* అధికారులకు కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశం
మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్ : రైతులు పండించిన కంది పంటకు ఆయా మండల వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారులు క్షేత్ర పరిశీలన జరిపి ధృవీకరణ పత్రాలను రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఏఈవోలు, మార్కెటింగ్, వీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాలలో రైతులు సాగు చేసిన పంటల దిగుబడి వివరాలు సేకరించారన్నారు. రైతులకు కంది పంట దిగుబడికి మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. రైతులకు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఆయా గ్రామాల్లో ఏఏ తేదీలు, ప్రదేశంలో ఉంటారనే విషయాన్ని ముందుగా ప్రణాళికలు రూపొందించుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. అనధికారికంగా నిల్వ ఉన్న గోదాములు, దుకాణాలపై దాడులు నిర్వహించాలని, అక్రమ రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. లైసెన్స్‌లు లేని ట్రేడర్స్‌లను సీజ్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తహసీల్దార్లు, ఏఈవోలు కొనుగోళు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి తదితర మండలలో కంది పంట దిగుబడి ఉన్న ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లపై ఆయా తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ వీసీలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశా కుమారి, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, ఆర్టీవో సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.