Home తాజా వార్తలు డి బ్లాక్ వెనుక కొత్త సచివాలయం

డి బ్లాక్ వెనుక కొత్త సచివాలయం

BHumi-Puja

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర నూతన సచివాలయ భూమి పూజకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సచివాలయంలోని డి బ్లాక్ వెనుకవైపు ఉన్న ఉ ద్యానవనంలో పూజకు ఏర్పాట్లు చేస్తున్నా రు. వాస్తు ప్రకారం సచివాలయంలోని ఈ శాన్యదిశలో భూమి పూజ ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ వాస్తు పండితుడితో పాటు ఇతర పండితులు భూమి పూజ చేసే స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలిసింది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు భద్రతకు సంబంధించిన పర్యవేక్షణ జరిపినట్టుగా తెలిసింది. భూమి పూజ పూర్తి కాగానే కార్యాలయాలను తరలించాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతమున్న సచివాలయంలోని వివిధ కార్యాలయాలను ఎక్కడికి తరలించాలన్న దానిపై జిఏడి కసరత్తు చేస్తోంది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
భూమి పూజ తరువాతే కార్యాలయాల తరలింపు
6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రస్తుత స్థలం చుట్టూ ఉన్న మరికొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. కొత్త సచివాలయం నలువైపులా రోడ్డు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైటెక్ హంగులతో దీనిని నిర్మిస్తున్నారు. సి బ్లాక్ వెనుక భాగంలోని కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ మింట్ కాంపౌండ్‌లోని గవర్నమెంట్ ప్రింటింగ్‌ప్రెస్ మినహా, మిగిలిన భాగంలోని భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. అటు ఎన్టీఆర్ గార్డెన్‌ను ఆనుకొని ఉన్న దారిలోని తెలంగాణ గేట్ పక్కనున్న విద్యుత్ బిల్డింగులు, ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయాలు, ఇతర భవనాలను సైతం కొత్త సచివాలయం ప్రాంగణంలో కలపనున్నారు. తద్వారా స్థలం మొత్తాన్ని చతురస్రాకారంలోకి మార్చి, వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యాలయం తరలింపు మొత్తం భూమి పూజ తరువాతే చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈనెల 27న ఇటు సచివాలయం, అటు ఎర్రమంజిల్‌లోని శాసనసభ భవనానికి భూమి పూజ చేయాలని సిఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడించేలా కొత్త సచివాలయం
సచివాలయ నిర్మాణాలన్నీ కాలం చెల్లిపోయి భద్రత లేకుండా ఉండడంతో దీనిని కూల్చివేసి నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. దేశ, విదేశీ అతిథులకు కనీస సౌకర్యాలు లేకుండా ప్రస్తుత సచివాలయం ఉందని ఇప్పటికే అధికారులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడించేలా కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కెసిఆర్ నిర్ణయించారు. తెలంగాణకే తలమానికంగా ఈ నిర్మాణాలు ఉండాలని కెసిఆర్ అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. కలెక్టర్ల సమావేశంతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి నిర్వహించే ఈ సదస్సులు కొత్త సచివాలయంలో నిర్వహించేలా నిర్మాణాలు జరగనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలపై త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలతో చర్చించాలని కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది. నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లకు సంబంధించి వారితో చర్చించనున్నట్టుగా సమాచారం.
అంతర్జాతీయ ప్రమాణాలతో సమావేశ మందిరాలు, సౌకర్యాలు
అంతర్జాతీయ ప్రమాణాలతో సమావేశ మందిరాలు, సౌకర్యాలను కొత్త సచివాలయంలో ఏర్పాటు చేయనున్నారు. భవనంలో ఎన్ని అంతస్థులు ఉండాలి, ఏయే సౌకర్యాలు ఉండాలన్న దానిపై త్వరలో సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. సిఎంఓ, సిఎస్, పేషీ, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి మార్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. మంత్రులు, వాళ్ల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సంబంధిత సెక్షన్లు, ఇతర విభాగాల కోసం ప్రస్తుతం జిఏడి భవనాలను అన్వేషిస్తున్నట్టుగా తెలిసింది. అయితే వీటిని సంబంధిత మంత్రిత్వ శాఖల హెచ్‌ఓడిలోకి తరలించాలని అధికారుల సమాలోచనలు జరుపుతున్నట్టుగా సమాచారం. అధికారులతోపాటు ఆయా శాఖల మంత్రు లు ఒకేచోట ఉండేలా అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. దీనివలన పరిపాలనలో జాప్యం నెలకొనదని ప్రభుత్వం భావిస్తోంది.
అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం
సచివాలయ భవనం, శాసనసభ భవన నిర్మాణాలపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని కెసిఆర్ ఏర్పాటు చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్‌లను సభ్యులుగా నియమించారు. సచివాలయ భవనాల కూల్చివేత, శాఖల తరలింపు, కొత్త భవన నిర్మాణం దాని నమూనా అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీకి ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ సహకారం అందించనున్నారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి అనంతరం సిఎం కెసిఆర్‌కు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

CM to perform Bhumi puja for new Secretariat building