Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) నెలాఖరులోగా పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ

నెలాఖరులోగా పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ

 Complaints received during checks

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : రైతులకు ఈ నెలాఖరు లోగా పట్టాదారు పాసు పుస్తకాలు, పంట పెట్టుబడి చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ యంవి రెడ్డితో కలిసి జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా రంజీవ్ ఆర్ ఆచార్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ సమయాలలో వచ్చిన ఫిర్యాదులను, పాసు పుస్తకాలలో దొర్లిన తప్పులను సరిచేసి రైతులకు అందజేయాలని అన్నారు. జనవరి అనంతరం కొనుగోలు జరిగిన భూముల వివరాలను విత్‌హెల్డ్‌లో పెట్టి అర్హత కలిగిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులు అందజేయాలని సూచించారు. ఆధార్ అనుసంధానం కానివాటిని సత్వరం అనుసంధానించాలన్నారు. కీసర మండలంలో 94 శాతం, శామీర్‌పేటలో 86 శాతం, మేడ్చల్‌లో 94 శాతం విత్‌హెల్డ్‌లో ఉన్న పాసు పుస్తకాలు, చెక్కులను జూన్ 20 లోగా పరిష్కరించాలని అన్నారు. ఇప్పటి వరకు చెక్కుల పంపిణీ 81 శాతం, పట్టాదారు పాసు పుస్తకాలు 90 శాతం పంపిణీ జరిగిందని జిల్లా అధికారులు వివరించగా, ఫిర్యాదులను, తప్పులను సవరించి జూన్ 12 లోగా  ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీలో పాల్గొన్న అధికారులను అభినందించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తమ కుటుంబ సభ్యులకు రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి నిమిత్తం వచ్చిన రూ.1.44 లక్షల చెక్కులను తిరిగి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య కలెక్టర్ యంవి రెడ్డిలకు అందజేశారు. జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, డీఆర్‌ఓ విజయకుమారి, ఆర్‌డీఓలు లచ్చిరెడ్డి, మధుసుధన్, డీఆర్‌డీఓ కౌటిల్య, వ్యవసాయ శాఖ అధికారి అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.