Home తాజా వార్తలు పోటీకి దీటుగా సాగు

పోటీకి దీటుగా సాగు

CM review with officials on new Agriculture policy

 

ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రంలో పండించాలి
ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటలుండాలి
వ్యవసాయ రూపురేఖలు పూర్తిగా మారాలి
పెద్ద సంఖ్యలో అగ్రి పరిశ్రమలు రావాలి : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయం పరిణితి సాధించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

నిరంతరం మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. రైతులు వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా విధంగా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు పూర్తిగా మారాలన్నారు. ప్రజల అవసరాలు, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో జరగాల్సిన పంటల సాగు – అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో నిపుణులతో సమావేశమయ్యారు.

మాజీ ఎంఎల్‌సి, ప్రొఫెసర్ నాగేశ్వర్, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, అగ్రి బిజినెస్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీమా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీనివాసచారి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ సలహాదారు గోపీనాథ్ కోనేటి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కేశవులు తదితరులతో చర్చించారు. పంటల సాగులో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటను యధావిధిగా మార్కెట్ కు పంపకుండా దానికి వాల్యూ ఆడ్ (అదనపు విలువలను జతచేయడం) చేయడానికి ఇప్పుడున్న పద్ధతులేంటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రపంచం నుంచి పోటీ తట్టుకుని నిలబడేలా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు రావడానికి ఏం చేయాలి? ఎరువులు- రసాయనాల వాడకంలో రావల్సిన మార్పులు ఏంటి? పంటల మిగులు ఉండకుండా ఏం చేయాలి? తదితర అంశాలపై సిఎం కూలంకశంగా చర్చించారు. ఈ సందర్భంగా నిపుణులు అనేక రకాల సూచనలు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్చలు చాలా జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు వ్యవసాయంలో తీవ్ర సంక్షోభం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేదని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కాస్త ఊరట లభించిందన్నారు. ఇప్పుడిప్పుడే రైతాంగంలో నమ్మకం ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలం పంటతో ప్రారంభమవుతున్నదని సిఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా రైతుల శ్రేయస్సు కోసమే చేస్తుందనే విశ్వాసం రైతుల్లో ఉందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీరు, పెట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వంపై రైతులకు సంపూర్ణమైన నమ్మకం కూడా ఉందని సిఎం వ్యాఖ్యానించారు.

తెలంగాణ జీవికలో వ్యవసాయమే ప్రధానం
రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన రైతాంగంతో పాటు ఏ పంటైనా పండించే నేలలున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్, అగ్రి ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన వ్యవసాయాభివృద్ధికి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంభిచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికిప్పుడు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రైతులకు కావాల్సినవి సమకూర్చుతున్నామని స్పష్టం చేశారు. దీనివల్ల పంటలు బాగా పండుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

పండిన పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అయితే ఇది సరిపోదని, ఇంకా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెల్లాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ఎక్కువ అనుకూతలున్నాయన్నారు. ఎక్కువ మంది జనం ఈ రంగంమీదనే ఆధార పడ్డారన్నారు. తెలంగాణ జీవికలో వ్యవసాయమే ప్రధానం కాబట్టి ఎక్కువ దృష్టి వ్యవసాయం మీదనే పెట్టాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉంది అని సిఎం కెసిఆర్ అన్నారు.

వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రావాలి
రైతులు పండించిన పంటను యధావిధిగా ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్నామని, కానీ ఆ పంటకు వాల్యూ యాడ్ చేయడం వల్ల ఎక్కువ ధర వస్తుందని సిఎం కెసిఆర్ అన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కావాల్సిన ముడి సరుకును నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలన్నారు. నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్ కు ఓ ఇమేజ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. అది అంతర్జాతీయంగా మార్కెటింగుకు ఉపయోగపడుతుందన్నారు. జనాభాలో ఎక్కువ శాతం వ్యవసాయంలోనే ఉండడం ప్రగతికి సంకేతం కాదని కాబట్టి పారిశ్రామికీకరణ జరగాల్సిన అవసరముందన్నారు.

తెలంగాణ వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు ఎంతో అనుకూలం… కాబట్టి రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలన్నారు. దీనివల్ల అటు పారిశ్రామిక రంగం, ఇటు సేవా రంగాలు కూడా విస్తరిస్తాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది పరిస్థితులు మారుతుంటాయని, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటలు మార్చుకుని వేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాబట్టి రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం రైతులకు అలవాటు కావాలన్నారు. పంటల మార్పిడి విధానం అవలంభించడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల భూసారం పెరుగుతుందని, పీడచీడలు తక్కువుగా ఉంటాయన్నారు. ఇవన్నీ రైతులకు విడమరిచి చెప్పాలని కోరారు.

ఎరువుల వాడకంలో మార్పు రావాలి
ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారన్నారు. తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు స్పష్టంగా తెలపాలన్నారు. ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదనే విషయం కూడా వారికి అర్థమయ్యేట్లు వివరించాలని సూచించారు. క్రాప్ కాలనీలు ఉన్నచోటనే ఆ పంటకు సంబంధిచిన అగ్రో ఇండస్ట్రీ/ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

CM review with officials on new Agriculture policy