ఉద్ఘాటనపై నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రధానాలయం, ఇతర పనులపై ప్రత్యేక దృష్టి 

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కొత్త రూపును సంతరించుకుంటోంది. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.దీంతో కేసీఆర్ ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయ నిర్మాణ పనుల్ని చేపడుతోంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజా గా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 4 నేడు యాదాద్రికి రానున్నారు.

గత ఆరేళ్ల క్రితం యాదాద్రి ఆయల పునర్నిర్మాణ పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణ తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.అందులో భాగంగానే నేడు యాదాద్రికి సిఎం కేసీఆర్ రానున్నారు. ఇది 14వ సారిగా యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు పెట్టనున్నారు. గురువారం ఉదయం యాదాద్రి కొండపైకి చేరుకొని కొండపై ప్రధానాలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు.అందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో సందర్శించనున్నట్లు సమాచారం. కాగా ప్రధాన ఆలయంతోపాటు క్యూలైన్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ సూట్ పనులను పరిశీలించనున్నట్లు సమాచారం. అక్కడే ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తారని తెలిసింది. ఆర్టీసి బస్ టెర్నినల్, డిపోలను నిర్మించనున్న స్థలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు.

ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం సమీక్షించి నిర్మాణ పనులపైన అధికారులకు తగు సూచనలు,సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ ముహుర్తం తేదీన ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సిఎంఒ నుంచి అందిన సమాచారం మేరకు వైటిడిఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం రోజుల పాటు సిఎం పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అయితే ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు. ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే జోరందుకున్నాయి.అన్ని హంగులతో యాదాద్రి ఆలయాన్ని నిర్మానం చేస్తున్నారు.

CM KCR Visits Yadadri Temple today