Home తాజా వార్తలు మున్సిపోల్స్ కళ

మున్సిపోల్స్ కళ

Municipal Elections

 

మొదలైన ఎన్నికల సందడి

121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు నెలాఖరున నోటిఫికేషన్?

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండడంతో ఎన్నికల సంఘం అధికారులు సైతం తగు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ఏ ర్పాట్లను దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోం ది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 141 స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 128 మున్సిపాలిటీలు ఉండగా 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే పాలకమండలి గడువు తీరిన 121 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు మాత్రం ప్రస్తుతం ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని…. ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన ఆదారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ఖరారు చేస్తుంది. ఇదిలా ఉండగా మున్సిపాలి. టీలు, కార్పొరేషన్ల పరిధిలో జనాభా లెక్కల ప్రకారంగా వార్డుల విభజన జరిగినప్పటికీ వార్డుల రిజర్వేషన్ల ఖరారుతో పాటు మేయర్ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేక పరోక్షంగా నిర్వహించాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో ఎన్నికలకు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించనున్నారు. పోలింగ్ బూత్‌లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలపై చర్చించి ఎన్నికల తేదీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు వార్డుల రిజర్వేషన్ల ప్రకటన చేయడం, వాటిపై రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనీసం పదిహేను రోజుల పైగా సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల చివరి వారంలో విడుదల చేసి సంక్రాంతి పండగ అనంతరం ఎన్నికల నిర్వహణను పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చకచకా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు మరింత జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Completed arrangements for Municipal Elections