Home లైఫ్ స్టైల్ పెటాకులవుతున్న పెళ్లిళ్లు అహాన్ని అధిగమించలేని జంటలు

పెటాకులవుతున్న పెళ్లిళ్లు అహాన్ని అధిగమించలేని జంటలు

Compared to europe country, the divorce rate is low in our country

వివాహ వ్యవస్థ అన్నది కేవలం మూడుముళ్లు, ఏడడుగులతో సరిపోదు. తాళి కట్టగానే వచ్చే హక్కుకాదు. భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, సహకారం, నిత్యం పచ్చదనంగా వర్ధిల్లి నూరేళ్లు చల్లగా బతుకుదామన్న నమ్మకమే వివాహ వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. ప్రాణం ఉన్నంత వరకూ ఇద్దరం ఒకరిగా జీవిద్దామన్న ప్రేమ వారిని చిరకాలం దృఢంగా నడిపిస్తుంది. కానీ ఈ రోజు ఈ నమ్మకాలన్నీ పటా పంచలై విఫలమైన వివాహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి

ఐరోపా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో విడాకుల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పుడు సంఖ్య పెరుగుతుండటం ఆవేదన కలిగిస్తోంది. మహమ్మదీయ పాలన ప్రభావంతో “తలాఖ్‌” సంప్రదాయం, ఆంగ్లేయుల పాలన వల్ల విడాకుల సంప్రదాయం మన దేశంలో ప్రవేశించాయి. హిందూ , సిక్కూ మతస్థుల్లోనూ గత రెండు దశాబ్ధాలుగా విడాకుల శాతం వేగంగా పెరుగుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పూర్వకాలంలో మహిళలు చదువుకోవడం అంతగా లేదు. ప్రతి దానికి భర్త నిర్ణయాల మీద ఆధారపడేవారు. కుటుంబంలో పొరపాట్లు జరిగినా, భర్త చిత్రహింసలు పెడుతున్నా భార్య మౌనంగా, సహనంగానే భరించేది తప్ప బయట పడేది కాదు. పెళ్లైన తర్వాత భర్తను భార్య విడిచి పెట్టడం అంత సులువుగా ఉండేది కాదు. ఒక వేళ తెగించి పుట్టింటికి వెళ్లిపోతే అప్రతిష్ఠగా భావించేవారు. అందుకని ఎన్ని కష్టనష్టాలున్నా పుట్టింటికి వెళ్లి పోవడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది.

తల్లిదండ్రులు ఆడ పిల్లలను బాగా చదివిస్తున్నారు. వారు ఆర్థికంగా బాగా ఉండడానికి ప్రోత్సహిస్తున్నారు. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక భధ్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు మహిళలు దేనికీ భయపడటం లేదు. అత్తింటివారి వైఖరి నచ్చకపోతే తిరుగుబాటు చేసే శక్తివంతురాలైంది. మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకుని వాటి పట్ల అవగాహన చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అవగాహాన కల్పిస్తుంది. అయితే విడాకులు తీసుకోవడం మంచిదని ఎవరూ భావించరు. కానీ వైవాహిక జీవితం భరింపరాని బాధల మయం అయినప్పుడు విడాకులు తీసుకోవడమే ఉత్తమ మార్గం. పెళ్లిళ్లు సాధారణంగా కుదిర్చిన సంబంధాలతోనే జరుగుతుంటాయి. వరుడో, వధువో పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా సిద్ధం కానప్పుడు గొడవలు, ఘర్షణలు ఎదురుకావడం సహజం. ఇది చివరకు విడాకులకు దారితీస్తుంది.

ప్రస్తుత తరం వాస్తవ సంబంధాలు ఏమిటో తెలుసుకోలేక పోతుంది. ప్రేమ గురించి ఆలోచించడం లేదు. చివరకు పెళ్లిని కూడా తేలికగా తీసుకొంటున్నారు. చాలా మంది పెళ్లీని ఒక వేడుకగా భావిస్తున్నారు తప్ప జీవితాంతం కలిసి మెలిసి బాధ్యతలు నిర్వహించవలసిన ధర్మంగా అనుకోవడం లేదు . ప్రేమ పరిపూర్ణంగా ఉన్నప్పుడు దంపతుల మధ్య గొడవలే రావు ఏ సమస్య ఉన్న అభిప్రాయబేధాలు ఏర్పడినప్పుడు ఎవరికి వారు ‘ఇగో’ బేషజాలకు పోయి పట్టింపులతో ఉంటే ఏ కాపురం చల్లగా ఉండదు. ఈ రోజుల్లో భార్యభర్తలిద్దరూ చదువులోనూ, ఉద్యోగంలోనూ, సంపాదనలోనూ సమానం కావడంతో ప్రతి చిన్న విషయానికి లేనిపోని రాద్ధాంతాలు ఇగోలతో కుమ్ములాడుకోవడం కనిపిస్తుంది.

ఈ పరిస్థితుల్లో అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ కన్నవారు, అత్తవారు జోక్యం చేసుకుంటే అది సింహాల సమరమే తప్ప శాంతి యుతంగా సంసారాన్ని చక్కదిద్దదు. కొన్ని సంఘటనలు పరిశీలిస్తే స్వల్ప కారణాలే వివాదాలకు, విద్వేషాలకు దారితీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విడాకులు సామాజికంగా నిషేధించే అంశం. హైందవ సమాజంలో పెద్దలు దీని గురించి సాధారణంగా చెప్పుకోరు. ప్రపంచం మొత్తంమీద విడాకుల శాతం 2శాతం వరకూ భారత దేశంలో ఉన్నప్పటికీ గత అయిదేళ్లుగా ఈ శాతం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా అర్బన్, సెమీఅర్బన్ ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తోంది. భారత దేశంలో దంపతులు చట్టపరంగా విడాకులకు ప్రయత్నించవచ్చు. వ్యభిచారం, మతమార్పిడి, అపరిశుభ్రత, సన్యాసం, విడిచిపెట్టడం. గృహహింస, , దంపతుల తిరస్కృతి , ఇవన్నీ విడాకులకు దారి తీస్తుంటాయి. అనేక సామాజిక అంశాలు, జీవనవిధానాలు కూడా దంపతులు విడిపోవడానికి కారణాలు అవుతున్నాయి.

మహిళా సాధికారత: ఈనాడు మహిళ విద్యావంతురాలు. ఆర్థికంగా స్వయం సామర్థం గలిగినది. స్వతంత్రురాలు. తన అభిప్రాయాలు తెలియజేయడానికి లేదా తన హక్కుల కోసం పోరాడడానికి ఓపిక చూపించడం లేదు. తనకు తాను బతకాలన్న ఆలోచనలో ఉంటుంది. కుటుంబ భాద్యతలు భర్తతో సమానంగా భరించగలదు. అంతకన్నా బాగా నెరవేర్చగలదు కూడా. సుఖం లేని వైవాహిక జీవితం కన్నా స్వేచ్ఛగా జీవించాలన్న ఆకాంక్ష ఎక్కువగా కనిపిస్తుంది.

పరస్పర అవగాహనా లోపం: ఒక సర్వే ప్రకారం తమ సాధక బాధకాల గురించి మగవాళ్లు పట్టించుకోరని, ఏది చెప్పినా పెడచెవిన పెడుతుంటారని చాలామంది గృహిణులు ఆవేదన చెందుతుంటారు. అయితే మగవాళ్లు మాత్రం తమ భార్యలు ఎక్కువగా చీటికి మాటికి సాధించడం వేధించడం చేస్తుంటారని ఆరోపిస్తుంటారు. సంప్రదాయ వైవాహిక వ్యవస్థలో భార్యలు అన్నింటికీ అణిగిమణిగి ఉండాలని అనుకున్నవారు కొందరైతే, వివాహం విషయంలో స్వయం నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర వహించేవారు కొందరు ఉంటారు. ఈ రోజు దంపతుల మధ్య భేషజాలు తీవ్ర ప్రభావం చూపించి చివరకు వారిని విడదీస్తున్నాయి. ఎవరికి వారే పంతాలకు పోతున్నారు తప్ప సమిష్ఠిగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం లేదు.

అంకిత భావం లోపం: ప్రస్తుత తరంలో కొత్త భాగస్వామిని ఎంచుకున్నప్పుడు అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం నచ్చకపోయినా గుడ్‌బై చెపుతున్నారు. స్థిమితం లేని, గందరగోళ జీవన విధానాలు చిరాకు, నిస్పృహ, సంఘర్షణ పరిస్థితులు కల్పిస్తున్నాయి. వైవాహిక పునాదులకు విఘాతం కలిగిస్తున్నాయి.
కుటుంబ జోక్యంః ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నశించింది. ఒంటరి కుటుంబాలు పురోగతి చెందుతున్నాయి.భార్యతరఫున కుటుంబీకులు ఏ విధంగా నైనా జోక్యం చేసుకుంటే భార్యాభర్తల మధ్య అవసరమైన వివాదాలు తలెత్తుతుంటాయి. భార్య తరుఫువారు ఆమె వాదాన్నే తప్పయిని ఒప్పయినా బలపరుస్తుంటారు. ఇది ఆ కుటుంబంలో అలజడిని రేపుతుంది.

బలవంతపు వివాహాలు: మన దేశంలో కులాంతర వివాహాలు సమాజ అంగీకారాన్ని సాధించుకొంటున్నాయి. వివిధ ప్రాంతాలు, కులాలకు చెందిన వధూవరులు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నప్పుడు తరచుగా సామాజిక ఆగ్రహానికి లోనవుతుంటారు.
ఈ సామాజిక ఒత్తిడులు భరించలేక ఆ దంపతులు కొన్ని సార్లు విడాకులకు ప్రయత్నించే సంఘటనలు కూడా సంభవిస్తున్నాయి.

ఐపిసి సెక్షన్ 498 ఎ.: ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498ఎ ప్రకారం ఏ ఇల్లాలికైనా విడాకులు తీసుకునే హక్కు ఉంది. అది ఆమె అత్తింటి వారివల్ల వేధింపులకు, గృహహింసలకు బలవుతున్నప్పుడు విడాకులు తీసుకోవడం తప్పులేదు. అయితే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని లేని పోని ఆలోచనలు చేసే కేసులు చాలావరకూ తెరపైకి వస్తున్నాయి. అయినా బాధితురాలైన గృహిణికి చట్టపరంగా రక్షణ కల్పించవలసి ఉంటుంది.

                                                                                                                                – మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి