Home ఎడిటోరియల్ బొగ్గు గనుల్లో ఎఫ్‌డిఐలను వ్యతిరేకిద్దాం

బొగ్గు గనుల్లో ఎఫ్‌డిఐలను వ్యతిరేకిద్దాం

Singareni Workers

 

భారతదేశపు బొగ్గు గనుల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 28, 2019న నిర్ణయం తీసుకుంది. ఈ ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా 2019 సెప్టెంబర్ 24న బిఎంఎస్ తప్ప నాలుగు జాతీయ కార్మిక సంఘాలైన ఎఐటియుసి ఐఎన్‌టియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్‌లు ఐక్యంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎఫ్‌డిఐల వల్ల బొగ్గు గని కార్మికులు నేటి వరకు సాధించుకున్న హక్కులన్నింటినీ కోల్పోతారు. బొగ్గు గనులు పబ్లిక్ రంగం నుండి ప్రైవేట్ రంగంలోకి మారిపోతాయి. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. నూతన ఉద్యోగాలు రావు. యాంత్రీకరణ పెరిగిపోతుంది. నూతన బొగ్గు గనుల విషయంలో అటవీ హక్కుల చట్టాల్లాంటివి రాజ్యాంగ చట్టాలు కూడా అమలుకాకుండా పోయి ముఖ్యంగా ఓఎన్‌కాస్టులు ఏర్పాటుచేసే క్రమంలో ఆదివాసీల నిర్వాసిత్వ హక్కు గాని, జీవించే హక్కు అమలుకాకుండా పోతాయి.

మొత్తంగా మరొకసారి వలస పాలనకు దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నెడుతున్న పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. స్వతంత్ర దేశంలో విదేశీయుల పాలనగా మారి అన్ని పరిశ్రమలు, బొగ్గు గనులు, పూర్తిగా ప్రైవేటీకరించబడతాయి. బావుల్లో యాంత్రీకరణగా ఎక్కువ చేస్తూ, కేవలం కాంట్రాక్టు కార్మికులతో ఉత్పత్తిని కొనసాగిస్తారు. భూగర్భ గనుల స్థానంలో భూ ఉపరితల గనులను (ఓపెన్‌కాస్ట్) లు ఏర్పాటు చేసి కార్మికుల హక్కులను అణచివేస్తారు. కార్మిక సంఘాలపై తీవ్ర నిర్బంధం అమలై చివరికి ప్రశ్నించే వారే లేకుండా పోతారు. ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనుల్లో 100% ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పౌరహక్కుల సంఘం వ్యతిరేకిస్తున్నది. ఈ నిర్ణయం అప్రజాస్వామ్య వ్యతిరేక, కార్మిక పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేసే నిర్ణయంగా భావిస్తూ దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

బొగ్గు గనులు దేశంలో 1774లో బ్రిటీష్‌వారి ఈస్ట్ ఇండియా వారి ఆధ్వర్యంలో (పశ్చిమబెంగాల్‌లో దామోదర్ నదికి ) పడమట వైపు రాణిగంజ్ వద్ద బొగ్గు గనుల తవ్వకం మొదలై అస్సాం, బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు విస్తరించాయి. బొగ్గు గనుల్లో ప్రకృతి విరుద్ధంగా గాలి, నీరు, ఊపిరాడని ప్రదేశంలో కి.మీ.ల వరకు భూగర్భ గనుల్లో పనిచేసిన కార్మి కులు అప్పటి కాంట్రాక్టర్ల క్రింద గనుల్లో పనిచేసి వందలు, వేకు పైగా గనుల్లో చనిపోయారు. అలా కూడా లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి దేశానికి వెలుగు ప్రసాదిస్తే వారి జీవితాలేమో బుగ్గి అవుతున్న నేపథ్యంలో చేసిన పోరాటాల వలన 1971లో కోకింగ్ గనులు, మే, 1, 1973న మిగతా అన్ని బొగ్గు గనులను పూర్తిగా, ప్రైవేటు మాఫియా కబంధ హస్తాల నుండి జాతీయ చేయడం జరిగింది. జాతీయం కాబడినప్పటి నుంచి కార్మికుల జీవితాలు కొద్దిగా మెరుగైన స్థితి ఏర్పడింది.

1948 నుంచి 2003 వరకు కార్మిక పోరాటాలు పెద్ద ఎత్తున కొనసాగించి అనేక హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులు ఒకవైపు ఉంటే సింగరేణి కార్మికుల చైతన్యం మరొక విధంగా ఉండేవి. దానికి 1978లో వచ్చిన జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటాల ప్రభావమే కారణం. ఉద్యమ చైతన్యంతో కార్మిక సంఘాలు బలపడి కార్మిక చైతన్యంతో సింగరేణి అంతటా అనేక రాజకీయ ఉద్యమాలతో హక్కులు సాధించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రభుత్వంతో పోరాడి 5 ఏళ్ల కొకసారి నూతన వేజ్ బోర్డు అమలుకోసం హక్కులను సాధించుకున్నారు. 1.1.1975లో ప్రారంభమయిన మొదటి వేజ్ బోర్డు నుండి 1.7.2016 నుండి పదవ వేజ్ మొదలయింది. 4వ వేజ్ బోర్డు నుంచి నూతన వేతనాల కోసం సమ్మెకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగరేణి కార్మికులు 4, 5, 6, వేజ్ బోర్డుల అమలు కోసం సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితికి వారి చైతన్యం పెరిగింది.

బోర్డు సవరణల కోసం 4వ వేజ్ బోర్డు కోసం లాగే 5వ వేజ్ బోర్డు కోసం కూడా విప్లవ కార్మిక విప్లవ సంఘాల నాయకత్వంలో సింగరేణి కార్మికులే పోరాటాలు సాగించారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా కూడా జాతీయ కార్మికవర్గాలతో పాటు విప్లవ కార్మిక సంఘాలు కూడా కలిసి ఐక్యంగా నిరవధికంగా పోరాటం చేయలిగితేనే బొగ్గు గనులను ప్రైవటుపరం కాకుండా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాకుండా కాపాడుకోగలం. ఆవైపు దేశంలో ఉన్న బొగ్గుగని కార్మికవర్గం అంతా కూడా పోరాటంలో నిలబడాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడి ఉంది. మొన్నటి వరకు పట్టించుకోని జాతీయ కార్మిక సంఘాలు కొన్ని సమ్మె విఫలం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని కార్మికులు భావిస్తున్నారు. కావున బొగ్గు బావుల్ని రక్షించుకోవడం కోసం అధికార పార్టీ మినహా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

Coal workers to go on strike on Sept 24 over FDI in mining