Home తాజా వార్తలు కాఫీ డే సిఎండి విజి సిద్ధార్థ ఆత్మహత్య?

కాఫీ డే సిఎండి విజి సిద్ధార్థ ఆత్మహత్య?

Coffee Day CMD VG Siddhartha

 

నేత్రావతి నది బ్రిడ్జి వద్ద సిద్ధార్థ ఆ తర్వాత అదృశ్యం
గాలిస్తున్న పోలీసులు
20 శాతం పతనమై సిసిడి షేరు

న్యూఢిల్లీ : కేఫ్ కాఫీ డే(సిసిడి) ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కర్నాటక మాజీ సిఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు విజి సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు. ఆయన అదృశ్యం కావడంతో స్థానిక అధికారుల సహాయం కోరామని ఈమేరకు కంపెనీ ప్రకటించింది. 23 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేఫ్‌ను ప్రారంభించారు. సిద్ధార్థ ఆకస్మిక అదృశ్యంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. సోమవారం వ్యాపారానికి సంబంధించి సిద్ధార్థ ఇన్నోవా కారులో చిక్‌మగళూరుకు వెళ్లారు. మంగళూరు సమీపంలోని జాతీయ రహదారిపై కారును ఆపి దిగారు. నేత్రావతి నది వద్దగల బ్రిడ్జి నుంచి కారు దిగిన సిద్ధార్థ ఆ తర్వాత అదృశ్యమైనట్లు తెలుస్తోంది. పోలీసులు, తదితర బృందాలు సిద్ధార్థ కోసం గాలిస్తున్నాయి. కాగా సిద్ధార్థ అదృశ్యం నేపథ్యంలో కాఫీడే షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలకు దిగడంతో ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరువుకావడంతో ప్రస్తుతం ఈ షేరు రూ.38 నష్టపోయి రూ.153 వద్ద ముగిసింది. కేఫ్ కాఫీడే బ్రాండుతో దేశవ్యాప్తంగా రిటైల్ కాఫీ స్టోర్లను కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తోంది. ఇటీవల ఐటి కంపెనీ మైండ్‌ట్రీలో ఉన్న 20 శాతంపైగా వాటాలనును ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టికి సిద్ధార్థ విక్రయించారు. అయితే

23 ఏళ్ల క్రితం కాఫీడే ప్రారంభం
దేశంలో అతిపెద్ద కాఫీ చైన్ సిసిడి(కేఫ్ కాఫీడే) 1996లో ప్రారంభించారు. 23 సంవత్సరాల క్రితం బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్ నుండి సిసిడి పునాది వేశారు. ప్రారంభంలో కాఫీ షాప్ ఇంటర్నెట్ కేఫ్‌తో ప్రారంభించారు. ఆ రోజుల్లో యువత ఇంటర్నెట్‌తో కాఫీని బాగా ఆస్వాదించారు. నగరంలోని యువత సిసిడి కేఫ్‌ను ఆస్వాదించారు. యువతకు అక్కడ ఒక హ్యాంగౌవుట్ స్పాట్ ఉంది. అక్కడ వారు స్నేహితులతో కాఫీ సిప్‌తో మాట్లాడి ఆనందించేవారు. అది క్రమంగా నమ్మకమైన సంస్థగా మారింది. సిసిడి తన అసలు వ్యాపారం కాఫీతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళింది.

దేశంలో అతిపెద్ద కాఫీ చైన్
మొదట కొన్ని సంవత్సరాల పాటు సిసిడి కొన్ని ఎంచుకున్న ప్రాంతాల్లో కాఫీ కేఫ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు అదే దేశంలో అతిపెద్ద కాఫీ గొలుసుగా మారింది. నేడు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సిసిడి కేఫ్‌లు ఉన్నాయి. దేశంలోని 247 నగరాల్లో 1,758 కేఫ్‌లు సిసిడికి ఉన్నాయి. సిసిడి వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ కుటుంబానికి కాఫీ తోటలు ఉన్నాయి. వారి తోటలలో ఖరీదైన కాఫీ పండించేవారు. అక్కడి నుండే ఆయనకు సిసిడి ఆలోచన వచ్చింది.

తండ్రి ఇచ్చిన 5 లక్షలతో..
కాఫీపై లోతైన అవగాహన ఉన్నందున సిద్ధార్థ సిసిడిని ప్రారంభించారు. సిద్ధార్థ్ తండ్రి మొదట్లో వ్యాపారం కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చారు. కుమారుడు సిద్ధార్థ విజయం సాధించలేకపోతే, ఆయన తన కుటుంబ వ్యాపారానికి తిరిగి రావలసి ఉంటుందని తండ్రి చెప్పారు. అయితే సిద్ధార్థ అభిరుచి, వ్యాపారంపై మంచి అవగాహన ఉండడంతో సిసిడి ఈ రోజు రూ.4000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన సంస్థగా మారింది.

130 ఏళ్లుగా కాఫీ తోటలతో అనుబంధం
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ కుటుంబానికి దాదాపు 130 సంవత్సరాలుగా కాఫీ తోటలతో అనుబంధం ఉంది. ఆయన కుటుంబానికి చిక్‌మగళూరులో 10,000 ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. 1993 నుండి సిద్ధార్థ్ కుటుంబ వ్యాపారంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన సంస్థ కాఫీని ఎగుమతి చేయడం ప్రారంభించింది. రెండేళ్లలోనే ఆయన కంపెనీ దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా అవతరించింది.

2015లో ఐపిఒ
2015 సంవత్సరంలో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ తన ఐపిఒను ప్రవేశపెట్టింది. ఐపిఒ నుండి సంస్థ తన పెట్టుబడులను సమీకరించింది. అప్పట్లో కంపెనీ మొత్తం విలువ సుమారు రూ .5,400 కోట్లుగా ఉంది.

1750 అవుట్‌లెట్లు
ప్రస్తుతం కంపెనీకి 1,750 కేఫ్‌లు ఉన్నాయి. భారత్‌తో పాటు, ఆస్ట్రియా, కరాచీ, దుబాయ్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో కూడా కంపెనీకి అవుట్‌లెట్‌లు ఉన్నాయి. వీరిలో 5000 మందికి పైగా ఉద్యోగులున్నారు. టాటా గ్రూప్ స్టార్‌బక్స్ తో పాటు బారిస్టా, కోస్టా కాఫీలతో ఈ సంస్థ పోటీ పడుతోంది. స్టార్‌బక్స్‌కు భారత్‌లో 146 షాప్‌లు ఉన్నాయి. అయితే సిసిడి విస్తరణ వేగం గత రెండేళ్లుగా తగ్గడం, ఇదే సమయంలో రుణాలు మరింత పెరిగాయి. సంస్థ 2018 సంవత్సరంలో 90 చిన్న దుకాణాలను మూసివేసింది.

విజి సిద్ధార్థ ఎవరు?
కర్నాటకకు చెందిన చిక్‌మగళూరుకు చెందిన విజి సిద్ధార్థ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తరువాత ముంబైకి చెందిన జెఎమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ నుండి తన వృత్తిని ప్రారంభించాడు. అనంతరం ఆయన ‘సెవాన్ సెక్యూరిటీస్’ అనే సంస్థను ప్రారంభించారు.దానిని బెంగళూరుకు మార్చారు. 2000 సంవత్సరంలో సంస్థ కొత్త పేరు గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్.

విఫలమయ్యాను..
బోర్డుకు సిద్ధార్థ లేఖ
కాఫీడే బోర్డుకు సిద్ధార్థ రాసినట్లుగా భావిస్తున్న లేఖను మీడియాలోనూ ప్రసారం చేశారు. ఈ లేఖ ప్రకారం సిద్ధార్థ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ను లాభదాయకంగా నిర్వహించడంలో విఫలమైనందుకు మనస్తాపం చెందినట్లు కనిపిస్తోంది. ఆయన రాసిన లేఖలో లాభదాయకమైన వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కొన్నేళ్లుగా ఎంతో కష్టపడినప్పటికీ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ను విజయవంతం చేయడంలో విఫలమయ్యానని ఆయన పేర్కొన్నారు. లేఖలో ఉన్నదేమిటంటే.. ‘37 ఏళ్ల కృషి, పట్టుదల కష్టంతో సుమారు 30 వేల మందికి నా కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 30 వేల ఉద్యోగాలను కల్పించాను.

ఓ టెక్నాలజీ కంపెనీలో ప్రారంభం నుంచి ప్రధాన షేర్ హోల్డర్‌గా ఉన్నాను. దాని ద్వారా కూడా సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంత కష్టపడినా లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించడంలో విఫలమయ్యాను. నాపట్ల ఉంచిన నమ్మకానికి న్యాయం చేయలేకపోయాను. కంపెనీకి చెందిన ఆర్థిక లావాదేవీలకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. గతంలో మైండ్‌ట్రీలో వాటాను విక్రయించే అంశంలో ఐటి శాఖ డిజి రెండుసార్లు అడ్డుకున్నారు. వేధింపులకు గురిచేశారు. దీనికితోడు ఒక పిఇ సంస్థ నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టమంటూ ఒత్తిడి పెరిగింది. మొత్తం అన్ని రుణాలనూ తీర్చేందుకు కంపెనీకి తగినన్ని ఆస్తులున్నాయి. ఇక నేను అశక్తుడినై త్యజిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన మీ అందరినీ నిరుత్సాహపరిచినందుకు క్షమించండి.’ అని పేర్కొన్నారు.

Coffee Day CMD VG Siddhartha Suicide?