Thursday, April 25, 2024

చిన్నదైనా మనకంటే మిన్న

- Advertisement -
- Advertisement -

        Natural Gas Price Prediction      మన పొరుగునున్న బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో మనను మించిపోతున్నదనే సమాచారం ఆశ్చర్యపర్చడం సహజం. కాని అది ముమ్మాటికీ వాస్తవమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) బల్లగుద్ది చెబుతున్నది. 2020లో తలసరి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో బంగ్లాదేశ్ భారత దేశాన్ని మించిపోనున్నదని ఐఎంఎఫ్ వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్ సంక్షోభం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్న మాట వాస్తవం. ఈ ఏడాది మన జిడిపి 10.3 శాతం కుంగిపోనున్నదని ఐఎంఎఫ్ తాజాగా హెచ్చరించింది. ఈ కుంగుబాటు 9.3 శాతమని ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన అంచనా కంటే ఇది ఎక్కువ. లాక్‌డౌన్ కారణంగా 2020లో ఇండియా తలసరి జిడిపి 1880 డాలర్లు ఉండగలదని అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి దేశీయోత్పత్తి పది డాలర్లు ఎక్కువ (1890) కాగలదని ఐఎంఎఫ్ లెక్కగట్టింది. 2019లో 2100 డాలర్లుగా ఉన్న భారత దేశ తలసరి జిడిపి 2020 నాటికి బాగా పడిపోయి 1880 డాలర్లు కానుండగా గత ఏడాది (2019) 1820 డాలర్లుగా ఉన్న బంగ్లాదేశ్ తలసరి ఉత్పత్తి ఈ సంవత్సరం (2020) 1890 డాలర్లకు పెరగనుండడం గమనించవలసిన విశేషం. కరోనా ఒక్క భారత దేశానికి దాపురించిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను పీడిస్తున్నది.

బంగ్లాదేశ్ కూడా దాని బారిన పడింది. అటువంటప్పుడు అక్కడ కరోనా నేపథ్యంలో కూడా తలసరి జిడిపి పెరగడం, భారత్‌లో అది దారుణంగా పడిపోడంలోని అంతరార్థం ఆసక్తికరమైనది. భారత ఆర్థిక వ్యవస్థ 2021లో తిరిగి కోలుకొని తలసరి జిడిపి 2030 డాలర్లుగా నమోదు కాగలదని అదే సమయంలో బంగ్లాదేశ్ 1990 డాలర్ల వద్ద ఉండగలదని ఐఎంఎఫ్ వెలువరించిన అంచనా మనకు సంతోషదాయకమే. కాని 2024, 2025 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ మళ్లీ మన తలసరి జిడిపిని మించిపోనున్నదని చేసిన నిర్ధారణ పొరుగునున్న అతి చిన్న దేశం ప్రగతి పరుగు ముందు సువిశాల భారతం దిగదుడుపు అవుతున్న దృశ్యాన్ని కళ్లకు కడుతుంది. కరోనాతో పోరాటంలోనూ బంగ్లాదేశ్ మనకంటే ముందున్నది. ఆ మహమ్మారికి రెండు మందుల మిశ్రమ ఔషధాన్ని సాధించడంలో బంగ్లాదేశ్ కృతకృత్యురాలైంది.

దక్షిణాసియాలో భారత దేశం తర్వాత రెండవ అతి ఎక్కువ కరోనా బాధిత దేశం బంగ్లాదేశ్. అయినా మనకంటే తక్కువ నష్టాలతో బయటపడుతున్నది. అక్కడ కూడా గత మార్చి 23 నుంచి మే 30 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. గత అనేక సంవత్సరాలుగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ వెనుక చూపు లేకుండా పుంజుకుంటున్నది. దాని వృద్ధి 6 శాతం ఆ పైమాటగానే ఉంది. గత ఏడాది 8.2 శాతం వృద్ధిని చవిచూసింది. ఈ ఏడాది బంగ్లాదేశ్ ఎగుమతుల ఆధార వృద్ధి 3.8 శాతంగా నమోదు కాగలదని భావిస్తున్నారు. జౌళి, మందులు, ఎలెక్ట్రానిక్స్, నౌకా నిర్మాణం, తోలు మున్నగు పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని బంగ్లాదేశ్ సాధిస్తున్నది. రెడీమేడ్ దుస్తుల ఎగుమతులలో చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించుకున్నది.

దాని ఎగుమతుల ఆదాయంలో 81 శాతం దుస్తుల మీదనే వస్తున్నది. 2021 నాటికి దుస్తుల ఎగుమతుల ద్వారా 50 బిలియన్ డాలర్లను ఆర్జించాలని పెట్టుకున్న లక్షం వైపు బంగ్లాదేశ్ దూసుకుపోతున్నది. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటా 37 జౌళి విశ్వ విద్యాలయాలున్నాయి. వాటి నుంచి దుస్తుల తయారీ తదితర జౌళి పారిశ్రామిక నైపుణ్యం సాధించే పట్టభద్రులు విరివిగా తయారవుతున్నారు. ఇంత వరకు అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశంగా పరిగణన పొందుతున్న బంగ్లాదేశ్ అమెరికా, చైనా, రష్యాలు సహా 52 దేశాలకు సుంకం చెల్లించ అవసరం లేని ఎగుమతులను చేసుకునే సౌకర్యాన్ని అనుభవిస్తున్నది. నాణ్యమైన ఆయా మార్కెట్లకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా ఎగుమతి ప్రధాన ఆర్థిక వృద్ధిని సాధించుకోగలుగుతున్నది.

అందుకు విరుద్ధంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయమైన స్థితికి దిగజారిపోయింది. కరోనా లాక్‌డౌన్ విరుచుకుపడడానికి ముందు నుంచే మన వృద్ధి దెబ్బ తిన్నది. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే ప్రధాని మోడీ ప్రభుత్వ గత హయాంలో నాలుగేళ్ల క్రితం 2016 నవంబర్‌లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్యతోనే భారత ఆర్థిక వృద్ధి దెబ్బతిన్నది. లోకులు భావించే దానికి భిన్నంగా ముస్లిం మెజారిటీ సమాజమైన బంగ్లాదేశ్ సంతాన వృద్ధి రేటును అదుపు చేసే విషయంలోనూ విజయం సాధించింది. మరణించే వారి సంఖ్య మేరకే అక్కడ జననాలు రికార్డవుతున్నాయంటే జనాభా పెరుగుదలను బంగ్లాదేశ్ విజయవంతంగా అడ్డకోగలిగిందని అంగీకరించక తప్పదు. ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా ఎగుమతుల వాణిజ్యంపైనే ఆధారపడి ఉంటుందని చైనా, బంగ్లాదేశ్‌లు నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో బంగ్లాదేశ్ మనకు ఆదర్శం కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News