మనతెలంగాణ/మిర్యాలగూడ : జిల్లాలో ప్రభుత్వం నుంచి ఇసుక విక్రయాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా గనుల శాఖాధికారి సురేందర్ తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు గాను 340 మంది ట్రాక్టర్ల ఓనర్లు రూ.18 వేలు ఈఎండి, రూ.10 వేలు జిపిఎస్ కోసం చెల్లించడం జరిగిందన్నారు. ఇసుక రవాణా చేసేందుకు గాను మూసినది, పాలేరు, హాలియా మరో ఆరు నది, వాగుల తీర ప్రాం తాలను గుర్తించామన్నారు. అక్కడ నుంచి ఇసుకను నిర్ణీత ధరపై అధికారులు, సిబ్బంది ఇంటి వరకు రవాణా చేస్తారన్నారు. ప్రతి ట్రాక్టర్‌కు జిపిఎస్ ఉంటుందని, ఆ ట్రాక్టర్ ఎక్కడికి వెళుతుందనేది వెంటనే తెలుస్తుంద న్నారు. ఇసుక ట్రాక్టర్ లోడ్ చేసే పని నుంచి ఎప్పటికప్పుడు ఇసుక బుక్ చేసిన వ్యక్తికి 24 రకాల మెసేజ్‌లు సెల్‌ఫోన్‌కు వస్తాయన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ ట్రాలీకి బ్లూకలర్ ఉంటుందని, ఇసుక రవాణా చేసే స్టిక్కర్ అంటించి ఉంటుం దన్నారు. నిబంధనలను అతిక్రమించి ఇసుక రవాణా చేసే ట్రాక్టర్‌కు మొదటి సారి రూ.5 వేలు, రెండోసారి రూ.15 వేలు, మూడోసారి ట్రాక్టర్ స్వాధీనం చేసుకొని కఠినతర శిక్ష, వాల్టాచట్టం కింద కేసులు నమోదు చేస్తామ న్నారు. ఇసుక ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు రవాణా సౌకర్యం ఉంటుందన్నారు. జిల్లాలో వివిధ నదులు, వాగుల్లో సుమారు 4,56,000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వలున్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రావు ఉన్నారు.