Home తాజా వార్తలు ‘బీటెక్’ మిత్రుల ‘హైటెక్’ వ్యాపారం..!

‘బీటెక్’ మిత్రుల ‘హైటెక్’ వ్యాపారం..!

Coconut Water

 

పెద్దపల్లి: వారు బీటెక్ మిత్రులు.. అందరిలా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేయడం కన్నా, సొంతంగా వ్యాపారంలో రాణించాలనుకున్నారు.. కొత్తగా ఆలోచించి కొబ్బరినీళ్ల బాటిలింగ్ యూనిట్‌ను ప్రారంభించి హైటెక్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు… రాష్ట్రంలోనే ఎక్కడాలేని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ప్రత్యేకతను చాటుకున్నారు పెద్దపల్లికి చెందిన బీటెక్ మిత్రులు..!! పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాల్త ప్రశాంత్‌తోపాటు పట్టణానికి చెందిన చల్లకుమార్, అయిల్నేని హరీష్‌రావులు బీటెక్ మిత్రులు. చదువు పూర్తికావడంతో వ్యాపార అన్వేషణలో భాగంగా కేరళరాష్ట్రంలోని కొబ్బరిబోండాల పరిశ్రమ నడుపుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అదే పరిశ్రమను ఇక్కడ స్థాపించాలని నిర్ణయించుకొని ముగ్గురు స్నేహితులు కలిపి కొబ్బరినీళ్ల బాటిలింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.

కోనసీమ ప్రాంతం నుండి లారీల ద్వారా కొబ్బరి బోండాలను తెప్పించి వాటిని కట్ చేసి కొబ్బరి నీళ్లను ఫిల్టరింగ్ తర్వాత బాటిళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. బాటిలింగ్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే లభించే కొబ్బరిబోండాలను కొందరు వ్యాపారులు దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే బోండాల ఎగుమతి అధిక భారం కావడంతో కొబ్బరినీళ్లను బాటిళ్లలో నింపి పంపించడం ద్వారా వ్యాపారం లాభసాటిగా ఉంటుందని భావించిన ఈ ముగ్గురు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్‌ను ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా, మొదట్లో కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పట్లో పెద్దనోట్ల రద్దు మూలంగా ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో వ్యాపారంలో యువకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వీరి వ్యాపారం లాభసాటిగా మారడంతో తెలంగాణ ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ లాభాలను అర్జిస్తున్నారు.

వెల్‌కం డ్రింక్‌గా కొబ్బరిబోండాల నీళ్లు…

ప్రముఖుల ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో వెల్‌కం డ్రింక్‌గా కూల్‌డ్రింక్స్‌లను బంధువులకు అందించడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం శుభకార్యాల్లో కూల్‌డ్రింక్‌లకు బదులుగా కొబ్బరినీళ్ల బాటిళ్లను అందిస్తున్నారంటే ఈ యువకులు చేసిన ప్రయత్నమే. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే పలువురు ప్రముఖుల ఇండ్లలో పెళ్లిళ్ల సమయంలో కొబ్బరినీళ్ల బాటిల్స్ సరఫరా చేయడానికి ఆర్డర్లు తీసుకుంటున్నారు. అయితే యూనిట్ నిర్వహణకు సరిపడా పెట్టుబడి లేకపోవడంతో వ్యాపారం విస్తరించలేక పోతున్నారు. ప్రభుత్వం అండగా నిలిచి బ్యాంకు ద్వారా రుణం అందిస్తే మరికొందరికి తమ యూనిట్ ద్వారా ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యానువల్ ఫిల్టర్ ద్వారానే కొబ్బరి నీళ్ల బాటిలింగ్ యూనిట్ నిర్వహిస్తున్నట్లు యువకులు తెలిపారు.

90 రోజులపాటు సురక్షితం…

కొబ్బరిబోండాల నుండి కొబ్బరినీళ్లను సేకరించి ఎనిమిది సార్లు ఫిల్టర్ చేసిన అనంతరం నూతన బాటిల్స్‌లలో కొబ్బరినీళ్లను నింపి నిలువ ఉంచుతామని యూనిట్ నిర్వాహకులు తెలిపారు. బాటిలింగ్ ప్యాకింగ్ తర్వాత 90 రోజులపాటు కొబ్బరినీళ్లు సురక్షితంగా ఉంటాయని, కొబ్బరినీళ్ల బాటిళ్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తాగితే రుచితోపాటు కొబ్బరినీళ్ల పోషకాలు అందుతాయని యువకులు పేర్కొన్నారు.

కొత్త యూనిట్ కావడంతో ప్రభుత్వ రుణం దొరకలేదు : బాల్త ప్రశాంత్ (యూనిట్ వ్యవస్థాపకుడు)

కొబ్బరినీళ్ల బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు అందరూ అభినందించారు. కానీ బ్యాంకు రుణం కోసం ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు తప్పలేదు. బ్యాంకు రుణాల జాబితాలో కొబ్బరినీళ్ల యూనిట్ లేకపోవడంతో బ్యాంకు అధికారులు తామేమి చయలేమని చేతులెత్తేశారు. కొబ్బరినీళ్ల బాటిలింగ్ యూనిట్‌కు ప్రభుత్వ రుణసదుపాయం కల్పించినట్లయితే వ్యాపారస్తులతోపాటు మరికొందరికి ఉపాధి లభిస్తుంది.

యూనిట్ నిర్వహణకు రూ.20 లక్షలు కావాలి: చల్ల కుమార్

ప్రభుత్వం ఉన్నత చదువులు చదివిన వారికి ప్రత్యేక బ్యాంకు రుణాలు అందించాలి. తమ వ్యాపారం కొత్తది కావడంతో ఎవరికి అర్థం కాలేదు. తమ ప్రయత్నాలను ప్రభుత్వం గుర్తించి రూ.20లక్షలను బ్యాంకు రుణంగా అందించి యూనిట్ నిర్వహణకు సహకరించాలి. ప్రభుత్వ సహకారంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు స్వచ్ఛమైన కొబ్బరినీళ్ల బాటిళ్లను ఎగుమతి చేసేందుకు పరిశ్రమను విస్తరిస్తాం.

కొబ్బరినీళ్లలోనే పోషకాలుంటాయ్ : అయిల్నేని హరీష్‌రావు

మార్కెట్‌లో లభించే శీతల పానియాలు(కూల్‌డ్రింక్స్) ఆరోగ్యానికి ప్రమాదకరమని అందరూ అంటారు నిజమే. తమలాంటి విద్యావంతులు చేస్తున్న ప్రయత్నాలకు అండగా ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తే ఇంకా మంచి ఫలితాలు సాధిస్తాం. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా శుద్ధి చేసిన కొబ్బరినీళ్ల బాటిలింగ్ యూనిట్‌ను ప్రారంభించాం.

Coconut Water Bottling Business