Home కలం నామాపురం ఆదర్శ పాఠశాల తీరొక్క పూల కవిత్వ పరిమళం

నామాపురం ఆదర్శ పాఠశాల తీరొక్క పూల కవిత్వ పరిమళం

Coastal Flowers

 

బడి పిల్లలు రాస్తున్న కథలు, కవితల పుస్తకాలు ఈ మధ్య విస్తృతంగా వస్తున్నాయి. శుభ పరిణామం. వీరి వెనుక ఉన్న బాల సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు, వారికి ఆర్థికంగా సహకరిస్తున్న దాతలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఒకప్పుడు దశాబ్దాల క్రితం పాఠశాలల్లో వార్షిక సంచికలు, మంజువాణి, తరంగిణి లాంటివి తెచ్చామని రిటైర్డ్ ఉపాధ్యాయులు తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఈ సంకలనాలు వేగంగా వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో 150కి పైగా సంకలనాలు రాగా, తెలంగాణలోనే సుమారు 100 వరకు వచ్చాయని బాల సాహితీ వేత్తలు అంచనా వేస్తున్నారు. బాలలు తమదైన శైలిలో తమ భాషలో చక్కగా రాస్తున్నారు. చిన్న చిన్న దోషాలు ఉంటే ఉండవచ్చు. సృజనాత్మకంగా పిల్లలు రాయడం హర్షించదగింది. పెద్దలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పిల్లలు రాసేది, పెద్దలు పిల్లల కోసం రాసేది, బాలల సమగ్ర వికాసానికి ఉపయోగపడేది బాల సాహిత్యమనవచ్చు. దాశరథి ఆపాత మధురంగా, భాష సరళంగాను, పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉండేది బాల సాహిత్యం అన్నారు. బాల సాహిత్యమే పెద్దల సోపానం. అనాదిగా బాలలను, బాల సాహిత్యాన్ని పట్టించుకోని ఏ దేశం, ఎవరు మనుగడ సాగించరు. కవిత్వం ఒక సృజనాత్మక సాహిత్య ప్రక్రియ. నిరంతర సాధన ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో పిల్లలు రాసినది బాగుంది. భవిష్యత్తులో ఇంకా బాగా రాస్తారని నమ్ముతున్నాను.

నాకు 2016 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం “బాల సాహిత్య పరిశోధన” పై పి.హెచ్.డి పట్టా అందించింది. “తీరొక్క పూలు” లోకి వెళ్లినట్లయితే, కవరు పేజీ వివిధ బాలలను పోల్చినట్లుగా, తీరొక్క పూలతో రంగుల బొమ్మ వేశారు. జనగామ శ్రీనివాస్, చింతోజు ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల నామాపూర్ ప్రచురితం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ప్రధాన సంపాదకులుగా రావిరాల బసవయ్య తెలుగు పి.జి.టి వ్యవహరించారు. ఇందులో 50 కవితలు, పాటలు, పేరడీలున్నాయి. 9వ, 10వ తరగతి పిల్లలు సృజన చేశారు. ఈ పుస్తకం డా॥ చింతోజు రాజారాం, డా॥ చింతోజు శంకర్, చింతోజు నారాయణలకు అంకితం చేయబడింది. 15 మంది ముందు మాట రాశారు.

ఎం. ఇందువాహిని “గురువు” కవితతో ప్రారంభమయింది. గురువు గొప్పతనం చెప్పింది.
“బాధ్యత చెప్పడంలో నీవు
అమ్మకు సాటి
ఓపిక పెంచటంలో నీవు
నాన్నకు సాటి”
బి. చందు ‘ఎందుకు’!లో కవిత ప్రశ్న రూపంలో సాగుతుంది. దీంట్లో జవాబు కూడా సూచించాడు. దేశభక్తిని తెలిపాడు.

“పరీక్షలు ఎందుకు?
విజ్ఞానం పెంచేటందుకు
గురువులు ఎందుకు?
జ్ఞానం అందించేటందుకు
అమ్మ నాన్నలు ఎందుకు
జీవితాన్ని ఇచ్చేటందుకు.. అంటూనే నీవు ఎందుకు
దేశాన్ని గెలిపించేటందుకు” అంటాడు.

బి. అశ్విని ‘రైతన్న’ కవితలో పాటలను పండిస్తాడని, అహర్నిశలు కష్టపడి పని చేస్తాడని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతన్న బతికుంటేనే మాకు బతుకని తెలిపింది.
“ఓ రైతన్న నువ్వు పని చేస్తావు
పగలనక, రాత్రనక, వాన అనక, ఎండనక
కాని ఏదన్న నీ పంటలకు సాయం
పంట పండించి తీరుస్తావు… .. అంటూనే నువ్వు బ్రతికుంటేనే మాకు బ్రతుకు రైతన్న
జర మమ్ములను బ్రతికించు ఓ రైతన్న… అంటాడు.

ఇ. శ్రీజ “ఓ లచ్చ గుమ్మడి” పాట రాసింది. ఇది స్వచ్ఛ భారత్ మీద పరిశుభ్రంగా ఉండాలని గద్దర్ రాసిన “ఓ లచ్చ గుమ్మడి” పాటకు పేరడీ రూపంలో రాసింది.
“స్వచ్ఛమైన కార్యక్రమం ఓ లచ్చ గుమ్మాడీ
అదేమన స్వచ్ఛ భారత్ ఓ లచ్చ గుమ్మాడీ
చెత్త కుండీలు వాడుదాం ఓ లచ్చ గుమ్మాడీ
మరుగుదొడ్లు నిర్మిద్దాం ఓ లచ్చ గుమ్మాడీ… అంటూ సాగుతుంది.
ఎ. అఖిల “పండుగ” కవితలో సంతోషం ఇస్తుందని, తీయనైనదని, మనస్సులు చల్లనైనవని అంత్యాను ప్రాసలో చక్కగా రాసింది.

“మన ఊర్లో పండుగ, మన ఇంట్లో నవ్యగా
మన నోర్లో తియ్యగా, మన మనస్సులు చల్లగా
మన కళ్లు మెరువగా, మన పిల్లలు ఎదుగగా
మనం చూస్తూ ఉండగా వచ్చేస్తుంది పండుగా”

ఈ పుస్తకంలో 50 కవితలైనప్పటికీ 9వ, 10వ తరగతి పిల్లలు రాసినప్పటికీ, కొందరు 4 నుండి 10వ తరగతి వరకు రాసిన కవితలున్నాయి. 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహించి రాయిస్తే బాగుండేది. కొన్ని కవితలుగా ఉంటే మరి కొన్ని పాటలుగా పాడుకోవచ్చు. పేరడీ కూడా ఉంది. పిల్లలు తమకు వచ్చిన ఆలోచనలు కవిత్వంలో రాసినప్పటికీ, సూచనలిచ్చి మార్పులు చేయిస్తే ఇంకా బాగుండేది. కవితల్లో భావానుక్రమం వస్తే బాగుండేది. కొందరు పిల్లలు ఇతర బాల సాహితీ వేత్తల, కవుల రచనలు చదివినట్టుగా, లేదా విన్నట్టుగా కవితలను చదివితే తెలుస్తుంది. ఒకటి రెండు కవితలు చిన్న మార్పులతోనే ఇందులో రాసినట్టుగా ఉన్నప్పటికీ పిల్లలు తమదైన శైలిలో సృజనాత్మకంగా వ్రాసిన విధానం బాగుంది.

సాధారణంగా బడి పిల్లల సంకలనాలలో పిల్లలు రాసే కవితలు, కథలు అనుకరించకుండా, అనువాదం కాకుండా, సొంతంగా సృజనాత్మకంగా రాసే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిది. ఏది ఏమైనా తీరొక్క పూలలో, పిల్లలు తీరొక్క విషయాలను చక్కగా చెప్పారు. వారి సృజనాత్మకతకు, తెలివి తేటలకు, ప్రోత్సహించిన గురువులకు అభినందనలు తెల్పుతున్నాను. పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

బాల సాహిత్యంలో ప్రధానంగా బాలలే రాయాలన్న వాదన వినిపిస్తుంది. బాలలకు ఏమి కావాల్నో వాళ్లే రాసుకుంటారని అంటున్నారు. కాని నేను మాత్రం బాలలు రాయాలి, పెద్దలు రాయాలి బాల సాహిత్యం. బాలలు రాసినది సరి చేయాల్సిన బాధ్యత పెద్దలది. పెద్దలు కూడా బాల భాషలో, బాలల సంపూర్ణ మానసిక వికాసం కోసం రాయాలి. పెద్దలకు రాసినట్టు రాసి, చాలా మంది బాల సాహితీ వేత్తలుగా చెప్పుకోవడం బాధాకరం. ఏది ఏమైనా బాల సాహిత్యంలో పిల్లల కథ, కవితా సంకలనాలు సంచలనాలు. బాల సాహిత్యం వర్ధిల్లాలి.

Coastal Flowers is a poetic collection of school children