Home తాజా వార్తలు చింతమడకలో ఓటు వేసిన కెసిఆర్

చింతమడకలో ఓటు వేసిన కెసిఆర్

 

CM KCR votes in native village

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా దాదాపుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం మందకొడి గా ప్రారంభమైనా సాయంత్రానికి పుంజుకుంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఆసక్తి చూపారు. తొలి రెండు గంటల్లోనే క్యూలో నిలబడి వారు ఓటేశారు. ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ తన జీవితంలో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ ఎన్నికల్లో కొసమెరుపు.
బంజారాహిల్స్ కెటిఆర్…సిద్ధిపేటలో హరీష్‌రావు
మంత్రి కెటిఆర్ బంజారాహిల్స్‌లోని సెయింట్ నిజామిస్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఆయన కొద్దిసేపు క్యూలో నిలబడ్డారు. హిమాయత్‌నగర్‌లోని సెయింట్ అంథోనిస్ స్కూల్‌లో కెటిఆర్ సతీమణి శైలిమ ఓటు వేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట మండలం పోతంగల్ గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎంపి కవిత తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. చాలామంది మంత్రులు ఓటు వేసేందుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. సిద్ధిపేటలో 102వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో మంత్రి హరీష్‌రావు దంపతులు, హన్మకొండ టీచర్స్ కాలనీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోచారం గ్రామంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన సతీమణితో కలిసి తన ఓటు వేశారు. ఎల్లపల్లి గ్రామంలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం గొల్లగూడలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌లో మంత్రి లకా్ష్మరెడ్డిలు కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజాంపూరలో డిఫ్యూటీ సిఎం మహమూద్ అలీ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటును వినియోగించుకోగా, మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సమేతంగా డిఫ్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఓటేశారు.
ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
మంత్రులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఓటు వేయడానికి ముందంజలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన ఓటు హక్కును వినియోగించుకోగా, బూత్‌నెంబర్ 148లో మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటును వేశారు. 152 పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున తన సతీమణి అమలతో కలిసి ఓటేశారు. సినీ నటి జయసుధ గచ్చిబౌలి జీపిఆర్‌ఏ క్వార్టర్స్‌లో ఓటు వేయ గా, హీరో జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, నాగబాబు, నితి న్, నవదీప్, రాజమౌళి, సూపర్‌స్టార్ కృష్ణ దంపతులు, నరేష్ తదితరులు సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తన సతీమణితో కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సెయింట్ అగస్టీన్ స్కూల్‌లో ఓటును వినియోగించుకున్నారు. టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరర్ సెంటర్‌లో ఓటేశారు.

మొదటిసారి ఓటేసిన గద్దర్
మొదటిసారిగా ప్రజాగాయకుడు గద్దర్ తన ఓటు హక్కు ను వినియోగించుకున్నాడు. తన సతీమణి విమలతో కలిపి అల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశా రు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతి లో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పుస్తకం ఉండడం విశేషం. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీలో గద్దర్ చేరారు. ఇప్పటివరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఆయన ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రజా కూటమి తరఫున ప్రచారం చేశారు.

CM KCR votes in native village