Home దునియా శరావతి సందడి

శరావతి సందడి

 Telugu Story about Sharavati River

పశ్చిమకనుమల్లో పుట్టి సుమారు 130 కి.మీలు దూరంలో కర్నాటకలో ప్రవేశించి సముద్రంలో కలిసిపోతుంది శరావతి నది. దేశంలోనే పురాతనమైన, అతి పెద్ద జల విద్యత్ కేంద్రాల్లో ఒకటి శరావతి మీదే ఉంది. అతి ఎత్తయిన జలపాతాన్ని సృష్టించిన నది కూడా ఇదే…

మన దేశంలో పశ్చిమాభిముఖంగా ప్రవహించే నదుల్లో ముఖ్యమైనది శరావతి. కర్నాటకలోని షిమోగా జిల్లా తీర్దహళ్లి తాలూకాలో పుట్టిన శరావతి నది పుట్టుక వెనుక రామాయణ కాలంనాటి పురాణగాథ ఉంది. సీతారాములు అరణ్యవాసంలో ఉండగా, సీతమ్మ దప్పికను తీర్చేందుకు రాముడు బాణం నుంచి జలధారను పుట్టించాడు అదే నదిగా మారిందని కథనం. శ్రీరాముడు సంధించిన శరం నుంచి పుట్టింది కనుక ఈ నదికి శరావతి అనే పేరువచ్చిందట. నది జన్మించిన ప్రదేశం అంబుతీర్థం అని ప్రసిద్ధి. దారిలోని నందిహూల్ హరిద్రావతి, మావినహూల్, హిల్‌కుంజి, ఎన్నెహూల్ హూర్లిహూల్ నాగోడిహైల్ అనే ఉపనదుల్ని తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. దేశంలోని అతి పెద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టులలో ఒకటైన హిరె భాస్కర ఈ నది మీదే ఉంది. ఇది 1200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

ఇదే కాక లింగనమక్కి, గెరుసొప్ప అనే మరో రెండు ఆనకట్టలున్నాయి. లింగనమక్కి ఆనకట్టను మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో 1960లో నిర్మించారు. దీని పొడవు 2.4కి.మీ సామర్థం 152టి.ఎం.సిలు. తింగనమక్కి డ్యాం నుంచి వచ్చే నీటి వల్ల హున్నె మరడు ద్వీపం ఏర్పడింది. ఇది జలక్రీడలకు ప్రసిద్ధి. భారతదేశంలోకెల్లా అతి ఎత్తయిన జలపాతం జోగ్. దీన్నే గెరుసొప్ప. జోగడా గుండి జలపాతం అని కూడా పిలుస్తారు. శరావతి నది రాజ, రోరర్ రాకెట్ రాణి అనే నాలుగు పాయలుగా విడిపోయి 829 అడుగుల ఎత్తునుంచి కిందకి దూకుతుంది. అలా ఏర్పడిందే ఈ జోగ్ జలపాతం. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో వర్షాల వల్ల నది, జలపాతాల ఉధృతి పెరుగుతుంది. జోగ్‌ను చూడటానికి ఆగస్టు, డిసెంబరుల మధ్య సమయం అనుకూలం. అందుకే ఆయా సమయాల్లో ఇక్కడికి ఎక్కువమంది పర్యటకులు వస్తారు.

భారతీయ సంతతి పశువులను రక్షించే రామచంద్ర మఠం శరావతి తీరాన్నే హూసనగర పట్టణంలో ఉంది. ఈ నది నీటిలో కనుక్కున్న చేప జాతులకు బటాసియో శరావటైనెసిస్, స్కిస్టురా శరావటైనెసిస్ అంటూ ఈ నది పేరునే కలిపి పెట్టడం విశేషం. ఈ నదీ తీరంలో కొంత భాగాన్ని అటవీ జంతు సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. ఇక్కడి అభయారణ్యంలో సింహపు తోకగల మాకాక్యు అనే జంతువుకు సంరక్షణ కేంద్రం కూడా. ఈ జంతువు ఇప్పటికే అంతరించిపోతున్న జాతిలో చేరటం వల్ల వాటిని ఇక్కడ జాగ్రత్తగా కాపాడుతున్నారు. శరావతీ తీరం అడవుల్లో పెద్దపులి, చిరుత ( బ్లాక్ పాంథర్), రేచ్కుక, మచ్చల జింక, ముక్కు జింక, మామూలు లాంక్వర్ బోనెట్ మాకాక్చు, మలబార్ జోయింట్ స్కిలర్, జెయింట ఫ్లయింగ్ స్కిరల్, పోర్కుపైన ఒటేర్, పాంగోలిన్, నల్లతాచు, పైథాన్,రాట్ స్నేక్, మొసలి, మోనిటర్ బల్లి వంటి అనేక రకాల జీవ జాతులున్నాయి. పశ్చిమ కనుమల్లో పుట్టి 128 కి.మీ లు దూరం కన్నడనాట ప్రయాణించి, పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. ప్రకృతి ప్రేమికులకు శరావతి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.