పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తదుపరి ప్రభుత్వ స్థాపన విషయం గురించి ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి స్పందించారు. ఇక్కడ అసెంబ్లీలో బలపరీక్ష దశలో కాంగ్రెస్ డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. తరువాత రంగస్వామి సోమవారం విలేకరులతో మాట్లాడారు. తమంతతాముగా వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే విషయాన్ని పరిశీలిస్తామని విలేకరుల ప్రశ్నకు జవాబుగా చెప్పారు. పుదుచ్చేరిలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న దశలో వి నారాయణ స్వామి నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ దశలో అసెంబ్లీలో ఆధిక్యత ఉన్న ప్రతిపక్షం వైఖరి ఏమిటనేది కీలకం అయింది.
ఎన్ రంగస్వామి నాయకత్వపు కాంగ్రెస్, తోడుగా బిజెపి వ్యవహారశైలితోనే , ఫిరాయింపుల ప్రోత్సాహంతోనే తమ ప్రభుత్వం కూలిందని నారాయణస్వామి విమర్శించారు. ప్రజలు తమకు తిరిగి పట్టం కడుతారనే దీమా వ్యక్తం చేశారు. అయితే ఈ వాదనను రంగస్వామి తోసిపుచ్చారు. తరువాతి పరిణామం ఏమిటనేది తాను బిజెపి సహా ఇతర తమ మిత్రపక్షాలతో కలిసి నిర్ణయించుకుంటామని, ప్రభుత్వ ఏర్పాటుకు తొందరలేదని,అయితే అవకాశం వస్తే కాదనేది లేదన్నారు. అయితే తరువాతి ప్రభుత్వం ఏదైనా వచ్చే మే వరకే అధికారంలో ఉంటుందని ఈ విషయాన్ని కూడా తాము ఆలోచించుకుంటామని తెలిపారు. ఏది ఏమైనా బలం ఉన్నందున తమకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ప్రభుత్వ స్థాపనకు ఆహ్వానం వస్తే దీనిపై ఆలోచించుకుంటామని, ఇందులో తప్పేమీ లేదు కదా అని ప్రశ్నించారు.