Home తాజా వార్తలు అమ్మ… ఈటలా ?!

అమ్మ… ఈటలా ?!

etela-rajender

చట్టం ఊపిరిపోసుకోకముందే అడ్డుకునే ప్రయత్నాలకు లోపలి మనిషి సహకారం

ఇటీవల ప్రగతి భవన్‌లో రెవెన్యూ కొత్త చట్టంపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. అనేక సున్నిత అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కీలకమైన ఈ సమావేశం వివరాలను రహస్యంగా ఉంచాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే సమావేశ వివరాల కోసం ఎదురు చూస్తున్న కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి మంత్రి ఈటల రాజేందర్‌నుశామీర్‌పేటలోని ఆయన నివాస గృహంలో కలిసినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఆ వెంటనే చట్టం మార్పుల వివరాలు బయటకు రావడం, ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ రూపొందించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

మన తెలంగాణ/ హైదరాబాద్:కొండంత అవినీతికి తావిస్తున్న కాలం చెల్లిన రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలకు లోపలి మనిషే మోకాలడ్డుతున్నారా? కొత్త చట్టం ఊపిరి పోసుకోకముందే గుండెల్లో ‘ఈటె’ను దింపుతున్నారా? ఈ వ్యవస్థలోని అవినీతిని సమూలంగా రూపుమాపే కొత్త చట్టం వివరాలు బయటకు రాకముందే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న వారితో ఓ మంత్రి సన్నిహితంగా మెలగడం వివాదాస్పదంగా మారింది. కొత్త చట్టంలోని విషయాలను తెలుసుకోవడం కోసం రెవెన్యూశాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అధికారుల ద్వారా లేదా మంత్రుల ద్వారా చట్టం మార్పులను తెలుసుకుని అందుకు వ్యతిరేకంగా పావులను కదపాలనేది ఆ అధికారుల ప్రయత్నం.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రగతి భవన్‌లో రెవెన్యూ కొత్త చట్టంపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఆనేక సున్నిత అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కీలకమైన ఈ సమావేశం వివరాలను రహస్యంగా ఉంచాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే సమావేశ వివరాల కోసం ఎదురు చూస్తున్న కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి మంత్రి ఈటల రాజేందర్‌ను శామీర్‌పేటలోని ఆయన నివాస గృహంలో కలిసినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఆ వెంటనే చట్టం మార్పుల వివరాలు బయటకు రావడం, ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ రూపొందించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఆర్డీవో లచ్చిరెడ్డి, మంత్రి ఈటల రాజేందర్‌ల మధ్య జరిగిన సమావేశం, ఆ తర్వాత ఉద్యోగులు శరవేగంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అనేక సందేహాలను లేవనెత్తుతున్నది. రహస్యంగా ఉండాల్సిన కీలక అంశాలు కొన్ని గంటల వ్యవధిలోనే బయటకు లీక్ కావడం దానిపై సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అసలు విషయాలు బయటికి ఎలా పొక్కాయని ఆరాతీయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఈటల రాజేందర్‌ను కలిసిన విషయం బయటపడినట్లుగా తెలియవచ్చింది. దేశంలోనే ఆదర్శ పరిపాలనకు మోడల్‌గా నిలిచి పలు రంగాల్లో వరుసగా అనేకానేక సంస్కరణలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవల రెవెన్యూ చట్టానికి కొత్త దశదిశ తీసుకొచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు.

ఈ కొత్త చట్టంపై ఇటీవల కాలంలో విస్తృత స్థాయిలో చర్చజరుగుతున్నది. ఈ చట్టం నూతన సంస్కరణలు అమలులోకి వస్తే అవినీతికే కేరాఫ్‌గా మారిన రెవెన్యూ శాఖ వర్గాల అవినీతికి బ్రేక్‌పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులను తెలుసుకోవడం కోసం రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు నాయకులమని చెప్పుకునే నేతలు పలు మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చట్టం కార్యరూపం దాల్చకముందే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో ఉండే మంత్రులను, జిల్లా పాలనకు నాయకత్వం వహించే కలెక్టర్లను రాజధాని హైదరాబాద్‌కు పిలిపించి అత్యున్నత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కెఆసిర్ నిర్వహించారు. చట్టంలోని ప్రతిపాదిత అంశాలను వివరించి మంత్రులు, కలెక్టర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొత్త చట్టం అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చేయడం కోసం మంత్రులు, కలెక్టర్ల సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటన్నింటిని క్రోడీకరించి చట్టాన్ని మరింత మెరుగుగా, పారదర్శకంగా తీర్చిదిద్దడమే ఈ అత్యున్నత సమావేశం లక్షం.
అత్యున్నత స్థాయిలో జరిగిన సమావేశ వివరాలపై అధికారులు, మంత్రులు నోరువిప్పకున్నా ఓ మంత్రి మాత్రం సమావేశ చర్చల వివరాలు తెలియజేసినట్లుగా రెవెన్యూ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. మంత్రితో సమావేశమై బయటికి వచ్చినవెంటనే ఆర్డీవో లచ్చిరెడ్డి, మేడ్చల్ ఎమ్మార్వో గోవర్థన్‌ను కలిశారు. ఆ తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైన రవీందర్‌రెడ్డిని రహస్య ప్రాంతానికి పిలిపించుకున్నారు. అక్కడే కొత్త రెవెన్యూ చట్టం మార్పుల గురించి, వాటిని ఎలా వ్యతిరేకించాలనే విషయాల గురించి అర్ధరాత్రివరకు మంతనాలు జరిపారు. జిల్లా స్థాయినుంచి హైదరాబాద్‌లో రెవెన్యూ శాఖను చూస్తున్న సోమేష్ కుమార్ వరకు ఉద్యోగుల ద్వారా సంస్కరణలకు వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇవ్వాలని ప్రణాళికను రూపొందించారు. తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం తీసుకురాదలిచిన సవరణలను వ్యతిరేకించి అడ్డుకోవడమే ఈ ఉద్యోగ సంఘాల నాయకుల లక్షం.
ఇందుకోసం ఈ నాయకులు రెవెన్యూ చట్టంలో తహసీల్దార్ల అధికారాలను తగ్గిస్తారని, వారిని సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులుగా మారుస్తారనే ప్రచారం మొదలు పెట్టారు. ఈ సంస్కరణలను ఆదిలోనే అడ్డుకోకపోతే రెవెన్యూ శాఖ మిగలదని వారు చర్చించుకున్నారు. ఈ చట్టానికి సంబంధించి ప్రభుత్వంవైపునుంచి జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి తెలియజేస్తున్నారని, ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది మేల్కొనకపోతే రెవెన్యూశాఖ కొంప మునిగే ప్రమాదముందని ఆ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన ఈ విషయంపై అత్యున్నత స్థాయి వ్యక్తి ఒకరు మాట్లాడుతూ ‘ఇలాంటి కీలక విషయాలను బయటకు లీక్ చేసేవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారి గొయ్యిని వారే తవ్వుకున్నట్లే. ఎంతటి వారైనా చర్య తప్పదు’ అన్నారు.

conference on Revenue New Law at Pragati Bhavan