Home ఆఫ్ బీట్ భవిష్యత్తు జీవధార

భవిష్యత్తు జీవధార

Complete Review on Kaleshwaram Lift Irrigation Project in Telugu

ప్రాజెక్టు విశేషాలు:-  1. ఒకే ప్రాజెక్టులో బ్యారేజిలు, గ్రావిటీ కెనాళ్లు, సొరంగాలు, భూగర్భ పంపుహౌజ్‌లు, సర్జ్‌పూల్స్, విద్యుత్ సబ్‌స్టేషన్ల సమ్మిళితంగా ఉండడం.

2. ఆసియాలోనే అతి పెద్ద మోటార్ల (139 మెగావాట్లు) వినియోగం. వీటి సామర్థం 3,134 క్యూసెక్కులు.

3. 100 మీటర్ల ఎత్తు నుంచి 620 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేయడం. 520 మీటర్ల మేర ఎత్తుకు తీసుకెళ్లడం.

4. 400 కెవి సబ్‌స్టేషన్లు 6, 220 కెవి సబ్‌స్టేషన్లు 8, 132 కెవి సబ్‌స్టేషన్లు 2, 33 కెవి సబ్‌స్టేషన్లు 3, ఇందులో ఒకటి భూగర్భ జిఐఎస్ సబ్‌స్టేషన్.

5. ఒకే రోజు 21 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 2 లక్షల బస్తాల సిమెంటు వినియోగం. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద వినియోగం. చైనాలోని త్రీగార్జెస్ డ్యాంలో 22 వేల క్యూబిక్ మీటర్ల వినియోగం జరిగింది.

6. రోజుకు 2 టిఎంసిలు ఎత్తిపోసేలా పంప్‌హౌజ్‌ల నిర్మాణం, 3 టిఎంసిలకు సరిపడా కాలువలు, ఇతర సివిల్ స్ట్రక్చర్ల నిర్మాణం.

7. 141 టిఎంసిల నీటి నిల్వ, 150 కిలోమీటర్ల మేర నదికి పునరుజ్జీవం. నదిలోనే 55 టిఎంసిల నీటి నిల్వ.

8. శ్రీరాంసాగర్ (90 టిఎంసిలు), ఎల్లంపల్లి (20 టిఎంసిలు), మిడ్ మానేరు (25 టిఎంసిలు), లోయర్ మానేరు (25 టిఎంసిలు), నిజాంసాగర్ (17 టిఎంసిలు), మొత్తం 177 టిఎంసిలను జలాశయాల్లో నిల్వచేయవచ్చు.

9. ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, జర్మనీ, చైనా, జపాన్, ఇండియా దేశాల నుంచి ఆండ్రిజ్, ఎబిబి, జైలమ్, కెబిఎల్, డబ్లుపిఐఎల్, ఫ్లో మోర్, బిహెచ్‌ఇఎల్, సీమెన్స్ తదితర కంపెనీల ద్వారా పంపులు, మోటార్లు, ఇతర అనుబంధ పరికరాల సరఫరా. 

10. పూర్తిగా స్థానిక పరిజ్ఞానంతో డిజైన్ల రూపకల్పన.

11. ప్రాజెక్టు నిర్మాణానికి నిత్యం రెవెన్యూ, అటవీ, కాలుష్యనియంత్రణ మండలి, ట్రాన్స్‌కో, జెన్‌కో, గనులు, భూగర్భవనరుల శాఖ, న్యాయ శాఖ, రైల్వే శాఖ, పోలీస్ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, ఇపిటిఆర్‌ఐలతో సమన్వయం.

12.కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, వన్యప్రాణి బోర్డు, ఎన్‌జిఆర్‌ఐ, ఎన్‌ఐఆర్‌ఎం, ఐఐటి, జిఎస్‌ఐ, ఎన్‌హెచ్‌ఎఐ తదితర సంస్థలతో నిత్యం సమన్వయం. 

పరుగులిడుతున్న ప్రాజెక్టు పనులు, మరో వందేళ్ల వరకు బతుకు భరోసా

ముచ్చ అశ్వధ కుమార్ రెడ్డి / మన తెలంగాణ: నీళ్లు లేక ఇసుకదిబ్బలే పరుచుకున్న గోదావరి ఓ వైపు… విశాలమైన గోదావరిలో చిన్నపాయగా పారుతున్న ప్రాణహిత మరో వైపు… ఇది కాళేశ్వర క్షేత్రం సమీపంలో త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం. అది సాదాసీదా ప్రాణహిత కాదు. తల్లి గోదావరికే ప్రాణం పోయబోతున్న ప్రాణహిత.. తెలంగాణ మాగాణానికి జీవం పోసే జీవహిత. తల్లీ నేనొస్తున్నా అంటూ నిండుకున్న గోదావరికి భరోసా. నీరు పల్లమెరుగు అనేది పాత సామెత. రీడిజైనింగ్ పుణ్యమా అని ఆ సామెతను తిరగరాసుకోవాల్సిందే. ఇకపై తెలంగాణ లో నీరు ఎత్తునెరుగబోతుంది. ప్రాణహిత నీరు పట్నాన్నెరుగుతుంది. ఆ కల ఈడేరే దిశగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వడివడిగా రేయి పగలు తేడా లేకుండా సాగిపోతున్నాయి. గోదావరిలో వరుసగా నిర్మిస్తున్న బ్యారేజీలలో, మేడిగడ్డ బ్యారేజి కాస్త ఆలస్యంగా అందుబాటులోకి వచ్చినా, నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు వేగవంతం అయ్యా యి. ఆగస్టులో కన్నెపల్లి వద్ద ప్రాణహిత నది నీటిని రివర్స్‌లో ఎత్తిపోసే ప్రక్రి య ప్రారంభం కానుంది. ఇక్కడ కనీసం ఆరు పంపులు బిగించి, పంపింగ్ ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్షం. ఇంజనీర్లు, ఏజెన్సీలు నిర్మాణాన్ని వేగవంతం చేసేలా చూస్తున్నారు. కనీసం 4 పంపులు ప్రారంభించేలా వేగంగా జరుగుతున్నాయి. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థంతో 11 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 6 పం పుల ప్రా రంభంపై ఇంజనీర్లు శ్రద్ధ పెట్టారు.

ఇక్కడి నుంచి 35 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్టు చేస్తా రు. ఇక్కడి నుంచి లిఫ్టు చేసిన నీటిని అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలిస్తారు. అక్కడి నుంచి రెండు దశల పంపింగ్‌తో మిడ్ మానేరుకు నీటిని చేరుస్తారు. అన్నారం బ్యారేజి, పంపుహౌజ్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 40 మెగావాట్ల సామర్థం ఉన్న 8 పంపులు బిగించాల్సి ఉంది. కనీసం నాలుగు పంపులు గడువులోపు ప్రారంభించేలా పనుల వేగం పెంచారు. ఇదే వేగం సుందిళ్ల బ్యారేజి, పంపుహౌజ్‌లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ 40 మెగావాట్ల సామర్థంతో 9 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. 27.70 మీటర్ల మేర నీటిని ఎత్తిపోస్తే నేరుగా ఎల్లంపల్లికి చేరుతాయి. ఎల్లంపల్లి నుంచి నీరు గ్రావిటీ ద్వారా పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో నిర్మిస్తున్న పంప్‌హౌజ్‌కు చేరతాయి. ఇక్కడ ఒక్కోటి 124.4 మెగావాట్ల సామర్థంతో 7 పంపులు నిర్మించాల్సి ఉంది. ఇక్కడి నుం చి 105 మీటర్లు ఎత్తిపోస్తే నీరు మేడారం రిజర్వాయర్‌కు చేరుతుంది. ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కరీంనగర్ జిల్లా రంగంపేట గ్రామంలో నిర్మిస్తున్న భూ గర్భ పంప్‌హౌజ్‌లోకి నీరు చేరుతుంది. నీటిని ఎత్తిపోస్తే నేరుగా వరద కాలువ మీదుగా మిడ్ మానేరు రిజర్వాయర్‌కు నీరు వెళుతుంది. ఈ పంప్‌హౌజ్‌లో ఆసియాలోనే అతి పెద్ద సామర్ధం కలిగిన మోటార్లు వినియోగిస్తున్నారు. 139 మెగావాట్ల సామర్థం కలిగిన బాహుబలి మోటార్లను ఇక్కడే వినియోగిస్తారు. ఏకంగా 115 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసి, వరద కాలువకు మళ్లించే పనులు చివరి దశకు చేరాయి. జూలై నెలాఖరుకు పూర్తిచేయాలన్న లక్షంతో పనిచేస్తున్నారు. మరింత సమయం తీసుకున్నా నీటిని లిఫ్టు చేయడం ఖాయం.

ఆసియాలోనే  అతిపెద్దది: ఇది గ్రేట్ ప్రాజెక్ట్. ఆసియాలోనే ఎక్కడా ఇటువంటి ప్రాజెక్టు లేదు. దీని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించింది. గత రెండున్నర దశాబ్ధాలుగా ఇటువంటి ప్రాజెక్టును ఎవరూ చేపట్టలేదు. ప్రభుత్వం ప్రత్యేక ఆసక్తి చూపించడమే కాకుండా వనరులు సమకూర్చడంతోనే ప్రాజెక్టు ఇంత వేగంగా నిర్మాణం జరుగుతోంది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, రెవె న్యూ, పోలీస్ సిబ్బంది, మొదలుకొని మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కెసిఆర్ వరకు అందరి సహకారం, సమన్వయంతోనే ఈ పురోగతి కనిపిస్తుంది. నదిని జీవనదిగా మార్చే గొప్ప ప్రయత్నం ఇది. వ్యక్తిగతంగా ఇందులో పనిచేసి, చరిత్రలో భాగస్వాములుగా మారుతున్నందుకు, ఈ ప్రాంతవాసిగా గర్వంగా ఫీలవుతున్నా. రేయింబవళ్లు మా ఇంజనీర్లంతా కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తున్నాము. వీలైనంత త్వరగా నీళ్లు ఇవ్వాలన్న దృఢసంకల్పంతో ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. – ఎన్. వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం, కరీంనగర్.

 ప్రతి ప్యాకేజీ ఓ ప్రాజెక్టే: కాళేశ్వరంలోని ప్రతి ప్యాకేజీ ఒక ప్రాజెక్టుతో సమానం. బ్యారేజీలు, పంపుహౌజ్‌లు, కెనాళ్లు.. ఇలా ఏ పని దానికదే ప్రత్యేకం. నిర్మాణంలో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. రైతులకు త్వరగా నీళ్లివ్వాలన్న తపనతో ఇంజనీరంతా శ్రమిస్తున్నాం. సమిష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. దీనికి ప్రభుత్వ సహకారం ఎంతో ముఖ్యం. ముఖ్యమంత్రి కెసిఆర్, నీటిపారుదశాలశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో ఈ ప్రాజెక్టు కల సఫలం కానున్నది. -హరిరాం, ఇఎన్‌సి, కాళేశ్వరం, హైదరాబాద్.

Kaleshwaram-Irrigation

సజీవ గోదావరి: ప్రభుత్వం చేపట్టిన రీఇంజనీరింగ్ ప్రతిపాదనల వల్ల గోదావరి నదిలో చాలా మటుకు సజీవంగా మారుతుంది. కనీసం 300 రోజుల పాటు నదిలో నీరు నిల్వ ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వరకు మొత్తం 470 కిలోమీటర్ల పొడవున్న గోదావరిలో 274 కిలోమీటర్ల మేర జలకళ వస్తుంది. శ్రీరాంసాగర్ (90 టిఎంసిల నిల్వ, 74 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్), సదర్‌మాట్ బ్యారేజ్ (1.58 టిఎంసిల నిల్వ, 17 కిలోమీటర్ల బ్యాక్ వాటర్), ఎల్లంపల్లి బ్యారేజ్ (20 టిఎంసిల నిల్వ, 36 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్), సుందిళ్ల బ్యారేజ్ (9 టిఎంసిల నిల్వ, 31 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్), అన్నారం బ్యారేజ్ (10 టిఎంసిల నిల్వ, 32 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్), మేడిగడ్డ బ్యారేజ్ (16 టిఎంసిల నిల్వ, 42 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్), తుపాకులగూడెం బ్యారేజ్ (7 టిఎంసిల నిల్వ, 30 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్), దుమ్ముగూడెం ఆనకట్ట (1.30 టిఎంసి, 12 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్)తో మొత్తం 146.30 టిఎంసిల నీటి నిల్వ నదిలోనే ఉంటుంది.

ఆలోచన కెసిఆర్‌ది.. ఆచరణ హరీశ్‌రావుది…: రీడిజైనింగ్‌లో ఆలోచన ముఖ్యమంత్రి కెసిఆర్‌దైతే ఆచరణ హరీశ్‌రావుది. నీళ్లున్న చోట నుంచి తీసుకోవాలని గూగుల్ మ్యాప్ సాయంతో ముఖ్యమంత్రి బ్లూ ప్రింట్ గీసినా,  క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తూ చిక్కుముడులు విప్పుకుంటూ వడివడిగా ముందుకు సాగుతున్నది ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు మాత్రమే. గతంలో ఎన్నడూ లేని విధంగా, మరెవ్వరూ సాహసం చేయలేని విధంగా నిత్యం కాళేశ్వర యజ్ఞంలో హరీశ్  నిమగ్నమయ్యారు. వాస్తవాలు, ఆచరణ సాధ్యమా కాదా.. అనే రెండు అంశాలనే పరిగణనలోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవడంతో పాత ప్రాజెక్టులు చివరి దశకు చేరాయి. పెండింగ్‌లో ఉన్న పనుల పూర్తికి, కొంత భారమైనా సరే తాజా ధరలను వర్తింపచేయాల్సిందేనని గ్రహించి, దాన్ని అమలు చేశారు. నిధులెన్నిచ్చినా,  నిరంతర పర్యవేక్షణ లేకపోతే పనులు ముందుకు సాగవని గుర్తించారు. కీలకమైన భూసేకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల విషయంలో కేంద్ర మంత్రులు, జలవనరుల శాఖ అధికారులతో సంబంధాలు నెరుపుతూ ప్రాజెక్టుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. వచ్చే వానాకాలం లోపు పంపులు ప్రారంభించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి వీలైనంతగా కృషి చేస్తున్నారు. మరో వైపు ఏజెన్సీలకు గడువులు నిర్ధేశించి మరీ రోజువారీ పురోగతిని వాట్సాప్‌లో సమీక్షిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రనే తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో పనులు నడిపించడానికి తాను కూడా మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాడు.

రికార్డులే… రికార్డులు: * శీఘ్రగతిన కాళేశ్వరం ఎత్తిపోతల పనులు, * వందల కొద్దీ భారీ యంత్రాల వినియోగం, * వేల సంఖ్యలో పని చేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు
అదో మహాయజ్ఞం… పంట పొలాలను సస్యశ్యామలం చేయడానికి జరుగుతున్న భగీరథ య త్నం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సాధ్యమైనంత త్వ రగా ఆచరణలోకి తేవడానికి పనులు వేగంగా చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇది. దాదాపుగా రూ.80, 50౦ కోట్లతో అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకం రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రయోజనకరం. గోదావరి నది నుంచి రోజుకు రెండు టిఎంసిల చొప్పున 90 రోజుల పాటు 180 టిఎంసిలు మళ్లించడం ఈ పథకం ఉద్దేశం. వందలాది కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద లిప్టులు, ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్ ఏర్పాటు, భూగర్భ పంప్‌హౌజ్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీలు,.. ఇలా అనేక విశిష్టతల సమాహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. సమాంతరంగా పనులు చేస్తూ, నిరంతరం శ్రమిస్తున్నారు కార్మికులు. ఈ ఖరీఫ్‌లో నీళ్లు అందించడమే లక్షంగా నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి.