Home రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతర కృషి

జిల్లా అభివృద్ధికి నిరంతర కృషి

వాటర్ గ్రిడ్‌తో ప్రతీ ఇంటికి నల్లా
పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ప్రతీ నియోజక వర్గానికి ఐదువేల గ్యాస్ కనెక్షన్లు
మిషన్ ఇంద్రధనుస్సుతో ఆరోగ్య సేవలు
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
రంగారెడ్డి: జిల్లా ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ధారూర్, చేవెళ్లలో మంత్రి విస్తృత పర్యటనలు చేశారు. సుమారు రూ.13.60 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేపట్టారు. రాష్ట్రంలోని 0-2 సంవత్సరాలలోపు చిన్నారులకు, గర్భిణులకు 8 రకాల ప్రాణాంతకమైన వ్యాధుల నిరోధానికిగాను రాష్ట్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ ద్వారా ఆరోగ్య సేవలను అందిస్తోందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నుట్లు పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల మాదిరిగానే బిసిలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని చెప్పారు.
MAHENDER1 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మౌలిక సదుపాయా లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందిస్తుం దని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీసుకోవాలనే నింబంధనలు ఉన్నప్పటికి ఎవరూ పాటించడంలేదన్నారు. తాగునీటి సమస్యలకు చెక్ పెట్టేందుకుగాను రూ. 1900 కోట్ల తో పనులను ప్రారంభించామన్నారు. దీని ద్వారా శేరిలింగం పల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బినగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ఐటి కంపెనీలు జిల్లాలో ప్రారంభించేందుకు ముందుకు రావడంతో నగరంతో పాటు గ్రామీణా ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశముందని వివరించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జడ్‌పిటిసి సభ్యులు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లలో…
చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలోని చేవెళ్ల ప్రభుత్వ ఏరియాసుపత్రిలో మిషన్ ఇంద్రధనుష్ రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చిన చిన్నారులకు మంత్రి మందులను వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా 2 వేల 456 మంది చిన్నారులకు, 228 మంది గర్భీణీ స్త్రీలకు టీకాలు వేశారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని పేర్కొన్నారు. నిరుపేదల వైద్యం కోసం సర్కారు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించిందని తెలిపారు. ఈ టీకాలు వేయించడం వల్ల ఎనిమిది ప్రాణాంతక వ్యాధులు క్షయ, కంఠసర్ఫి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, తట్టు కామెర్లు, మెదడువాపు, న్యూమోనియా వంటి వ్యాధులను అరికట్టే అవకాశముందన్నారు. చిన్నారులకు, గర్భిణులకు తప్పనిసరిగా వేయించాలని మంత్రి సూచించారు. గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కృషిచేస్తోందని పేర్కొన్నారు. గర్భిణులకు నాణ్యమైన ఆహారం, టీకాలు, మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను, మౌళిక వసతులను మెరుగుపర్చేందు కుగాను ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. వైద్యులను కూడా నియమిస్తామన్నారు. అనంతగిరి టిబి ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లలను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య, జిల్లా వైద్యాధికారి భానుప్రకాష్, చేవెళ్ల ఎంపిపి మంగలి బాల్‌రాజ్, జడ్‌పిటిసి సభ్యురాలు చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి, చేవెళ్ల గ్రామ సర్పంచ్ మంగలి నాగమ్మబాల్‌రాజ్, ఏరియాసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం ఇంచార్జి మోహన్, చేవెళ్ల ఎంపిడిఓ రత్నమ్మ, ఆసుపత్రి వైద్యులు సునీత, స్వాతి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సామ మాణిక్యరెడ్డి, కార్యదర్శి బర్కల రాంరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల ప్రభాకర్, మాసన్నగారి మాణిక్యరెడ్డి, మండల యూత్ నాయకులు మంగలి యాదగిరి, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల గ్యాస్ కనెక్షన్లు …
ధారూరు: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపిపి ఉమాపార్వతీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలానికి రెండు వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. మొదటి విడతలో మండలానికి 863 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు రాని వారికి రెండో విడతలో మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలోని పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయడానికి 500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో వికారాబాద్ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 500 సంవత్సరాల కిందట ముందుచూపుతో రాజులు తవ్వించిన చెరువులను రాష్ట్ర ముఖ్యమంత్రి కృషితో పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఉదాహరణ వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ చెర్వేనని తెలిపారు. సరైన వర్షాలు కురిస్తే పూడిక తీసిన చెరువులు నిండితే 2, 3 సంవత్సరాల వరకు ఎటువంటి నీటి ఎద్దడి ఉండడని చెప్పారు. మిషన్ కాకతీయ కింద రెండవ విడతలో 160 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు వివరించారు. సిఎం ఇచ్చిన హామీల మేరకు ఒకే విడతలో రైతులకు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందన్నారు. దళితులకు మూడు ఎకరాలభూమి, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా పచ్చ చొక్కాలు, తెల్ల చొక్కాల వారికి కాకుండా అర్హులైన పేదలకు మాత్రమే రెండు పడకల గదులు ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని పేర్కోన్నారు. ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున ఇండ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అర్హులకు గుర్తించడం జరుగుతుందన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ, తెలంగాణలో 70 సంవత్సరాల ఆంధ్ర పాలనలో కుంటు పడిన తెలంగాణ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరం లక్ష ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పారు. యువకులు కష్టపడి చదివి ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమాపార్వతీ మాట్లాడుతూ, మండలానికి 2000 గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ, మహిళల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తుందని చెప్పారు. గుజరాత్ రాష్ట్రం తరువాత రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో మొదటి స్థానానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సబిత, తహసీల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు హాఫీజ్, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, యూనిస్, ఆంజనేయులు, రాజునాయక్ తదితరలు పాల్గొన్నారు. అనంతరం లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా మృతి చెందిన ఉపాధి హామీ కూలీ లాలయ్య భార్య బుజ్జమ్మకు 50 వేల రూపాయల చెక్కును అందజేశారు.
4.53 కోట్ల రూపాయలతో నిర్మించే బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి…
మండల పరిధిలోని నాగారం గ్రామంలో 4.53 కోట్ల రూపాయలతో గొట్టిముకుల నుంచి అంపల్లి గేటు వరకు 14.6 కిలో మీటర్ల మేర నిర్మించే బిటి రోడ్డు పనులకు మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నాగారం గ్రామంలో700 మీటర్ల మేర నిర్మించే సిసి రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపిపి ఉమాపార్వతీ, నాగారం సర్పంచ్ ప్రేమలతాగౌడ్, ఎంపిటిసి మునిరాబేగం తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సర్పంచ్ …
నాగారం గ్రామ సర్పంచ్ ప్రేమలతాగౌడ్ తన అనుచరులతో కలిసి మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో శనివారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గతంలో సర్పంచ్ ఎన్నికలలో గ్రామ ప్రజలకు అనేక వాగ్దానాలు చేయడం జరిగిందని, వాటిని నేరవేర్చడానికి మంత్రి సమక్షంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.