Friday, March 29, 2024

ఆయనే మా ధైర్యం.. మా సంతోషం

- Advertisement -
- Advertisement -

Colonel Santosh Babu Wife Interview to Mana Telangana

 ధైర్యంగా బతకడం నేర్పాడు..
అందరి మేలు కోరే వ్యక్తి
ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి
మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి

సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్‌బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన కల్నల్ అంతిమయాత్రకు కన్నీటితో వీడ్కోలు పలికారు. అమరవీరుడికి జేజేలు పలికారు. కారణం కల్నల్ సంతోష్‌బాబు భారత్, చైనా సరిహద్దుల్లో శత్రుదేశ సైనికముష్కరుల దాడిలో కన్నుమూయడమే. ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తూ సౌ మ్యుడిగా, యుద్ధ నివారుడిగా, శాంతి కాముడిగా పేరు పొందిన సంతోష్‌బాబు చైనా సరిహద్దు అధికారులతో చర్చ లు జరుపుతూనే ముష్కరుల దాడిలో భారత దేశానికే దూరమయ్యాడు. శత్రువుల ఎత్తుగడలను ఛేదించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచి అంచెలంచెలుగా ఎదిగాడు. 39ఏళ్ల వయస్సులో కల్నల్‌గా పదోన్నతి పొందాడు. 2009లో సంతోషి ఆయన జీవితభాగస్వామిగా అయ్యింది. శుక్రవారం ఆమె సంతోష్‌బాబుతో సాగిన మధురమైన జాపకాలను ‘మన తెలంగాణ’తో పంచుకుంది.

Colonel Santosh Babu Wife Interview to Mana Telangana
సంతోషి తన భర్త సంతోష్‌బాబుతో గల అనుభవాలు ఆమె మాటల్లోనే..!

నేను సంతోషానికి దూరమైనా.. నా ధైర్యం, నా బలం అన్నీ దేశ భక్తుడైన సంతోష్‌బాబే. ఒక శుభకార్యంలో తల్లిదండ్రులతో ఉన్న నన్ను చూసిన సంతోష్‌బాబు పెళ్లి ప్రస్తావన మొదలు పెట్టాడు. మా తల్లిదండ్రులు తల్లాడ వెంకటేశ్వర్లు, ఉమను కలసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పటికే నేను బిఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో పట్టా తీసుకున్నా. నాకు పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉన్న తల్లిదండ్రులు సంతోష్‌బాబు ప్రస్థావన తెచ్చారు. నేను మనస్ఫూర్తిగా సంతోష్‌బాబుతో పెళ్లికి ఒప్పుకున్నా. అక్టోబర్ 8, 2009 సంవత్సరంలో సాయం సంధ్యవేళలో బంధువుల, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా కల్యాణం జరిగింది. ఎంతో ఆనందంగా జీవితం ప్రారంభించాం. ఉద్యోగ రీత్యా ఆయన బెంగళూరులో పని చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి జీవించాం. 2011లో నవంబర్ 3న మాకు పాప పుట్టింది.

అభిజ్ఞ అని పేరు పెట్టాం. కొద్ది రోజులకే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్యోగ విధుల కోసం వెళ్లారు. అయినప్పటికీ మాతో ఎప్పుడు ఫోన్‌లో సంభాషిస్తూ మా యోగక్షేమాలు తెలుసుకునేవారు. సంతోష్‌బాబు ఆ సమయంలో చెప్పిన మాటలు నా జీవితానికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండేవి. ఎప్పుడైన ఎవరి పని వారే చేసుకోవాలి.. ఒకరిపై ఆధారపడకూడదని అంటుండే వారు. పాప పుట్టిన తర్వాత సుమారు 5 సంవత్సరాలు పాకిస్తాన్ సరిహద్దు తదితర ప్రాంతాల్లోనే విధులు నిర్వహించారు. ఎక్కడ ఉన్నది చెప్పేవారు కాదు. ఎప్పుడు మాట్లాడినా నేను బాగున్నాను.. పిల్లలు బాగున్నారా.. ఆరోగ్యం జాగ్రత్త..అమ్మానాన్నల, అత్త, మామయ్యల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. అని మాత్రమే అడిగేవారు.

ఆయన విధుల్లో ఉన్న సమయాన్ని తనను ఉన్నత చదువుల వైపు మళ్లించారు. అత్త, మామ వద్దనే ఉండి వారికి చేదోడుగా ఉంటూ ఇటు మా తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేదాన్ని. స్థానిక ప్రైవేటు కళాశాలలో బిఈడి పూర్తి చేశా. ఆ తర్వాత కొంత కాలం స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగా. సంతోష్‌బాబు వచ్చినప్పుడు నాకు చెప్పే సూచనలు, మాటలు ఆదర్శంగా ఉండేవి. ప్రతి ఒక్కరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేవారు. చిన్న పిల్లాడిలా పిల్లలతో ఆడుకునే వారు. బంధువులతో కలివిడిగా ఉంటూ అందరినీ నవ్విస్తూ అందరికీ సూచనలు ఇస్తుండేవారు. ప్రతి ఒక్కరు అభివృద్ధితో పాటు విద్యావంతుడు, దేశభక్తులు కావాలని చెప్తుండేవారు. తానే స్వయంగా నాకు కారు డ్రైవింగ్ నేర్పి ప్రోత్సహించారు. ఆయన విధుల్లో దూరంగా ఉన్నప్పుడు నా పని నేనే కారులో వెళ్లి చేసుకునే విధంగా నన్ను తీర్చిదిద్దారు.

జమ్మూ కాశ్మీర్‌లోనూ, విల్లింగ్టన్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా సంతోష్‌బాబు ఫోన్‌లో ఎప్పుడు మాట్లాడుతూ యోగ క్షేమాలు అడుగుతుండేవారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే పిల్లలను పెంచుతూ ఆయన స్ఫూర్తితోటే స్వతంత్రంగా వారు మాట్లాడే విధంగా తీర్చిదిద్దారు. ఢిల్లీలో రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత లద్ధాఖ్‌లో విధుల కోసం వెళ్లారు. గతంలో సమస్యాత్మకమైనటువంటి కాశ్మీర్‌లోనూ, పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ విధులు నిర్వహించిన సంతోష్‌బాబుకు చైనా సరిహద్దు పెద్ద సమస్యగా ఉంటుంది అనుకోలేదు. ఎప్పటికప్పుడు తమతో మాట్లాడుతుండడంతో పిల్లలు నేను ఢిల్లీలోనే ఒకటిన్నర సంవత్సరాలుగా ఉంటున్నాం. మరో కొద్ది రోజుల్లో హైదరాబాద్ రావాల్సి ఉంది.

సహాయం ప్రకటించిన సిఎం కెసిఆర్‌కు, జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డికి ధన్యవాదాలు, మాకు సంపూర్ణ మనోధైర్యం ఇచ్చారు – ఉపేందర్ కుటుంబం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News