Home తాజా వార్తలు ఆదాయం పెంచాలి పేదలకు పంచాలన్నదే సిఎం కెసిఆర్ ధ్యేయం : కెటిఆర్

ఆదాయం పెంచాలి పేదలకు పంచాలన్నదే సిఎం కెసిఆర్ ధ్యేయం : కెటిఆర్

cm kcr

 

సిరిసిల్ల : ప్రభుత్వ ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనేది సిఎం కెసిఆర్ ధ్యేయమని, రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని, పప్పులో ఉప్పు మాత్రమే వేసి అంతా మేమే చేశామని తప్పుడు ప్రచారం సాగించే వారిని వాడవాడలా ప్రజలు నిలదీయాలని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల ఎంఎల్‌ఏ, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కెటిఆర్ సిరిసిల్ల మార్కెట్ కమిటి ఆవరణలో, పద్మనాయక కళ్యాణ మంటపంలో నిర్వహించిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పెన్షన్ లబ్దిదారులను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడారు.

రాష్ట్రంలో 50 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లను కెసిఆర్ ప్రభుత్వం అందిస్తూ అందుకోసం రూ. 12 వేల కోట్లు వ్యయం చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.లు 200 కోట్లు మాత్రమే అందిస్తూ ప్రజలకు పెన్షన్లు తామే ఇస్తున్నామని చెప్పుకోవడం గమనించాలని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలే నిలదీసి బుధ్ధి చెప్పాలన్నారు. కేంద్రమే పెన్షన్లకు నిధులు ఇస్తోందని తప్పుడు ప్రచారం చేసుకునే వారు వారి పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో రూ.లు 2,000, రూ.లు 3,000 పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో నిలదీయాలన్నారు. పేదల కోసం తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని, దుష్ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రజలను కోరారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏటా రూ.లు 40 వేల కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు.

పేద ప్రజలకు ఆత్మగౌరవం కలిగే జీవనాన్ని అందించేందుకు నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను పారదర్శకంగా, లాటరీ పద్దతిలో ప్రజల సమక్షంలోనే డ్రా తీసి అందిస్తామని అన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేందుకు మండెపల్లిలో 1360, పెద్దూరులో 300, శాంతినగర్‌లో 200 ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మంచి రోజు చూసి నిరుపేదలకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. నిరుపేదల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని సకల జనుల సర్వేలో అన్ని వివరాలు నమోదై ఉన్నాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల పైరవీల కోసం ఎవ్వరికీ ఒక్క పైస కూడా ఇవ్వవద్దని అన్నారు. తాము ఇండ్లను రూ.లు 5.40 లక్షలతో నిర్మించినప్పటికీ ఆ ఇండ్ల మార్కెట్ విలువ ఒక్కొక్కటి రూ.లు 20 నుండి 25 లక్షల వరకు ఉంటుందన్నారు.కొందరు డబ్బులిస్తే ఇండ్లు మంజూరు చేయిస్తామని నమ్మపలుకుతారని ఎవరికీ ఒక్క రూపాయకూడా ఇవ్వవద్దన్నారు.

పైరవీలకు అతీతంగా అర్హులకు పారదర్శకంగా ఇండ్ల కేటాయింపును లాటరీ పద్దతిలో చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కేవలం రూ.లు 70 వేలు ఇచ్చారని తాము డబుల్ బెడ్‌రూం ఇండ్లకు అంతకు 8 రెట్లు అధికంగా వెచ్చించి ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. మార్కెట్లో దాని విలువ రూ.లు 20 నుండి 25 లక్షలవరకుంటుందన్నారు. స్వంత జాగలు ఉన్నవారికి కూడా ఇండ్ల నిర్మాణం కోసం నిధులు త్వరలోనే అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 700 ప్రభుత్వ గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామని, ఏటా 3 లక్షల మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లు 1.20 లక్షలు వ్యయం చేస్తున్నామన్నారు.

పుట్టిన శిశువునుండి వృధ్ధాప్యం వరకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మి, శాదీ ముబారక్ పథకాలతో పెళ్లికి, కెసిఆర్ కిట్ పేరిట ఆడపిల్ల పుడితే రూ.లు 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.లు 12 వేలు అందిస్తున్నామని, అమ్మవొడి, ఆరోగ్యలక్ష్మి, వృధ్ధాప్యం వరకు రకరకాల పథకాలు, పెన్షన్లకు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్, సుందరయ్యనగర్‌లలో 1979 సంవత్సరం నుండి 1990 సంవత్సరం వరకు పలుదఫాల్లో ఇండ్ల స్థలాలు పొందిన వారిలో 3,400 మందికి ఇటీవల పట్టాలిచ్చామని వాటితో బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వెసులు బాటుకూడా కల్పించామన్నారు. సిరిసిల్ల మహిళా సంఘాలకు రావల్సిన రూ. 65 కోట్లు పావలవడ్డీ రూపాయలు కూడా అతిత్వరలో విడుదల చేయిస్తానన్నారు. ఆడబిడ్డల రుణాలని ఉంచుకోనన్నారు.

సిరిసిల్ల గత ఐదేళ్లలో బాగా అభివృధ్ధి చెందిందన్నారు. ఇంకా పది శాతం వరకు అభివృధ్ధి పనులు చేపట్టాల్సి ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పూర్తిచేయిస్తానన్నారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం రూ. 300 కోట్లతో బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇప్పించానన్నారు. పెద్దూరు సమీపంలో 100 ఎకరాల్లో అపెరల్ పార్క్ నిర్మిస్తున్నామని అందులో 10 నుండి 12వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని దానివల్ల బీడీలు చుట్టే శ్రమ తప్పుతుందని, నెలకు 10 నుండి 12 వేల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ప్రతి నేతన్న కుటుంబం భార్య, భర్తల సంపాదనతో నెలకు కనీసంగా 25నుండి30వేల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. చరిత్రలో ఎవరూ చేయని అభివృధ్ధి సంక్షేమపథకాలు సిరిసిల్లలో అమలు చేస్తున్నామని ఇక్కడి ప్రజల ఆశీర్వాదాలు, దీవెనలు కావాలన్నారు.

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదాలతోనే తాను 4వ సారి శాసనసభ్యునిగా గెలిచి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నానని, సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. జాతీయ స్థాయిలో ఆదర్శ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని నెరవేర్చే క్రమంలో ఉన్న పెన్షన్లు రెండింతలు చేశారని ఆయన అన్నారు. పేద ప్రజలకు పెన్షన్లు అందించడానికి బడ్జెట్‌లో అగ్రభాగం కేటాయించి ఏటా రూ.లు 5,000 కోట్లు ప్రజలకు ఇప్పటి వరకు అందించారన్నారు. దేశంలోనే మొదటి సారిగా బీడికార్మికులకు కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కె దక్కుతుందన్నారు.

రూ.లు 1,000 పెన్షన్ పొందే వారందరూ ఇకపై రెట్టింపు పెన్షన్ రూ.లు 2,016లు పొందుతారని అన్నారు. అంతే కాకుండా పెన్షన్లు ఇంతకాలం 65 సంవత్సరాలు నిండిన వారికి అందించేవారని ఇకపై వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించి ఈ నెల నుండి అమలు చేస్తున్నారన్నారు. బీడి కార్మికులకు పెన్షన్ ఇచ్చే కటాఫ్ తేదిని 2014 బదులుగా 2019కి పెంచినట్లు వెల్లడించారు.

ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనేది సిఎం కెసిఆర్ ధ్యేయమన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏటా రూ.లు 40 వేల కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లను రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అందిస్తూ అందుకోసం రూ.లు 12 వేల కోట్లు వ్యయం చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.లు 200 కోట్లు మాత్రమే అందిస్తూ ప్రజలకు పెన్షన్లు తామే ఇస్తున్నామని చెప్పుకోవడం గమనించి వారికి బుధ్ధి చెప్పాలన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశం అబ్బుర పడేలా వృధ్ధిరేటు 17 శాతం చేరుకుందన్నారు.

ఎదుగుదల ఆదాయాన్ని పేదవారికి పంచాలనేది సిఎం కెసిఆర్ లక్షమన్నారు.ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్‌పి చైర్మన్ న్యాలకొండ అరుణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ ఆర్గనైజర్ గుగులోతు రేణ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సామల పావని, మాజి జడ్‌పిటిసి తోట ఆగయ్య, ఏఎంసి చైర్మన్ లింగం రాణి, కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్, ఆర్‌డిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమీషనర్ డా. కెవి రమణాచారి, జడ్‌పి సిఇఓ గౌతం రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, గూడూరి ప్రవీణ్, చీటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన పద్దతులను వివరించారు.

CM KCR’s Goal is to help Poor