Home తాజా వార్తలు ఫైనల్లో బార్టీ, కొలిన్స్… స్వియాటెక్, కీస్ ఇంటికి

ఫైనల్లో బార్టీ, కొలిన్స్… స్వియాటెక్, కీస్ ఇంటికి

Collins thrashes swiatek, to face barty in final

 

నేడు పురుషుల సెమీస్ పోరు
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ

మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ డానిల్లె కొలిన్స్ (అమెరికా) టైటిల్ పోరుకు చేరుకున్నారు. మరోవైపు ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అమెరికా స్టార్ మాడిసన్ కీస్ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. మరోవైపు పురుషుల సెమీఫైనల్ సమరం శుక్రవారం జరుగనుంది. ఇటలీ స్టార్ మాటియో బెరెటినితో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్, గ్రీకు వీరుడు సిట్సిపాస్‌తో రష్యా అగ్రశ్రేణి ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ తలపడనున్నారు.

బార్టీ నయా చరిత్ర..
మహిళల సింగిల్స్‌లో ఆతిథ్య క్రీడాకారిణి బార్టీ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. మాడిసన్ కీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో బార్టీ అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన బార్టీ 61, 63 తేడాతో కీస్‌ను చిత్తు చేసింది. సొంత గడ్డపై బార్టీ అద్భుత ఆటను కనబరిచింది. దూకుడైన ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తన మార్క్ షాట్లతో అలరించిన బార్టీ ఏ దశలోనూ కీస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుతంగా ఆడిన బార్టీ పెద్దగా శ్రమించకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. అంతేగాక రెండో సెట్‌లోనూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో బార్టీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1980 తరవాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ రికార్డు సృష్టించింది. 1980ంలో వెండి టర్న్‌బల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది.

ఎదురులేని కొలిన్స్
మరో సెమీస్‌లో కొలిన్స్ విజయం సాధించింది. ఏడో సీడ్ ఇగా స్వియాటెక్‌తో జరిగిన పోరులో కొలిన్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. దూకుడుగా ఆడిన కొలిన్స్ 64, 61తో ఇగాను చిత్తుగా ఓడించింది. తొలి సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు.ఒక దశలో స్వియాటెక్ ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు సాగిన కొలిన్స్ మళ్లీ పైచేయి సాధించింది. ఇగా జోరుకు బ్రేక్ వేస్తూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో సెట్‌ను కూడా సొంతం చేసుకుంది. తర్వాతి సెట్‌లో కొలిన్స్ మరింత చెలరేగి పోయింది. ఈసారి ఇగాకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అద్భుత షాట్లతో అలరించిన కొలిన్స్ అలవోకగా సెట్‌ను గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇక కొలిన్స్ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నీ బరిలోకి దిగిన కొలిన్స్ ఏకంగా ఫైనల్‌కు చేరుకుని పెను ప్రకంపనలు సృష్టించింది. శనివారం జరిగే తుది సమరంలో టాప్ సీడ్ బార్టీతో అమీతుమీ తేల్చుకోనుంది.

అందరి కళ్లు నాదల్‌పైనే..
ఇక పురుషుల సెమీస్ పోరు శుక్రవారం జరుగనుంది. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్ బుల్ నాదల్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. తొలి సెమీస్‌లో నాదల్ ఇటలీ సంచలనం బెరెటినితో తలపడనున్నాడు. కెరీర్‌లోనే అత్యంత అరుదైన రికార్డుకు నాదల్ రెండు అడుగుల దూరంలో నిలిచాడు. సెమీస్‌లో బెరెటినిను ఓడించి టైటిల్ పోరుకు చేరుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఈసారి నాదల్ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ అతికష్టం మీద విజయం సాధించాడు. కెనడా ఆటగాడు అగర్‌పై నాదల్ చెమటోడ్చి నెగ్గాడు. బెరెటిని కూడా ఐదు సెట్ల సమరంలో గట్టెక్కాడు. ఇక సెమీస్ పోరులో ఇటు నాదల్ అటు బెరెటిని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. అయితే అనుభవజ్ఞుడైన నాదల్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మరో సెమీస్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్‌తో నాలుగో సీడ్ సిట్సిపాస్ తలపడనున్నాడు. సమవుజ్జీల మధ్య జరిగే పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Collins thrashes swiatek, to face barty in final