*అడుగడుగున బస్సుయాత్రకు ఘన స్వాగతం
*కళాకారుల నృత్యాలు డప్పు దరువులతో దద్దరిల్లిన సంగారెడ్డి
మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్రకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం లభించింది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగున బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికారు. కళాకారుల నృత్యాలు డప్పు దరువులతో సంగారెడ్డి పట్టణం దద్దరిల్లింది. సాయం త్రం 5 గంటలకే బస్సుయాత్ర సంగారెడ్డికి చేరుకుంటుందనుకున్నా గంటన్నరకుపైగా ఆలస్యంగా సంగారెడ్డి చౌరస్తాకు చేరుకున్న బస్సుయాత్రకు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఘన స్వాగతం లభించింది. యువత పెద్ద ఎత్తున బైక్‌లతో బస్సుముందు ర్యాలీగా సాగారు. వారిని అనుసరిస్తూ నృత్యకళాకారులు డప్పు దరువులతో ఆకట్టుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా జిల్లాలోని అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్‌పార్టీ అభిమానులు, నాయకులు ప్రజలను భారీగా బహిరంగ సభకు తరలించారు. సంగారెడ్డిలోని గంజీమైదాన్‌లో బహిరంగసభకు ఏర్పాట్లు సాగాయి. గత రెండు రోజుల నుండి సంగారెడ్డిలో జరిగే ప్రజా చైతన్య బస్సుయాత్ర కొరకై నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులన్నీ ప్లెక్సీలతో దర్శనమిచ్చాయి. రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర్ వంటి నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. మంగళవారం ఉదయం నుండే సంగారెడ్డిలో సందడి నెలకొంది. ఓ పక్క పోలీసులు అడుగడుగున ట్రాఫిక్‌ను చక్కదిద్దుతు ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.