Home జాతీయ వార్తలు పార్లమెంట్ సమావేశాల జాప్యంపై రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు

పార్లమెంట్ సమావేశాల జాప్యంపై రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు

cngrs

 న్యూఢిల్లీ: పార్లమెం ట్ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తోందని, ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరుతూ కాం గ్రెస్ సీనియర్ నేతలు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి లేఖ అందజేశారు. ఈ లేఖలోని సారాంశం ప్రకారం ప్రజాస్వామ్యానికి వేదికలాంటి పార్లమెంటులో కీలకమైన ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు పార్లమెంటు సభ్యులకు అవకాశం ఉంటుందని, అటువంటి పార్లమెంటును కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు, పనితీరును సమీక్షించడానికి పార్లమెంట్ ఒక వేదికగా పనిచేస్తుంది అని లేఖలో తెలిపారు. కానీ, కేంద్రం గుజరాత్ ఎన్నికలను కారణంగా చూపించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలన ఆలస్యం చేయడం సమంజసం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావిస్తూ కేంద్రం ఉద్దేశ పూర్వకంగా వాయిదా వేస్తుందంటూ మోడి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలను తప్పించుకునేందుకు, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంటు సమావేశాలను ఆలస్యంగా తక్కువ రోజులు నిర్వహించే ప్రయత్నం చేస్తుందంటూ కేంద్ర వైఖరిని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికయినా రాష్ట్రపతి జోక్యం చేసుకొని పార్లమెంట్ సమావేశాలను సాధ్యమయినంత త్వరగా నిర్వహించేలా చూడడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడలని లేఖలో కోరారు. గురువారం రాష్ట్రపతిని కలసిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాంనబి ఆజాద్, పార్లమెంట్ లో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖార్గే, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, జోతిరాదిత్య సింధియా లు ఉన్నారు