Home ఎడిటోరియల్ దీపం కింద చీకటి

దీపం కింద చీకటి

Open defecation Read more at: https://yourstory.com/mystory/dfd27a2a0e-open-defecation-a-thr

 

బహిరంగ మల విసర్జనను రూపు మాపాలంటే నిరంతరం ప్రజలను చైతన్య పరచాలి. స్థానిక సంస్థల, ఆ పై అధికారుల మధ్యన సమన్వయం ఉండాలి. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజల పాత్ర ఉన్నంత మాత్రాన సరిపోదు. సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలి. మన దేశంలో ‘అంటు’, ‘ముట్టు‘ అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తప్ప ఇలాంటి పథకాల వల్ల లక్ష్యాలు సాధించడం సాధ్యం కాదు. పకడ్బందీ పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉంటే తప్ప లక్ష్యం నెరవేరదు.

దేశమంతటా బహిరంగ మల విసర్జన లేకుండా చేసే లక్ష్యంతో 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించారు. అహింసా సిద్ధాంతం వ్యాపింపచేయడానికి జీవితాంతం కృషి చేసిన మహాత్ముడి జన్మ దినం రోజున స్వచ్ఛ భారత్ పథకం ప్రారంభించారు. వైపరీత్యం ఏమిటంటే వివిధ కారణాలవల్ల అహింసా మార్గాన్ని వ్యతిరేకించే వారు హింసకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశారు. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేసినందుకు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు.

ఆ బాలలిద్దరూ మరణించిన సెప్టెంబర్ 25ననే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూ యార్క్ లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి స్వచ్ఛ భారత్ పథకాన్ని అమలు చేసినందుకు అవార్డు అందుకున్నారు. 2018 ఆగస్టులో రాజస్థాన్‌లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో బహిరంగా మల విసర్జన చేస్తున్న మహిళల ఫొటొలు తీస్తున్నందుకు అభ్యంతర పెట్టిన జఫర్ హుస్సేన్‌ను కొట్టి చంపారు. అంతకు ముందు 2018 జనవరిలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా కట్ ఘట్ లో బహిరంగంగా మల విసర్జన చేస్తున్న వారిని కొట్టినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. టీవీ చానళ్లలో ఈ దృశ్యాలను ప్రసారం చేశారు.

భవ్ ఖేడీలో బహిరంగమా మల విసర్జన చేస్తున్న ఇద్దరు బాలలను కొట్టి చంపిన రెండు రోజుల తరవాత బహిరంగ మల విసర్జన చేస్తున్న వారి మీద దాడి చేయకూడదని ప్రభుత్వం సలహా ఇచ్చింది. కానీ ప్రభుత్వాధికారులు మాత్రం బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. మరుగు దొడ్లు సరిపడినన్ని లేని చోట్ల లేదా అసలే లేని చోట్ల హడావుడిగా మరుగుదొడ్లు నిర్మించేసి తమ ప్రాంతం బహిరంగ మల విసర్జన నుంచి విముక్తం అయిందని ప్రచారమూ చేశారు. ముంబైలో బహిరంగ మల విసర్జన లేనే లేదని రెండేళ్ల కిందే అట్టహాసంగా ప్రకటించారు. కానీ దేశ ఆర్థిక రాజధాని అనుకునే ముంబైలోని మురికివాడల్లో బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం ఊహించడం కష్టం ఏమీ కాదు. తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, నీటి వసతి కొరవడడం, ఉన్న మరుగుదొడ్లలో విద్యుత్ సదుపాయం లేనందువల్ల పిల్లలు వీటిని ఉపయోగించుకునే వీలు లేనందువల్ల బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉంది.

అనేక సంక్షేమ పథకాల అమలులో లక్ష్యాలు సాధించడానికి ఎక్కడ లేని హడావుడి చేస్తారు. దీనివల్ల అసలు లక్ష్యం నెరవేరకుండానే ఉండిపోతుంది. ఏ పథకం కోసం ప్రచారమైనా బలవంతం మీద ఆధారపడి ఉండకూడదు. జనంలో చైతన్యం కలగ చేయాలి. నచ్చ చెప్పాలి. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఆరోగ్య పారిశుద్ధ్య అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బహిరంగ మల విసర్జన చేసే వారి మీద దౌర్జన్యం జరిగిన అనేక సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. మౌలిక పారిశుద్ధ్య సదుపాయాలు లేకపోతే బహిరంగ మల విసర్జనను ఆపడం సాధ్యం కాదు. బహిరంగ మల విసర్జన చేస్తున్న పిల్లలను కొట్టి చంపడం వెనక కులతత్వ భూతం ఉంది.

షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తరగతులకు చెందిన వారు మల విసర్జన చేసినప్పుడే వారి మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వర్గాల వారికి జరిమానాలు విధిస్తున్నారు, ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు దక్కకుండా చేస్తున్నారు. కడకు పోలీసులు నిర్బంధిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. శివపురి సంఘటనపై మీడియా సేకరించిన సమాచారాన్నిబట్టి చూస్తే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారే తమ మీద దాడులు చేసే వారి పాకీ దొడ్లతో సహా అగ్ర వర్ణాలకు చెందిన, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వారి పాకీ దొడ్లు కూడా శుభ్రం చేయాల్సి వస్తోంది. అంతే గాకుండా ప్రభుత్వం అమలు చేసే పథకం కింద వారికి మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందకుండా చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలను కొట్టి చంపడం, వారి పట్ల వ్యవహరించిన తీరు నిమ్న కులాల వారంటే ఎంత హేయమైన, అమానుషమైన భావన ఉందో అర్థం అవుతోంది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ కులం ప్రధాన పాత్ర నిర్వహిస్తూనే ఉంది. సమాజంలోని ఇతర వర్గాల వారు సైతం మల విసర్జనకు దళితులు నివసించే ప్రాంతాలనే ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు దళిత బాలలు దళితులు నివసించని ప్రాంతాలలో బహిరంగంగా మల విసర్జన చేయడం ఇతర కులాల వారికి ఆగ్రహం కలిగించింది. వారిని హెచ్చరించకుండా అక్కడికక్కడే కొట్టి చంపారు. కులం, పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలను పట్టించుకోకుండా స్వచ్ఛ భారత్ పథకం అమలు సాధ్యం కాదని సామాజిక కార్యకర్తలు గత అయిదేళ్లుగా చెప్తూనే ఉన్నారు.

ఇతర పొరుగు దేశాలలో లేదా ఆఫ్రికా దేశాలలో బహిరంగ మల విసర్జన లేకుండా చేసే ప్రయత్నాల పర్యవసానాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. బహిరంగ మల విసర్జనను రూపు మాపాలంటే నిరంతరం ప్రజలను చైతన్య పరచాలి. స్థానిక సంస్థల, ఆ పై అధికారుల మధ్యన సమన్వయం ఉండాలి. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజల పాత్ర ఉన్నంత మాత్రాన సరిపోదు. సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలి. మన దేశంలో ‘అంటు‘, ‘ముట్టు‘ అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తప్ప ఇలాంటి పథకాల వల్ల లక్ష్యాలు సాధించడం సాధ్యం కాదు. పకడ్బందీ పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉంటే తప్ప లక్ష్యం నెరవేరదు.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Community Subsidies Increase Toilet Use in Developing