Saturday, April 20, 2024

పంజాబ్ సంకేతాలు

- Advertisement -
- Advertisement -

Central Govt repression on Farmer movement

పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా ఉండలేము. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండున్నర మాసాలుగా సాగుతున్న రైతు ఉద్యమం ఈ ఫలితాలకు అరుదైన ప్రత్యేకతను కలిగిస్తున్నది.ఆ ఉద్యమం మొదలైన తర్వాత పంజాబ్‌లో జరిగిన మొదటి ఎన్నికలివి. ఉద్యమం కేంద్ర బిందువే పంజాబ్, మూడు కొత్త వ్యవసాయ చట్టాలు ఆర్డినెన్స్‌ల రూపంలో అంకురించినప్పటి నుంచి వాటికి వ్యతిరేకంగా అట్టుడికినట్టు ఆ రాష్ట్రం ఉడికిపోతున్నది, వ్యవసాయ ఉత్పత్తుల మండీ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేనంతగా అక్కడ బలంగా వేళ్లూనుకున్నది ఈ మూడు కారణాల వల్ల ఈ ఎన్నికల ఫలితాలను రైతు ఉద్యమమే ఎక్కువగా ప్రభావితం చేసిందని భావించక తప్పడం లేదు. ఆ ఉద్యమాన్ని అణచివేస్తున్న కారణంగా భారతీయ జనతా పార్టీని దూరంగా ఉంచి దానికి ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారని అనుకోడానికి అవకాశం కలుగుతున్నది. శిరోమణి అకాలీదళ్ కూడా చివరి నిమిషంలో ఎన్‌డిఎ కూటమి నుంచి తప్పుకొని కేంద్రంలో తనకున్న ఒకే ఒక్క మంత్రి పదవిని వదులుకొని రైతు ఉద్యమానికి మద్దతిస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సైతం రైతులకు అండగా నిలిచింది. అయినప్పటికీ ఆ రెండు పార్టీలను పెద్దగా ఆదరించకుండా కాంగ్రెస్‌కు పంజాబ్ మునిసిపల్ ఓటర్లు పట్టం కట్టడం గమనార్హం. ఇందులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ పాత్రను కొట్టి పారేయలేము. ఎనిమిది కార్పొరేషన్లు, 109 కౌన్సిళ్లు, నగర పంచాయతీలు కలిసి మొత్తం 117 మునిసిపాలిటీలకు ఈ నెల 14 ఆదివారం నాడు ఎన్నికలు జరిగాయి. మొత్తం ఎనిమిది కార్పొరేషన్లనూ గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్, నగర పంచాయతీల్లో కూడా తిరుగులేని విజయాలు సాధించింది. పోలింగ్ జరిగిన 2218 వార్డుల్లో 1373 కాంగ్రెస్ కైవసం కాగా, దానికి బహు దూరంగా 285 వార్డులతో శిరోమణి అకాలీదళ్ రెండో స్థానంలో నిలబడింది. 66 వార్డులతో ఆప్ మూడోదిగా, 49తో బిజెపి నాలుగో స్థానంలో రావడం గమనార్హం. 392 చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అంటే నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనకు ఈ ఫలితాలను ఒక మాదిరి క్లీన్‌చిట్ అనడం కంటే రైతు ఉద్యమం రగిల్చిన బిజెపి వ్యతిరేకత పర్యవసానమే అనుకోవాలి. 53 ఏళ్ల తర్వాత మొదటి సారిగా భటిండా మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసమైంది. రైతు ఉద్యమం ప్రభావంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ సొంత నియోజక వర్గ కేంద్రం భటిండా. అక్కడ ఆ పార్టీ నెగ్గలేకపోడం గమనార్హం. 20-14 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఆప్ ఆ తర్వాత కొంత దెబ్బతిన్నా రైతు ఉద్యమ నేపథ్యంలో అది పంజాబ్‌లో తిరిగి బాగా పుంజుకుంటున్నదనే అభిప్రాయం కలిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న పంజాబ్ రైతు నేతలు కాంగ్రెస్ కంటే ఆప్‌కి, అరవింద్ కేజ్రీవాల్‌కే ఎక్కువ గౌరవం ఇస్తున్నారనిపించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆప్ పట్ల అది ప్రతిఫలించలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆప్ మంచి విజయాలు సాధిస్తుందని అది తన అవకాశాలను దెబ్బ తీస్తుందని కాంగ్రెస్ భయపడింది. కాని అందుకు విరుద్ధంగా జరగడం దానికి మరో చెప్పుకోదగిన ఊరట అనవచ్చు. ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్నికల్లో తనదే పై చేయి అవుతుందనే ధీమా భారతీయ జనతా పార్టీలో అపారంగా వేళ్లూనుకొని ఉంది. తన ఎన్నికల మేనేజ్‌మెంట్ చతురత పట్ల దానికంత నమ్మకం. గత నవంబర్ నాటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ధీమా రుజువైంది. బొటాబొటీ ఆధిక్యతతోనైనా ఎన్‌డిఎ కూటమి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. అటువంటి ధీమాలు, మితిమించిన ఆత్మవిశ్వాసాలు ఎల్లకాలం నిలబడవని పంజాబ్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆ మంటలకు ఆజ్యం పోస్తూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌లు రోజురోజుకీ మరింత ప్రియమైపోతున్నాయి. సుదీర్ఘ కరోనా లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు ఊడిపోయి నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. ఇంకొక వైపు ఎదురులేని సంస్కరణల బాట పట్టి ప్రైవేటు సామ్రాజ్య స్థాపనకు ప్రధాని మోడీ ప్రభుత్వం అమితోత్సాహంతో తోడ్పడుతున్నది. వీటి ప్రభావం ప్రజలను భారతీయ జనతా పార్టీకి దూరం చేస్తుంది. అందుచేత కమల నాథులు ఆత్మవిమర్శ చేసుకొని తమ తీరును తగిన విధంగా సవరించుకోవలసి ఉంది. ముఖ్యంగా కొత్త రైతు చట్టాలు, విద్యుత్తు సంస్కరణల బిల్లు విషయంలో పంథా మార్చుకోవలసి ఉంది.

Congress clean sweep in Punjab Civic bodies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News