Friday, March 29, 2024

టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు

- Advertisement -
- Advertisement -

COAI

నిబంధనలను తగ్గించండి
ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం రంగాన్ని కాపాడాలని, దీనికి గాను ఎజిఆర్ బకాయిలను తీర్చడానికి ప్రభుత్వం తక్కువ రేటుకే రుణాలు అందించడం అత్యవసరమని సిఒఎఐ తెలిపింది. టెలికాం రంగంలో సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో బ్యాంకుల అసహాయతపై సిఒఎఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగానికి అండగా నిలవనున్నట్టు బ్యాంకులకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిఒఎఐ కోరింది.

అంతేకాకుండా కష్టాల్లో ఉన్న రంగాన్ని రక్షించేందుకు కనీస ధరల అమలు కూడా వేగవంతం చేయాలని కోరింది. టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్ల బకాయిల చెల్లింపుల సమస్యను టెలికాం శాఖ పరిశీలిస్తోందని బుధవారంనాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. టెలికాం కంపెనీలు దాదాపు రూ.1.47 లక్షల కోట్ల ఎజిఆర్ బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీనిలో రూ.92,642 కోట్లు లైసెన్స్ ఫీజుగా చెల్లించలేదని, రూ .55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ రుసుముగా ఉన్నాయని డాట్(టెలికాం శాఖ) తెలిపింది. మొత్తం బకాయిల్లో 60 శాతం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు సంబంధించినవే ఉన్నాయి.

టెలికాం పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ రంగం నష్టాలను తీసుకోవడానికి బ్యాంకులు సుముఖంగా లేవని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రభుత్వం టెలికాం రంగానికి అండగా నిలుస్తుందని బ్యాంకులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలి’ అని సిఒఎఐ తెలిపింది. ఈమేరకు సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘టెలికాం రంగంతో రిస్క్ తీసుకోవడానికి బ్యాంకులు ఇంకా సిద్ధంగా లేవు’ అని ఆయన అన్నారు. టెలికాం కంపెనీలకు కొత్త బ్యాంక్ హామీలు ఇవ్వడానికి లేదా బ్యాంక్ గ్యారెంటీలను పునరుద్ధరించడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.

ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారెంటీ అవసరమని టెలికమ్యూనికేషన్ విభాగం భావిస్తే, దానిని లైసెన్స్ ఫీజులో 25 శాతానికి తగ్గించాలని సిఒఎఐ తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ ఫీజును వెంటనే ఎనిమిది నుంచి మూడు శాతానికి తగ్గించాలి. అలాగే స్పెక్ట్రం వినియోగ ఛార్జీలను కూడా తగ్గించాలని సంస్థ కోరింది. చైనా, బ్రెజిల్, రష్యా వంటి మార్కెట్ల కంటే భారతదేశంలో వినియోగదారునికి సగటు ఆదాయం (ఆర్పు) చాలా తక్కువగా ఉందని మాథ్యూస్ అన్నారు.

ఈ పరిస్థితిలో కనీస ధరను అమలు చేయడం అవసరమన్నారు. సిఒఎఐ ఈ లేఖను ఫిబ్రవరి 26న పంపింది. అదే సమయంలో వోడాఫోన్ ఐడియా కూడా ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది. ఎటువంటి ప్రోత్సాహక ప్యాకేజీని పొందకపోతే మొత్తం ఎజిఆర్ బకాయిలను చెల్లించలేమని చెప్పింది. కాగా టెలికాం కంపెనీల ఎజిఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి పారిశ్రామికవేత్తలు సునీల్ భారతి మిట్టల్, కుమార్ మంగళం బిర్లా ఇప్పటికే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

COAI is seeking government on AGR dues

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News